బురద బాటలో కాలినడకన మోసుకెళ్లిన 108 సిబ్బంది
అపస్మారక స్థితిలోని గొత్తికోయ యువకుడికి చికిత్స
ములుగు జిల్లా గుర్రాలబావిలో ఘటన
నవతెలంగాణ-ములుగు
సరైన రహదారే లేని ఆ గ్రామానికి 108 అంబులెన్స్ సిబ్బంది చేరుకొని ఓ యువకుడి ప్రాణాలను కాపాడి మానవత్వాన్ని చాటుకున్నారు. ములుగు జిల్లా ఏటూరునాగారం ఐటీడీఏ పరిధిలోని గుర్రాలబావి గ్రామానికి చెందిన గోత్తికోయ గిరిజన యువకుడు మడకం అయితయ్య (18) నాలుగు రోజులుగా తీవ్ర జ్వరంతో బాధపడుతున్నాడు. స్థానిక ఆర్‌ఎంపీ వద్ద చికిత్స చేయించుకున్నప్పటికీ ఆరోగ్యం మెరుగుపడక, పరిస్థితి విషమించడంతో అపస్మారక స్థితికి చేరుకున్నాడు. దాంతో కుటుంబ సభ్యులు వెంటనే 108 అంబులెన్స్‌కు సమాచారం అందించగా వెంటనే ఈఎంటీ శివలింగం ప్రసాద్, పైలట్ కోటి హుటాహుటిన గ్రామానికి చేరుకున్నారు. అయితే గ్రామానికి వెళ్లే రహదారి లేకపోవడంతో అంబులెన్స్ ముందుకు వెళ్లలేని పరిస్థితి ఏర్పడింది. అయినా వెనుకడుగు వేయని 108 సిబ్బంది బురదతో నిండిన కాలిబాటలో నడుచుకుంటూ గ్రామానికి చేరుకున్నారు. గ్రామస్తుల సహాయంతో బాధితుడిని డోలీలో మోసుకుంటూ ప్రధాన రహదారి వరకు తీసుకొచ్చారు. అనంతరం అంబులెన్స్‌లో ప్రాథమిక పరీక్షలు నిర్వహించగా రక్తంలో చక్కెర స్థాయి ప్రమాదకరంగా పడిపోవడంతోపాటు తీవ్ర జ్వరం ఉన్నట్టు గుర్తించారు. ఈఆర్సీపీ డాక్టర్ మౌనిక సూచనల మేరకు అత్యవసర చికిత్సగా గ్లూకోజ్, అవసరమైన మందులు, ఇంజెక్షన్లు అందించి, వెంటనే ఏటూరునాగారం ప్రభుత్వ ఏరియాస్పత్రికి తరలించారు. బాధితుని పరిస్థితిని వైద్యులకు పూర్తిగా వివరించి చికిత్స అందేలా చర్యలు తీసుకున్నారు. కనీస రహదారి సౌకర్యం లేకపోయినా ప్రాణాలను కాపాడాలనే లక్ష్యంతో విధులు నిర్వహించిన 108 అంబులెన్స్ సిబ్బంది సేవలను స్థానికులు, ప్రజాప్రతినిధులు, గ్రామస్తులు ప్రశంసించారు. కాగా, మారుమూల గిరిజన గ్రామాలకు తక్షణమే రహదారి సౌకర్యం కల్పించాలని గ్రామస్తులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు.
డోలీలో మోసి.. ప్రాణాలు కాపాడి..
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



