కొన్ని తిట్లకు అర్హులైన మనుషులు, రాజ్యాలు ఎప్పటికీ ఉంటరు, ఉంటాయి. వారికోసమే ఆ పదాలు సజీవంగా ఉన్నాయి. అట్లాగే కొన్ని సామెతలు, నానుడులు కూడా. రాచరిక, భూస్వామిక సమాజాలలో పుట్టిన ఈ తిట్లు ఇప్పటికీ కొనసాగటం అంటే మనం ఇంకా ఆనాటి కాలంలోనే ఉండిపోయా మని అర్థం. సిగ్గూ ఎగ్గూ లేకపోవటం. దున్నపోతు మీద వర్షం పడినట్లు వ్యవహరించడం. నిమ్మకు నీరెత్తినట్లు ఉండటం. మొద్దు చర్మం. తలబిరుసు. ఇలా ఎన్నయినా ఉపయోగించవచ్చు నేటి నాయకులను, పాలకులను, పాలనను. ఈ పదాలు పుట్టిన నాటికన్నా, ఇప్పుడు మరింత కచ్చితంగా అమరుతున్నాయి. అవును మనుషులు.. మరీ పాలకులు దిగజారి పోతున్నారు. వారిని కదిలించడం గగనమై పోతున్నది. నియంతృత్వము, నిరంకుశత్వం అనే మాటలు కూడా సరిపోనంతగా కర్కశులై పోతున్నారు వీళ్లు. ప్రజాస్వామ్యమనే వ్యవస్థలో ప్రజలెన్నుకున్న నాయకులు, ప్రభుత్వాలు ఇంత దారుణంగా వ్యవహరించడం అమానవీయం.
ఏం అడుగుతున్నారు వాళ్లు? ప్రభుత్వాన్ని దిగి పొమ్మన్నారా! మీరు పోతే మేము కూర్చుంటాం అధికారంలో అన్నారా! రాజ్యాంగం కల్పించిన హక్కు నిరసన తెలపడం. దాని ప్రకారమే శాంతియుతంగా ఆందోళన చేస్తున్నారు. మంత్రులు బాధ్యతగా, జవాబు దారీగా ఉండాలని కోరుతున్నారు. ఈ ఏడేండ్లలో యాభైకి పైగా పరీక్ష పేపర్లు లీక్ అయి లక్షలాది మంది విద్యార్థుల జీవితాలపై ప్రభావం చూపుతుంటే తమ భవిష్యత్తు పట్ల ఆందోళనతో ఆత్మహత్యలకు పాల్పడితే, ఈ సామాన్య తల్లిదండ్రులు పిల్లల చదువుల కోసం పెరుగుతున్న ఒత్తిడిని చూసి దుఃఖపడుతుంటే, ఈ అవకతవకలకు బాధ్యత వహించాలని కోరటం నేరమా? మనిషన్నవాడు ఎవడైనా స్పందిస్తాడు. మరి ఈ ధర్మేంద్ర ప్రధాన్ ఎందుకు దిగిరాడు! అంత మొద్దు చర్మమా! విద్యార్థులకు మద్దతుగా ప్రముఖ విద్యావేత్త, ఇంజనీరు. సామాజిక ఉద్యమకారుడు, రామన్ మెగ్సెసే అవార్డు గ్రహీత సోనమ్ వాంగ్‌చుక్ నిరాహార దీక్షకు కూర్చున్నాడు. ఇరవై రోజులు గడిచాయి. అతని ఆరోగ్యం క్షీణించిపోతూ ఉన్నది. అతడు రాజకీయాలకు అతీతమైనవాడు. లద్దాఖ్ ప్రజల కోసం పనిచేసిన వాడు, చలిలో గడ్డకట్టుకుపోయే సైనికుల కోసం వేడి టెంట్‌ను కనిపెట్టినవాడు, ప్రజల నీటి సమస్యను పరిష్కరించటానికి మంచు స్థూపాలను నిర్మించిన శాస్త్రవేత్త. చైనా వస్తువుల వ్యతిరేకించి నందుకు, బీజేపీ నాయకుల ప్రశంసలను అందుకున్నవాడు కూడా అతను. మరి ఇప్పుడెందుకు ఆయనతో చర్చలు జరుపరు! మీ తప్పిదాలను ప్రశ్నిస్తున్నాడనే కదా! అంటే మీకు వంత పాడితే పొగుడుతారు. ప్రశ్నిస్తే చనిపోవాలని చూస్తారు. ఇంతకన్నా అనాగరికం ఏముంది!
బ్రిటిష్ సామ్రాజ్యవాదం ఆనాడు భారతీయులపై దౌర్జన్యాలు దోపిడీలు చేస్తూ, నిరంకుశంగా పాలన సాగిస్తున్నప్పుడు, గాంధీ నాయకత్వాన నిరాహార దీక్షలతో నిరసన తెలిపారు. అంతటి సామ్రాజ్య వాదులు, నియంతలు కూడా వచ్చి చర్చలు జరిపారు. మీరు కోరుతున్నది ఏమిటని కనీసంగా అడిగారు. కానీ ఇప్పుడు మన ప్రజాప్రభుత్వం, మన చేతులతో ఎన్నుకున్న నాయకుడు ఏమీ పట్టనట్లు ఉండటం, నిర్లక్ష్యంగా చూడటం ఎంతటి రాక్షసత్వం! కనీసం చర్చ చేయాలి కదా! సమస్యను పరిష్కరించకపోగా, వాంగుచుక్ చైనా ఏజెంట్ అని, దేశద్రోహి అని, విద్యార్థులను దేశద్రోహులని, దొంగ నిరాహారదీక్షలని నాయకులు మాట్లాడటం అమానుషం. అడిగినవాళ్లు దేశద్రోహులా? లీకులు చేసి, అవినీతికి పాల్పడిన వారు దేశభక్తులా? ఇదేమి రాజ్యం! ధర్మబద్ధ నిరసన తెలుపుతున్న వాంగ్‌చుక్‌ను నిన్న ఉదయం ఆయన అనుమతి లేకుండానే వందలాది పోలీసులొచ్చి, విద్యార్థులపై దాడిచేసి, సోనమ్‌ను తరలించడం నియంతృత్వ చర్య! ఇది కూడా అతని ఆరోగ్యం గురించి ప్రభుత్వం పట్టించుకోవాలని ఢిల్లీ హైకోర్టు ఆదేశాలివ్వటం వల్ల జరిగిన పరిణామం ఇది. అసలైతే అతని ఆరోగ్యం, ప్రాణాలపై ఏమాత్రం ప్రభుత్వానికి శ్రద్ధ లేదు. దేశ ప్రధాని విదేశాలు తిరుగుతూ పురస్కారాలు అందుకుంటూ అంకెల ఉపన్యాసాలతో హాస్యం పండిస్తున్నారు. అమెరికా బెదిరించినా మౌనంగా ఉన్నారు. రెండు కోట్ల ఉద్యోగాలేవి? అంటే మౌనంగా ఉన్నాడు. పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు పెరుగుతున్నాయని జనం గగ్గోలు పెడితే మౌనంగానే ఉన్నాడు. రూపాయి విలువ పడిపోతున్నా మౌనంగా ఉన్నాడు. మణిపూర్ మంటలు చెలరేగుతుంటే మౌనంగానే. విద్యావ్యవస్థ ధ్వంసం అవుతున్నా మౌనంగానే ఉంటున్నాడు. ఇప్పుడు ప్రాణాలు పోతున్నాయన్నా కరగని కఠినశిలలా ఉండిపోయాడు. రేపు పార్లమెంటుకు మార్చ్ చేసి కుంభకర్ణుల్ని కదిలించాలి. వీళ్లు కపట కుంభకర్ణులు. ప్రతి గొంతూ నినదిస్తేనే కదిలించగలం.
ప్రభుత్వమా? కఠినశిలా?
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



