ఫిబ్రవరి 28న ప్రారంభమైన అమెరికా, ఇజ్రాయిల్- ఇరాన్ యుద్ధం ప్రపంచం మొత్తాన్ని నేడు అతలాకుతలం చేస్తున్నది. యుద్ధం కారణంగా తలెత్తుతున్న ఆయిల్ సంక్షోభ ప్రభావం.. రేపు మన ఇంటి ముందుకు సైతం రానున్నది. అమెరికా ఇజ్రాయిల్ సేనలు ఏకంగా ఇరాన్ దేశాధినేత అలీ ఖైమేని కార్యాలయంపైన దాడిచేసి ఆయన్ని అనాగరికంగా చంపేసాయి. ఇది అమానుషచర్య అని, అన్ని రకాల అంతర్జాతీయ న్యాయ సూత్రాలను ఉల్లంఘించడమే అవుతుందని విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు. ఇరాన్‌కు మద్దతు పలకని వారు సైతం ఆ దేశ అధినేతని ఇలా దారుణంగా చంపడాన్ని మాత్రం నిలదీస్తున్నారు. అదే సందర్భంలో మరి కొంతమంది.. ఇరాన్‌లో నెలకొన్న ఇస్లామిక్ పాలన చేపడుతున్న దారుణాలను ఉటంకిస్తూ.. నిరంకుశ ఇస్లామిక్ పాలన కొనసాగిస్తున్న వారి పట్ల కరుణ చూపెట్టాల్సిన అవసరం లేదంటూ వాదిస్తున్నారు.
ఇరాన్‌లో ఇస్లామిక్ పాలన ఎలా, ఎందుకు మొదలైంది? ఇస్లామిక్ పాలన కొనసాగిస్తున్న వారిని నిందిస్తున్న అమెరికా పాలకులే.. ఆ ఇస్లామిక్ పాలన, ఆ దేశంలో మొగ్గ తొడగడం వెనుక క్రియాశీలక పాత్ర నిర్వహించిన వైనం.. నేడు అందరూ తెలుసుకోవాల్సిన.. ఒక ఆసక్తి దాయకమైన చారిత్రక ఘట్టం! 20వ శతాబ్ది ప్రారంభ దినాలలో.. రెజా షా పహ్లవి రాజుగా ఇరాన్‌లో రాచరికం కొనసాగుతుండేది. మధ్య యుగాలలో పర్షియా అనే పేరుతో చలామణి అయిన దేశం.. 1935లో ఇరాన్‌గా పేరు మార్చుకున్నది. ఇరాన్ అంటే అర్థము.. ”ఆర్యులు పుట్టిన దేశము”! తమ సనాతన చరిత్రను గర్వంగా చాటుకునే ఉద్దేశంతో పేరు మార్పిడి చేసుకుంది. అందరు రాజుల లాగానే.. రెజా షా పహ్లవి నిరంకుశ పాలన కొనసాగించేవాడు. ఆధునిక యుగ అవతరణకు అనుగుణంగా 1906లో ఓ నామమాత్రపు రాజ్యాంగం అవతరించడానికి రాజు ఒప్పుకున్నాడు. దాని ప్రకారం ఒక రాజ్యాంగబద్ధ రాచరిక పాలన మొదలయ్యింది. మజ్లిస్ పేరుతో పార్లమెంటు ఉనికిలోకి వచ్చినా.. అంతిమ అధికారం మాత్రం రాజు దగ్గరే ఉండేది.
ఆ రోజుల్లో సామ్రాజ్యవాద శిబిరానికి నాయకత్వం వహిస్తున్న బ్రిటన్, అమెరికా దేశాల అండలే.. రెజాషా నిరంకుశ పాలనను పడిపోకుండా నిలబెట్టినవి. బదులుగా.. తన దేశ వనరులను, ఆ రోజుల్లోనే కొత్తగా కనుక్కొన్న ఆయిల్ సంపదను.. బ్రిటన్, అమెరికాలు కొల్లగొట్టడానికి రెజా షా సంబరంగా అనుమతించాడు. ”భరత ఖండంబు చక్కని పాడి ఆవు, హిందువులు లేగదూడ లై యేడ్చుచుండ.. తెల్లవారను గడుసరి గొల్లవారు, పితుకుచున్నారు మూతులు బిగియగట్టి” అంటూ బ్రిటిష్ సామ్రాజ్యవాదం మన భారతీయులని కొల్లగొట్టిన వైనాన్ని వివరించారు నాడు చిలకమర్తి వారు. బిల్కుల్ అదే రీతిలో.. సామాన్య ఇరానీయులు ఆకలి దారిద్య్రాలతో అల్లాడుతుంటే.. ఇటు గద్దెమీద కూచున్న రాచరికం, అటు విదేశీ బ్రిటన్ అమెరికా బహుళ జాతి కంపెనీలూ.. ఇరాన్ ఆయిల్ దోపిడీతో బొజ్జలను నింపుకున్నాయి.
ఈ దోపిడీకి అడ్డుకట్ట వేయడానికి ప్రయత్నించిన మొదటి వ్యక్తి. మొహమ్మద్ మొసాదేగ్. ఆ రోజుల్లో ఇరాన్ మజ్లిస్‌కు ఉన్న పరిమిత అధికారాల నుంచి ఎదిగిన ఆయన.. 1951లో ప్రధానమంత్రి స్థానంలో కూర్చున్నాడు. జాతీయ వాద భావజాలం కలిగిన మొసాదేగ్.. క్రమక్రమంగా ప్రజలకు మేలుచేసే సంస్కరణలు మొదలుపెట్టాడు. నేటి ఖొమైనీలకు పూర్వీకులైన మత ఛాందసవాదులు.. షరియత్ పాలన నడపాలంటూ ఒత్తిడి తెచ్చినా, ఆయన తలొగ్గలేదు. ఆధునిక భావజాలపు సెక్యులర్ పాలనతోనే తన ప్రజలకు మేలు జరుగుతుందని ఆయన దృఢంగా నమ్మాడు. భూ సంస్కరణలు, సామాజిక భద్రతా పథకాలు, ధనిక వర్గాలపై పన్నుల విధింపు లాంటివి చేపట్టడంతో.. ప్రజాసమ్మతి ఆయనకు లభించింది. అదే ఊపులో ఆయన బ్రిటిష్ సామ్రాజ్యవాదంపై దెబ్బకొడుతూ.. దేశంలోని ఆయిల్ పరిశ్రమని జాతీయీకరణ చేశాడు.
”బ్రిటిష్ పెట్రోలియం” కంపెనీని దేశం నుండి వెళ్లగొట్టాడు. తమ అడ్డగోలు దోపిడీకి అడ్డుకట్ట వేసిన ఆ దేశభక్తుడిని.. బ్రిటన్, అమెరికాలు ప్రశాంతంగా బతకనీయలేదు. అమెరికా సిఐఏ, బ్రిటిష్ గూడచారి సంస్థ ఎంఐ6, ఇరాన్ రాజూ కుమ్మక్కై.. ఆగస్టు 1953లో సైనిక కుట్ర జరిపి, మొసాదేగ్‌ను పదవి నుండి దించేసాయి. మళ్లీ రెజాషాల నిరంకుశ పాలన కొనసాగింపు.. సామ్రాజ్యవాద దోపిడీ, షరామాములే! ఇరాన్‌పై మళ్లీ తన పట్టును బిగించిన రాజు.. తన నిరంకుశ తంత్రాన్ని నిర్నిరోధంగా కొనసాగించాడు. పార్లమెంటు కీలుబొమ్మగా మారిపోయింది. మొహమ్మద్ రెజా షా పాలన వేగవంతమైన పట్టణీకరణ, పాశ్చాత్యీకరణకు దారితీసింది. మరో వైపు గ్రామీణ ఆర్థిక వ్యవస్థలకు అంతరాయం కలిగించింది. 1970లలో ప్రపంచ ద్రవ్య అస్థిరత, పాశ్చాత్య చమురు వినియోగంలో హెచ్చుతగ్గులు దేశ ఆర్థిక వ్యవస్థను తీవ్రంగా ప్రభావితం చేయడంతో.. సగటు ఇరానియన్ల కొనుగోలు శక్తి మరియు జీవన ప్రమాణాలు తగ్గుముఖం పట్టాయి. పెరుగుతున్న ఆర్థిక ఇబ్బందులతో పాటు సామాజిక రాజకీయ అణచివేత మరింత పెరిగింది. ప్రజల రాజకీయ ఆకాంక్షల వ్యక్తీకరణకు దారులు మూసుకుపోయాయి. జాతీయవాదులు, మతాధికారులు, సామ్యవాద పార్టీల కూటమి అయిన నేషనల్ ఫ్రంట్‌పై నిషేధం విధించారు.
ప్రజల నిరసనలను.. సెన్సార్‌షిప్, నిఘా, వేధింపులతో అణచివేసారు. అక్రమ నిర్బంధం, చిత్రహింసలు సర్వ సాధారణమైపోయాయి. రాజు నిరంకుశత్వం నుండి దేశాన్ని రక్షించే తోవ కోసం ప్రజలు ఆశతో వెతుకుతున్న వేళ.. క్వోమ్ ప్రాంతానికి చెందిన తత్వశాస్త్ర మాజీ ప్రొఫెసర్ అయతోల్లా రుహోల్లా ఖొమేనీ ప్రజల దృష్టిని ఆకర్షించాడు. రాజును వ్యతిరేకించిన నేరానికి.. 1964 నుండి దేశ బహిష్కార శిక్షను అనుభవిస్తున్నాడు ఆయన. షియా ఉలెమాల సహాయంతో రాచరికాన్ని గద్దెదించవచ్చని ఖొమేనీ వాదించేవాడు. ఈ నేపథ్యంలో నేషనల్ ఫ్రంట్ సభ్యులు, కమ్యూనిస్టు (తుదే) పార్టీ, ఇతర సమూహాలన్నీ షా పాలనను వ్యతిరేకించే క్రమంలో విధిలేని పరిస్థితుల్లో ఇస్లామిక్ శక్తులతో చేతులు కలిపాయి. పర్యవసానంగా 1979లో ఇరాన్‌లో ఇస్లామిక్ విప్లవం రూపుదాల్చింది. ఆ ఏడాది జనవరి 16న మొహమ్మద్ రెజా షా దేశాన్ని వదిలి పలాయనం చిత్తగించాడు. తమ దేశ సంపదపై తామే పట్టు సంపాదించగలిగిన ఇరానీయులు.. రాజు పీడ విరగడ చేసిన ఇస్లామిక్ శక్తులకు జైకొట్టారు. ఇరాన్‌పై రాచరికపు నియంతృత్వాన్ని రుద్ది.. ఆ దేశ ప్రజలు ఇస్లామిక్ శక్తుల వైపు చూసేట్టు చేసిన పాపం అమెరికాదే.
మొసాదెగ్‌లను విఫలం చేసి.. ఖుమేనీలు సఫలం కావడానికి దారితీసింది అమెరికా సామ్రాజ్యవాద దాహమే. గతంలో ఇరాన్‌లో స్వయంగా కుట్రలకు పాల్పడి, ప్రజాస్వామ్య హననానికి పూనుకొన్న అమెరికా.. నేడు అదే దేశంపై సైనిక దాడులు చేస్తూ, మారణహోమం సృష్టిస్తున్నది. ఇరాన్ ఒక్కటే కాదు.. ప్రపంచ వ్యాప్తంగా ఛాందసవాదశక్తులను పెంచి పోషించింది సామ్రాజ్యవాద అమెరికానే. ఆఫ్ఘనిస్తాన్‌లోని తాలిబన్లకు, ప్రపంచాన్ని వణికించిన ఒసామా బిన్ లాడెన్‌కు, ఐసిస్‌కు, లాటిన్ అమెరికాలోని నియంతలకు మద్దతుగా నిలిచిన క్రిస్టియన్ ఎవాంజలికల్ సంస్ధలకూ.. డబ్బు సంచులను, ఆయుధాలను, శిక్షణనూ అందించిన పాపపు చరిత్ర అమెరికాదే. అమెరికాలోని పాలకవర్గాలు అనుసరిస్తున్న సామ్రాజ్యవాద విధానాలే నేడు ఆ దేశాన్ని ప్రపంచశాంతికి అవరోధంగా నిలిపాయి. ఒక దేశాన్ని మరొక దేశం పీడించే సాంఘిక ధర్మం అంతరిస్తేనే.. ప్రపంచవ్యాప్తంగా ప్రజాస్వామ్యం పరిఢవిల్ల గలుగుతుంది. ”నిజంగానే నిఖిల లోకం నిండు హర్షం వహిస్తుందా? దారుణ ద్వేషాగ్ని పెంచే దానవత్వం నశిస్తుందా? మానవాళికి నిజంగానే మంచి కాలం రహిస్తుందా?” అంటూ మహాకవి శ్రీశ్రీ అక్షరీకరించిన ప్రపంచ ప్రజల అభిమతం.. త్వరలోనే సాకారమవుతుందని ఆశిద్దాం!
ఆర్.రాజేశమ్
9440443183



