ఎనిమిది నెలలు దాటినా విధుల్లోకి తీసుకోని యాజమాన్యం
కలెక్టరేట్‌ను ముట్టడించిన
మైక్రోబాక్స్ కంపెనీ కార్మికులు
సీఐటీయూ నాయకుల అరెస్టు
కార్మికులకు న్యాయం జరిగే వరకు పోరాటం :సీఐటీయూ
జిల్లా కార్యదర్శి జి.సాయిలు
నవతెలంగాణ`మెదక్ ప్రాంతీయ ప్రతినిధి
చేయని తప్పులకు ఉద్యోగం నుంచి మైక్రోబాక్స్ యాజమాన్యం తొలగించిన నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ గత ఐదు రోజులుగా సంగారెడ్డి జిల్లా కలెక్టరేట్ ముందు కార్మికులు రిలే నిరాహార దీక్షలు చేస్తున్నారు. యాజమాన్యం నిర్లక్షంగా వ్యవహారించడంతో సీఐటీయూ ఆద్వర్యంలో శుక్రవారం కలెక్టరేట్‌ను ముట్టడించారు. ర్యాలీగా కలెక్టరేట్‌కు చేరుకున్న కార్మికులు గేట్ ముందు బైఠాయించి ఆందోళన చేశారు. చట్టాలను ఉల్లంఘిస్తున్న కంపెనీ యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కలెక్టరేట్ ముందు ధర్నా చేస్తున్న కార్మికులు, యూనియన్ నాయకులను అక్కడి నుంచి వెళ్లిపోవాలని, ఆందోళన విరమించాలని పోలీసులు హెచ్చరించారు. తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ కార్మికులు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. పోలీసులు మూకుమ్మడిగా నాయకుల వద్దకు చేరుకోకోవడంతో కలెక్టరేట్ వద్ద కొద్దిసేపు ఉద్రిక్తత నెలకొంది. పోలీసులు బలవంతంగా సీఐటీయూ నాయకులు, కార్మికులను అరెస్టు చేసి పోలీసు స్టేషన్‌కు తరలించారు. ఈ సందర్బంగా సీఐటీయూ జిల్లా కార్యదర్శి జి.సాయిలు మాట్లాడుతూ తొలగించిన కార్మికులను విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్ చేశారు. కొండాపూర్ మండలం మల్లేపల్లి గ్రామం పరిధిలోని మైక్రో బాక్స్ పరిశ్రమలో 13 మంది పర్మినెంట్ కార్మికులు 26 ఏండ్లుగా పనిచేస్తుంటే యాజమాన్యం అక్రమంగా తొలగించిందన్నారు. ఎనమిది నెలల నుంచిి వేతనాలు ఇవ్వకుండా డ్యూటీ లోకి రానివ్వకుండా యాజమాన్యం ఇబ్బందులు పెడుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. పర్మినెంట్ కార్మికులు చేసే పనిని కాంటాక్ట్ కార్మికులతో చేయిస్తూ కార్మిక చట్టాలను ఉల్లంఘిస్తున్న యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలన్నారు. ఇట్టి విషయం గురించి డీసీఎల్‌కు ఫిర్యాదు చేస్తే కన్సిలేషన్లో పెట్టి సమావేశం జరుగుతుంటే యాజమాన్యం కార్మికులను టర్మినేషన్ చేయడం చట్ట విరుద్ధమన్నారు. కార్మిక చట్టాలను గౌరవించకుండా ఉల్లంఘిస్తున్న యాజమాన్యంపై కఠిన చర్యలు తీసుకోవాలని ఐదు రోజులుగా కలెక్టరేట్ ముందు రిలే నిరాహార దీక్ష జరుగుతుంటే జిల్లా అధికారులు, లేబర్ అధికారులు ఎందుకు పట్టించుకోవడంలేదని ప్రశ్నించారు. లేబర్ డిపార్ట్‌మెంట్ కార్మికుల పక్షమా, యాజమాన్యం పక్షమా అని ప్రశ్నించారు. ఎనమిది నెలలుగా జీతాలు రాక డ్యూటీ లేని కార్మికులు న్యాయం అడుగుతుంటే ఎందుకు పట్టించుకోరని ప్రశ్నించారు. ఇప్పటికైనా జిల్లా అధికారులు స్పందించి కార్మికులకు న్యాయం చేయాలని, లేకుంటే పోరాటం ఆగదని హెచ్చరించారు. అక్రమంగా తొలగించిన కార్మికులకు న్యాయం చేయాలని కలెక్టర్ ఆఫీస్‌కు వస్తే పోలీసులతో అరెస్టు చేయించడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు అరెస్టులతో ఉద్యమం ఆగదని, న్యాయం జరిగే వరకూ పోరాడుతామని హెచ్చరించారు. సీఐటీయూ జిల్లా కార్యదర్శి జి.సాయిలు, జిల్లా ఉపాధ్యక్షులు పి.బాగా రెడ్డి, అతిమేల మాణిక్‌లను పోలీసులు అరెస్టు చేశారు. కార్యక్రమంలో సీఐటీయూ నాయకులు సురేష్, శ్రీధర్, శివ, పరమేశ్వర్, రమేష్, భీమ్ రెడ్డి, షబ్బీర్, వీరేశం, వెంకటేష్, శేఖర్, శ్రీనివాస్ రెడ్డి, సాయన్న, మురళి కార్మికులు పాల్గొన్నారు.
ఉద్యోగుల తొలగింపు అన్యాయం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



