Friday, March 13, 2026
E-PAPER
Homeజాతీయంగ్యాస్‌, ఇంధన కొరతపై పని ప్రదేశాల్లో నిరసనలు : సీఐటీయూ పిలుపు

గ్యాస్‌, ఇంధన కొరతపై పని ప్రదేశాల్లో నిరసనలు : సీఐటీయూ పిలుపు

- Advertisement -

అవాంఛనీయ సంక్షోభం వైపు దేశాన్ని నెడుతున్న మోడీ సర్కార్‌

న్యూఢిల్లీ : అమెరికా ప్రయోజనాలకు లొంగిపోతూ, దూరదృష్టి లేకుండా కేంద్రంలోని మోడీ సర్కార్‌ దేశాన్ని అవాంఛనీయ సంక్షోభం వైపునకు నెడుతోందని సీఐటీయూ విమర్శించింది. దేశంలో ప్రస్తుతం తీవ్రంగా ఎల్‌పీజీ- ఎన్‌ఎన్‌జీ సరఫరా సంక్షోభం నెలకొందని, ఫలితంగా అనేక రంగాల్లో పారిశ్రామిక ఉత్పత్తికి ఆటంకం కలుగుతోందని, గ్యాస్‌ సిలిండరు ధర వెయ్యి రూపాయలకు చేరి వేలాది కుటుంబాలు ఆందోళనలో వున్నాయని పేర్కొంది. కేంద్రప్రభుత్వం సమస్యలను పరిష్కరించాలని, సాధారణ పరిస్థితిని తీసుకురావాలని డిమాండ్‌ చేస్తూ పని ప్రదేశాల్లో ప్రదర్శనలు నిర్వహిం చాలని కార్మిక లోకానికి పిలుపునిచ్చింది. ఈ మేరకు సిఐటియు ప్రధాన కార్యదర్శి ఎలమరం కరీం గురువారం ఒక ప్రకటన విడుదల చేశారు.

ఇటువంటి పరిస్థితుల్లో సుస్థిర వాతావరణాన్ని నెలకొల్పేలా చర్యలు తీసుకోవడానికి బదులుగా అంతర్జాతీయ ఎల్‌ఎన్‌జీ మార్కెట్లపై అతిగా ఆధారపడుతోందని విమర్శించింది. అమెరికా సామ్రాజ్యవాదానికి దారుణంగా లొంగిపోయిన మోడీప్రభుత్వం దేశ ప్రయోజనాలను నిస్సిగ్గుగా తాకట్టు పెట్టిందని విమర్శించింది. చమురు, గ్యాస్‌ సంక్షోభం నేపథ్యంలో వాణిజ్య సిలిండర్ల కొరతతో హోటళ్ల పరిశ్రమలు, సిరామిక్స్‌ పరిశ్రమ వంటివి బాగా దెబ్బతిన్నాయని తెలిపింది. వీధుల్లో అంగళ్లు పెట్టుకుని జీవనోపాధి పొందే అసంఘటిత రంగ కార్మికులు కూడా వారి ఉపాధులను కోల్పోతున్నారని పేర్కొంది. సమస్యలను పరిష్కరించి, వాతావరణాన్ని చక్కదిద్దేందుకు నిర్దిష్ట చర్యలు తీసుకోవాల్సిన కేంద్ర ప్రభుత్వం పరిస్థితి తమ అదుపులోనే వుందంటూ ప్రజలను తప్పుదారి పట్టిస్తోందని విమర్శించింది.

ఇంధన, గ్యాస్‌ కొరత లేకుండా చర్యలు తీసుకోండి
ఎల్‌పిజీ, ఎల్‌ఎన్‌జీ, ఇతర చమురు ఉత్పత్తుల సరఫరా నిరంతరంగా కొనసాగేలా యుద్ధ ప్రాతిపదికన చర్యలు తీసుకోవాలని, అక్రమ నిల్వలు, బ్లాక్‌ మార్కెటింగ్‌ను అరికట్టేందుకు సమర్ధవంతమైన చర్యలు తీసుకోవాలని సీఐటీయూ డిమాండ్‌ చేసింది. ఈ సమస్యలతో ఇబ్బందులు పడుతున్న వివిధ రంగాలకు చెందిన ప్రతినిధులతో సమావేశాలు ఏర్పాటు చేయాలని, అసంఘటిత రంగ కార్మికులపై పడుతున్న ఈ ప్రభావాన్ని తగ్గించేందుకు తక్షణమే అవసరమైన చర్యలు తీసుకోవాలని, సరఫరాల్లో అంతరాయాలతో పని లేకుండా పోయిన వర్కర్లకు వేతనాలు, ఇతర భృతి అందేలా చూడాలని కేంద్రాన్ని కోరింది.

ఇందుకోసం పని ప్రదేశాల్లో ప్రదర్శనలు నిర్వహించాలని కార్మిక లోకానికి పిలుపునిచ్చింది. ఇతర వర్గాల ప్రజలతో కలిసి అన్ని పని ప్రదేశాల్లో సిఐటియు, ఇతర అనుబంధ యూనియన్లు ప్రదర్శనలు నిర్వహించనున్నట్లు, మెమొరాండాలు అందజేయనున్నట్టు ఆ ప్రకటనలో పేర్కొంది. ప్రజల్లో ఆందోళన తగ్గించేందుకు గానూ చమురు, గ్యాస్‌ లభ్యతపై ఏ రోజు కారోజు వివరాలు తెలియజేయాలని కేంద్రాన్ని కోరింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -