Saturday, July 18, 2026
E-PAPER
Homeజాతీయం1/70 చట్టం, జిఒ నెంబర్‌ 3 అమలుకు…కదం తొక్కిన ఆదివాసీలు

1/70 చట్టం, జిఒ నెంబర్‌ 3 అమలుకు…కదం తొక్కిన ఆదివాసీలు

- Advertisement -

పాడేరులో భారీ ర్యాలీ,
 ఐటిడిఎ ముట్టడి
హక్కులను హరిస్తే 
ఊరుకునేది లేదని హెచ్చరిక
ప్రభుత్వం స్పందించకపోతే 
ఆగస్టు 8, 9 మన్యం బంద్‌
పాడేరు :
గిరిజన చట్టాలు, హక్కుల పరిరక్షణకు, ఎన్నికల హామీల అమలుకు అల్లూరి సీతారామరాజు జిల్లా కేంద్రం పాడేరులో శుక్రవారం ఆదివాసీలు పెద్ద ఎత్తున కదం తొక్కారు. తాము అధికారంలోకి వస్తే జిఒ నెంబర్‌ 3‌కి ప్రత్యామ్నాయంగా మరో జిఒ తెస్తామని అరకు ఎన్నికల సభలో ముఖ్యమంత్రి చంద్రబాబు ఇచ్చిన హామీని వెంటనే అమలు చేయాలని, 1/70 చట్టాన్ని పటిష్టంగా అమలు పర్చాలని, ఈ చట్టంపై సుప్రీంకోర్టులో దాఖలైన పిటిషన్‌‌పై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వైఖరిని స్పష్టం చేయాలని, అల్లూరి జిల్లాను జోన్-1లోనే కొనసాగించాలని డిమాండ్‌ ‌చేస్తూ తలపెట్టిన ఈ ఆందోళనకు ఏజెన్సీ నలుమూలల నుంచి వేలాది మంది ఆదివాసీలు స్వచ్ఛందంగా తరలివచ్చారు. ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానం నుంచి ర్యాలీగా బయలుదేరి ఐటిడిఎని ముట్టడించి అక్కడ భారీ ఆందోళన చేపట్టారు. ఆదివాసీ గిరిజన సంఘం, ఇతర ఆదివాసీ, ప్రజాసంఘాల ఆధ్వర్యంలో ఈ ఉద్యమం సాగింది. కూడా రాధాకృష్ణ అధ్యక్షత వహించారు. గిరిజన చట్టాలను పటిష్టంగా అమలు చేయాలని ముక్తకంఠంతో ఆదివాసీలంతా నినదించారు. తమ డిమాండ్లపై ప్రభుత్వం తక్షణ చర్యలు చేపట్టకపోతే ఆందోళన మరింత ఉధృతం చేస్తామని అల్టిమేటం జారీ చేశారు. ఆదివాసీ అధికార్‌ ‌రాష్ట్రీయ మంచ్‌ ‌జాతీయ కార్యవర్గ సభ్యులు పి.అప్పలనర్స మాట్లాడుతూ జిఒ నెంబర్‌ 3 రిజర్వేషన్‌‌పై ముఖ్యమంత్రి చంద్రబాబు ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని డిమాండ్ చేశారు. వైసిపి ప్రభుత్వ హయాంలో 2020 ఏప్రిల్ 22న జిఒ-3ని రద్దు చేస్తూ సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చినప్పటి నుంచి ఆదివాసీలు జిఒ నెంబర్‌ 3 రిజర్వేషన్‌‌ను కాపాడాలని డిమాండ్ చేస్తూ వివిధ రూపాల్లో వినతులు, విజ్ఞప్తులు, నిరసనలు, ఆందోళనలు చేస్తున్నారని గుర్తు చేశారు. గత వైసిపి ప్రభుత్వం, ప్రస్తుత టిడిపి కూటమి ప్రభుత్వం ఆదివాసీల రిజర్వేషన్ సమస్య పరిష్కారంలో నిర్లక్ష్యంగా వ్యవహరించాయని తెలిపారు. ఉమ్మడి విశాఖ జిల్లాలో భాగమైన ప్రస్తుత అల్లూరి జిల్లాను జోన్-1లో కొనసాగించాలని డిమాండ్ చేశారు. జోన్-1లోనే గిరిజన యువతకు ఉద్యోగావకాశాలు, ఉద్యోగుల బదిలీలు, ఉద్యోగోన్నతుల్లో న్యాయం జరుగుతుందని, ఉద్యోగావకాశాలు లభిస్తాయని వివరించారు. 1/70 చట్టం అమల్లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాయన్నారు. ఈ నెల 24న రంపచోడవరం పర్యటనకు వస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టమైన ఆదేశాలు ఇవ్వాలని, లేనిపక్షంలో ఆగస్టు 8, 9 తేదీల్లో మన్యం బంద్‌ చేపడతామని హెచ్చరించారు.

అరకు ఎంపి తనుజారాణి మాట్లాడుతూ సమస్యలను రాష్ట్ర ప్రభుత్వం పరిష్కరించకుంటే దేశ రాజధాని ఢిల్లీకి వెళ్లి గళమెత్తుదామని ఆదివాసీలకు పిలుపునిచ్చారు. పాడేరు ఎమ్మెల్యే ఎం.విశ్వేశ్వరరాజు మాట్లాడుతూ గిరిజనుల హక్కులు, చట్టాలను నిర్వీర్యం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం కుట్ర పన్నుతోందని, గిరిజన ప్రాంతంలోని ఖనిజ సంపదను దోచుకోవాలని చూస్తోందని విమర్శించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదివాసీలకు ఇచ్చిన హామీలు ఏమయ్యాయని ప్రశ్నించారు. అనంతగిరి జడ్‌‌పిటిసి సభ్యులు దీసరి గంగరాజు మాట్లాడుతూ గిరిజన ప్రాంత మనుగడను ప్రభావం చేసే కీలక అంశాలు ఒకదాని తర్వాత ఒకటి తెరపైకి వస్తున్న తరుణంలో ఈ ప్రాంత ప్రజాప్రతినిధులు గిరిజన సమస్యలను చట్టసభల్లో సమర్థవంతంగా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాల్సిన అవసరం ఉందని తెలిపారు. తమ కోసం పోరాడతారని ఆదివాసీలు ఆశించి గెలిపించిన ఎమ్మెల్యేలు నేడు గిరిజనుల కన్నా సొంత, పార్టీ ప్రయోజనాలకే ప్రాధాన్యం ఇస్తూ అసెంబ్లీకి వెళ్లడం లేదని, అటువంటి ఎమ్మెల్యేలు అవసరమా? అనే ప్రశ్న ప్రస్తుతం అల్లూరి జిల్లాలో చర్చనీయాంశంగా మారిందన్నారు. సోషల్ మీడియా కంటెంట్ క్రియేటర్స్ పిలుపులో భాగంగా జరిగిన ఈ కార్యక్రమంలో ఆదివాసీ, ఉద్యోగ, ఉపాధ్యాయ, ప్రజా సంఘాల నాయకులు పొద్దు బాలదేవ్, పి.సత్యనారాయణ, బైరీ సురేష్, ధర్మాన పడాల్, కుడుముల కాంతారావు, మోహన్, ధ్రువ వెంకటరమణ, శశికిరణ్, వందేమాతరం శ్రీనివాస్, వై.కుమార్, వి.నాగేశ్వరరావు, హైమావతి, పెద్ద ఎత్తున గిరిజనులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -