గల్ఫ్ సహకార మండలి సభ్య దేశాలు మరియు జోర్డాన్‌పై ఇరాన్ దాడులను ఖండిస్తూ భారత్‌తో సహా 135దేశాలు ప్రతిపాదించిన తీర్మానాన్ని బుధవారం నాడు 15 దేశాలతో కూడిన భద్రతామండలి 13-0 ఓటుతో ఆమోదించింది. రష్యా, చైనా ఓటింగ్‌లో పాల్గొనలేదు. ఇరాన్ శృతిమించిన దాడులకు పాల్పడినట్లు తీర్మానంలో వర్ణించారు. వెంటనే అన్ని దాడులు నిలిపివేయాలని డిమాండ్ చేశారు. అయితే ఈ తీర్మానాన్ని ఇరాన్ పూచికపుల్ల మాదిరిగా తీసి వేస్తుందని వేరే చెప్పనవసరం లేదు. ఈ రోజు మమ్మల్ని ఖండించారు. నేడు మేము, రేపు మరొక సర్వసత్తాక దేశం అవుతుంది గనుక తీర్మానం వంటి పొరపాట్లు చేయవద్దని ఇరాన్ ప్రపంచ దేశాలను కోరింది. గల్ఫ్‌లోని తమ దీవులపై దాడులు చేస్తే పర్షియా జలసంధిలో రక్తపుటేరులు పారిస్తామని భద్రతా మండలి తీర్మానం తరువాత ఇరాన్ స్పీకర్ ప్రకటించాడు. అమెరికా దాడులు పదమూడవ రోజులో ప్రవేశించాయి. ఆ దాడులను ఖండిస్తూ ఐరాస ప్రధాన కార్యదర్శి గుటెరస్ వెంటనే ఒక ప్రకటన చేయటం తప్ప భద్రతామండలి చేసిందేమీ లేదు. ఖండన తీర్మానం కూడా ఎవరూ పెట్టలేదంటే అమెరికా వీటోతో మురిగిపోతుందని తెలిసిందే.
దాడులను బహిరంగంగా ఖండించిన చైనా, రష్యాలు ఎందుకు ప్రవేశపెట్టలేదు అని ఎవరైనా ప్రశ్నించవచ్చు. ఆ దేశాల ప్రతినిధులు ఆ పని చేసినా దాన్ని వీటో చేసేందుకు అమెరికా, ఇతర దాని మిత్రదేశాలు సిద్ధం సుమతీ అన్నట్లుగా ఉంటాయి. గల్ఫ్ దేశాలపై ఇరాన్ దాడులు సమర్ధనీయం కాదని చైనా స్పష్టంగా చెప్పింది. మిలిటరీయేతర పౌర ప్రాంతాలపై దాడులు తగవని, ఉద్రిక్తతల నివారణకు పూనుకోవాలని కోరింది. రష్యా ఎలాంటి ప్రకటన చేయలేదు. చైనాకు ఇరాన్ ఎంత ముఖ్యమో గల్ఫ్ దేశాలూ అంతే. మన విషయానికి వస్తే ఇరాన్‌పై దాడిని ఖండించలేదు, తీర్మానం ద్వారా గల్ప్‌దేశాలపై ఇరాన్ దాడులను మాత్రం ఖండించింది. భద్రతా మండలిలో తీర్మానం ప్రవేశపెట్టబోయే ముందు మిత్రదేశమైన ఇరాన్‌తో తప్ప ఇతర మిత్రదేశాలన్నింటితో మన దేశం మాట్లాడింది. ఈ సందర్భంగా కొందరు పశ్చిమదేశాల వ్యాఖ్యాతలు అడ్డగోలు వాదనలు చేస్తున్నారు. ఐరాస ప్రధాన కార్యదర్శి గుటెరస్ అమెరికా దాడులను ఖండించారు, అదే ప్రకటనలో ఇరాన్ ప్రతిదాడులు చేస్తున్నదని చెప్పటం వాటిని సమర్ధించటమే అని భాష్యం చెబుతున్నారు.
తమపై శత్రువులు దాడులకు దిగితే హార్ముజ్ జలసంధిని దిగ్బంధనం చేస్తామని, ఆ ప్రాంతంలో అమెరికా సైనిక స్థావరాలు ఎక్కడున్నా వాటిని వదలబోమని ఇరాన్ ఎప్పటి నుంచో చెబుతున్నది. తమ దేశాల్లో అమెరికా స్థావరాల ఏర్పాటుకు అంగీకరించిన గల్ఫ్ దేశాలు తమ గడ్డ మీద నుంచి ఇరాన్ మీద దాడులకు అనుమతించబోమని ప్రకటించి ఉంటే పరిస్థితి వేరుగా ఉండేదేమో. అలాందిదేమీ లేదు, యుద్ధం ప్రారంభమైన తరువాత అమెరికా తన యుద్ధ విమానాలను సైప్రస్‌కు తరలించినట్లు వార్తలొచ్చాయి.అదే పని ముందే చేసి ఉన్నా గల్ఫ్ దేశాల మీద కచ్చితంగా ఇరాన్ దాడులు చేసి ఉండేది కాదు. ఆ దేశాల దోబూచులాటలు కూడా తాజా పరిణామాలకు కారణమన్నది స్పష్టం. తన పౌరనివాసాలపై, స్కూళ్లపై మాత్రమే గాక చమురు కేంద్రాలపై అమెరికా దాడులు చేసిన తరువాతే గల్ఫ్ దేశాల చమురు కేంద్రాల మీద ఇరాన్ దాడులకు దిగింది.యుద్ధంలో ఒకసారి ఒకరు నీతినియమాల గాడి తప్పిన తర్వాత మరొకరిని నిందించే నైతికహక్కు ఎవరికీ ఉండదు.
ఇరాన్ అణుకేంద్రాలను ధ్వంసం చేస్తామంటూ దాడులకు దిగిన అమెరికా- ఇజ్రాయిల్ చేసిందేమిటి? 19,734 పౌరనివాసాల మీద దాడులు , ఇప్పటి వరకు 1,348 మందిని చంపి, పదిహేడు వేల మందిని గాయపరిచారు. అరవై అయిదు స్కూళ్లు,77 వైద్య కేంద్రాలు దాడులకు గురయ్యాయి. ఇరాన్ ప్రతిదాడుల్లో కూడా అలాంటివేమైనా ఉన్నదీ లేనిదీ ఇంతవరకు ఏ దేశమూ ప్రకటించలేదు.
ఇరాన్‌పై దాడులను స్వయంగా అమెరికా సాధారణ పౌరులే సమర్ధించటం లేదని తాజా సర్వేలన్నీ వెల్లడించాయి. మరోవైపు యుద్ధంలో గెలిచామని, అయినా దాడులను కొనసాగిస్తామని ట్రంప్ చెబుతున్నాడు.మరోవైపు అమెరికా గెలిచేదారిలో లేదని తనను తానే అపహాస్యం చేసుకుంటున్నదని అంతర్జాతీయ మీడియాలో కథనాలు ప్రారంభమయ్యాయి.
యుద్ధ లక్ష్యాల గురించి ట్రంప్ చెప్పినట్లుగా తాను చెప్పినవారిని గాక కొత్త సుప్రీమ్ నేతను ఇరాన్ ఎన్నుకుంది, ఇంతవరకు అణుకేంద్రాలు చెక్కుచెదరలేదు, ఇతర మిలి టెంట్ గ్రూపులకు ఇరాన్ మద్దతు నిలిపివేయలేదు, అలాంటి వాటిలో ఒకటి హిజబుల్లా కూడా రంగంలోకి దిగింది. ఇజ్రాయిల్‌కు మప్పు తప్పించారా అంటే లేదు. ఇలాంటి వాటిని చూపి అమెరికా గెలిచే దారిలో లేదని చెబుతున్నారు. హమాస్‌ను అణచేపేరుతో గాజాలో ఇజ్రాయిల్ జరిపిన మారణహోమం, విధ్వంస కాండను చూసిన తర్వాత ప్రపంచ మిలిటరీ శక్తిగా ఉన్న అమెరికా తన ఆయుధాలతో ఇరాన్‌లో కూడా అదేపని చేయనుందన్నది స్పష్టం. ఎంత చేసినా పాలస్తీనియన్లకు ఇజ్రాయిల్ ఎలా లొంగదీసుకోలేదో ఇరానియన్లు కూడా అమెరికాకు తలవంచే అవకాశం లేదని చెప్పవచ్చు!
ఇరాన్ పట్ల భద్రతా మండలి పక్షపాతం!
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



