ఏకసభ్య కమిటీ జస్టిస్ నవీన్‌రావుకు టీసీఏ వినతిపత్రం
నవతెలంగాణ-హైదరాబాద్ : టీజీ20 లీగ్ తొలి సీజన్ ఆడిట్ పత్రాలు, ఆర్థిక లావాదేవీల నివేదికలు, పరిపాలనా రికార్డులను తక్షణమే బయటపెట్టాలని తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ (టీసీఏ) డిమాండ్ చేసింది. బీసీసీఐ రాజ్యాంగం అమలు ఐచ్చికం కాదు, ప్రతి రాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ చట్టబద్ద బాధ్యత అని హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్‌సీఏ)కు గుర్తుచేస్తూ.. రూల్ 37(2) ప్రకారం అన్ని వివరాలను అధికారిక వెబ్‌సైట్‌లో అందరికీ అందుబాటులో ఉంచాలని కోరింది. ఈ మేరకు హైకోర్టు నియమిత ఏకసభ్య కమిటీ చైర్మన్ జస్టిస్ పి. నవీన్‌రావుకు వినతి పత్రం అందజేసి, ఆ ప్రతులను హెచ్‌సీఏ ఆఫీస్‌బేరర్లకు పంపినట్టు టీసీఏ ఓ ప్రకటనలో వెల్లడించింది. ‘రూల్ 37(2) ప్రకారం బీసీసీఐ అనుబంధ క్రికెట్ సంఘాలు ఆడిట్ రిపోర్టు, వార్షిక నివేదికలు, పరిపాలన పరమైన పత్రాలను వెబ్‌సైట్‌లో పొందుపరచాలి. టీజీ20 లీగ్ అంశంలో హెచ్‌సీఏ ఈ రూల్‌ను విస్మరిస్తోంది. గతంలో కోరిన బీసీసీఐ అనుమతులు, లీగ్ టెండర్లు, కొనుగోలు రికార్డులు, కాంట్రాక్టుల కేటాయింపు వివరాలు సహా హెచ్‌సీఏ జనరల్ బాడీ, అపెక్స్ కౌన్సిల్ ఆమోదించిన తీర్మానాలను ఇప్పటికీ బహిర్గతం చేయలేదు. పరిపాలనా, ఆర్థిక లావాదేవీల్లో పారదర్శకత కోసం హెచ్‌సీఏ వెంటనే ఈ వివరాలను ప్రజల ముందుంచాలని’ టీసీఏ ప్రధాన కార్యదర్శి ధరమ్ గురువారెడ్డి డిమాండ్ చేశారు.
టీజీ20 ఆడిట్ పత్రాలు బయటపెట్టండి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



