మహబూబ్‌నగర్ జనరల్ ఆస్పత్రిని
సూపర్ స్పెషాలిటీగా మార్చాలి
ఇన్‌చార్జి మంత్రి
రాజనర్సింహకు పట్టింపులేదా..?
సీఎం సొంత జిల్లాలో ఆస్పత్రులు దయనీయం:సీపీఐ(ఎం)
రాష్ట్ర కార్యదర్శి జాన్‌వెస్లీ
నవతెలంగాణ- మహబూబ్‌నగర్ ప్రాంతీయ ప్రతినిధి
‘‘వెనకబడిన మహబూబ్‌నగర్ వలసల జిల్లాలో పేదలు ఖరీదైన ప్రయివేట్ వైద్యం చేయించుకోలేరు. పేదలకు అధునిక వైద్య సేవల్ని అందుబాటులో ఉంచి వారి ఆరోగ్యాలను కాపాడాల్సిన బాధ్యత పాలకులపై ఉంది. ప్రభుత్వ జనరల్ ఆస్పత్రుల్లో డాక్టర్, ప్రోఫెసర్, నర్సు, ఇతర పోస్టులు ఖాళీగా ఉంటే ప్రజలకు వైద్యమెలా అందుతుంది. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సొంత జిల్లాలో ప్రభుత్వాస్పత్రులు దయనీయంగా ఉన్నాయి. ఇన్‌చార్జి మంత్రి దామోదర రాజనర్సింహ ఆరోగ్య శాఖ మంత్రిగా ఉన్నా మహబూబ్‌నగర్ జనరల్ ఆస్పత్రిని పట్టించుకోరా’’ అని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి జాన్‌వెస్లీ ప్రశ్నించారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ ఆస్పత్రుల పరిశీలనలో భాగంగా శుక్రవారం మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలోని జనరల్ ఆస్పత్రిని సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి ఏ. రాములు, కార్యదర్శివర్గ సభ్యులు కిల్లె గోపాల్, నల్లవెల్లి కురుమూర్తితో కలిసి వెస్లీ సందర్శించారు. రోగులకు అందుతున్న వైద్య సేవలు, మౌళిక వసతులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆస్పత్రి సమస్యలు, ఖాళీలు, మందుల సరఫరాపై సూపరింటెండెంట్ రంగ అజ్మీరను అడిగి వివరాలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా వెస్లీ మీడియాతో మాట్లాడుతూ… కార్పొరేట్ ఆస్పత్రుల్లో వైద్యం చేయించుకోలేని పేదల కోసం ఏర్పాటు చేసిన ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలో నాణ్యమైన వైద్యం అందట్లేదన్నారు. 100 మంది డాక్టర్లు, 25 మంది స్టాఫ్ నర్సులు, ల్యాబ్ టెక్నీషియన్స్ పోస్టులు ఖాళీగా ఉండడం వల్ల వైద్య సేవలు అందడంలేదన్నారు. 100 పడకలుంటే 50 మంది శానిటేషన్ సిబ్బంది అవసరం ఉండగా ఆ స్థాయిలో శానిటేషన్ సిబ్బంది లేరని తెలిపారు. 22 మంది ప్రోఫెసర్‌లు ఉండాల్సిన చోట కేవలం 12 మంది మాత్రమే ఉన్నారని, 10 పోస్టులు ఖాళీగా ఉంటే నాణ్యమైన వైద్యం ఎలా అందుతుందని ప్రశ్నించారు. అసిస్టెంట్ ప్రోఫెసర్లు 37 మందికి 15 మంది మాత్రమే పనిచేస్తున్నారన్నారు. వైద్య రంగలో అత్యంత ప్రాధాన్యత కలిగిన ఎంఆర్‌ఐ మిషన్ మంజూరై రెండేండ్లు అవుతున్నా నేటికి ప్రారంభానికి నోచుకోలేదన్నారు. రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖమంత్రి దామోదర రాజనర్సింహ ఈ జిల్లా ఇన్‌చార్జి మంత్రిగా ఉండి కూడా ఆస్పత్రి సమస్యలను పట్టించుకోవడంలేదన్నారు.
పేదల ఆరోగ్యాలు కాపాడాలి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



