Saturday, July 18, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంమూసీ ఆశాజనకం

మూసీ ఆశాజనకం

- Advertisement -

ప్రాజెక్టులో 80 శాతానికి పైగా నీరు
3.54 టీఎంసీల నీటి నిల్వతో 
ఖరీఫ్‌కు ఆశలు
అయినా రైతుల్లో ఆందోళనే
చిరు జల్లులు తప్ప భారీ వర్షాలే లేవు
వర్షాభావం, నీటి పొదుపుపై
 అధికారుల హెచ్చరికలు
నవ తెలంగాణ-సూర్యాపేట

​ఎల్‌‌నినో, వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో రాష్ట్రంలో రైతులు ఆందోళనలో ఉన్నారు. గోదావరి పరీవాహక ప్రాంతాల్లో ప్రాజెక్టులు, భూగర్భజలమట్టాలు తగ్గుతూ ఉన్నాయి. నాగార్జునసాగర్, శ్రీరాంసాగర్ వంటి ప్రధాన ప్రాజెక్టుల్లో నీటి కొరత తీవ్రంగా ఉంది. అయితే మూసీ ప్రాజెక్టు పరిస్థితి కొంత మెరుగ్గా ఉంది. ఒకరకంగా స్థానిక రైతులకు ఆశాజనకంగా నిలిచింది. సూర్యాపేట జిల్లాలోని మూసీ ప్రాజెక్టు మొత్తం 4.460 టీఎంసీల సామర్థ్యం ఉండగా.. ప్రస్తుతం 3.54 టీఎంసీల నీరు నిల్వ ఉంది.
దాదాపు 80 శాతానికి పైగా నీటితో నిండి ఉన్నట్టు అధికారిక గణాంకాలు చెబుతున్నాయి. ప్రస్తుతం ఆశాజనకంగా నీటి నిల్వలు ఉన్నప్పటికీ, ఎల్‌‌నినో వల్ల రాబోవు పరిస్థితులు ఎలా ఉంటాయో అర్థం కావడం లేదని రైతులు ఆందోళన చెందుతున్నారు. ఆశించిన స్థాయిలో వర్షాలు లేవు. జిల్లా అంతటా ఒకేరకంగా లేదు. ​కుడి, ఎడమ కాలువల ద్వారా సూర్యాపేట, నల్లగొండ జిల్లాల్లో సుమారు 30 వేల ఎకరాల ఆయకట్టుకు మూసీ ప్రాజెక్టు ద్వారా సాగునీరు అందుతోంది. ఖరీఫ్ సీజన్‌లో ఈ ప్రాజెక్టే వారికి జీవనాధారంగా నిలిచింది. ప్రస్తుతం ఉన్న నీటి నిల్వలు, రాబోయే రోజుల్లో వచ్చే ఇన్‌ఫ్లోలను పరిగణనలోకి తీసుకుంటే ఖరీఫ్ సాగునీటి అవసరాలను తీర్చే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. అయితే, రుతుపవనాల ప్రభావం ఆశించినంతగా లేకపోవడం వల్ల ఎగువన నుంచి వరదలు లేకపోతే సమస్యగానే ఉంటుందని అధికారులు చెబుతున్నారు. అందుబాటులో ఉన్న నీటిని అత్యంత పొదుపుగా, విచక్షణతో వినియోగించుకోవాలని నీటిపారుదల శాఖ రైతులకు సూచిస్తోంది. జిల్లాలో నీటి లభ్యత ఖచ్చితంగా లేని ప్రాంతాల్లో వరికి బదులుగా తక్కువ నీటితో సాగయ్యే ప్రత్యామ్నాయ పంటలను ఎంచుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. ​మూసీ ప్రాజెక్టు ద్వారా ప్రధానంగా సూర్యాపేట జిల్లాలోని మూడు మండలాల రైతులు లబ్ది పొందుతున్నారు. సూర్యాపేట, చివ్వెంల, పెన్‌పహాడ్ మండలాల పరిధిలోని 22 గ్రామాలకు ఈ ప్రాజెక్టు ద్వారా సాగునీరు అందుతోంది. సోలిపేట, టేకుమట్ల, యండ్లపల్లి, యర్కారం, బాలెంల, ఇమాంపేట, కాసరాబాద్, కేసారం, రామచంద్రా పురం, రామన్నగూడెం, రామారం, పిన్నాయిపాలెం, తాళ్ల ఖమ్మంపహాడ్, ఆరెగూడెం, దాస్ తండా, జాటోత్ తండా, లక్ష్మీ తండా, రాజ్ నాయక్ తండా, రామ్లా తండా, సాపావత్ తండా, హనుమ నాయక్ తండా, రత్నపురం గ్రామాల రైతులు ఈ ప్రాజెక్టుపై ఆధారపడి సాగు చేస్తున్నారు. ప్రస్తుతం మూసీ ప్రాజెక్టు లో ఉన్న నీటి నిల్వలు రైతులకు కొంత భరోసా కల్పిస్తున్నప్పటికీ, ఆకాశం వైపు ఆశగా చూస్తున్న అన్నదాతకు మంచి వర్షాలే శాశ్వత పరిష్కారమనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -