Sunday, July 19, 2026
E-PAPER
Homeఎడిట్ పేజినిరంకుశ శాసనాలు-నీతి బాహ్య విన్యాసాలు

నిరంకుశ శాసనాలు-నీతి బాహ్య విన్యాసాలు

- Advertisement -

జులై 20 సోమవారం ప్రారంభం కానున్న పార్లమెంటు సమావేశాలు కొత్త చిత్రాన్ని ఆవిష్కరిస్తున్నాయి. ఇటీవల శాసనసభల ఎన్నికలు గెలిచి, ప్రాంతీయ పార్టీలను చీల్చి బలోపేతంగా తయారైనామని టముకు వేసుకున్న బీజేపీ-ఎన్డీయే నేతలు ఆ ధీమాతో దూసుకెళ్లడంగాక రకరకాల మల్లగుల్లాలు పడుతున్న తీరు మేడిపండు చందంగా వుంది. ఈ సమావేశాలలో ఏయే బిల్లులు వస్తాయనే దానిపైనే భిన్న కథనాలు అధికారికంగానే లీకవుతున్నాయి. ప్రతిపక్ష శిబిరాన్ని చీల్చడం గురించి వారు చెబుతుంటే ఎన్డీయే భాగస్వామ్య పక్షాలు కూడా ఆమోదించలేని కొన్ని అంశాలు బయటకు వస్తున్నాయి. రక్షణ మంత్రి రాజ్‌‌నాథ్‌ ‌సింగ్‌ ‌నాయకత్వంలో నిర్వహించిన ఎన్డీయే సమావేశం తర్వాత కూడా సాధికారికంగా సమ్రగమైన ప్రకటన ఏదీ రాలేదు. మంగళవారం నాడు ప్రధాని మోడీ సమక్షంలో పార్లమెంటరీ సమావేశం తర్వాతనే అసలైన ఎజెండా వస్తుందని ఇప్పుడంటున్నారు. ఈ లోగా షరామామూలుగా ప్రతిపక్షాలపై దాడి కొనసాగిస్తూనే వున్నారు. దానికి తగినట్టే గతంలో ‘ఇండియా’ వేదికలో కీలక భాగస్వాములుగా మెలిగిన పార్టీలే ఇప్పుడు తలోవిధంగా మాట్లాడుతూ ఆచరణలో ఏం చేయబోతున్నాయనే దానిపై అనుమానాలు పెంచుతున్నాయి. మొదటి సమాచారం ప్రకార మైతే ఐదు బిల్లులు సభ ముందు తీసుకొస్తున్నట్టు పాలకకూటమి సూచించింది. అవిగాక మరో మూడు బిల్లులు కూడా తర్వాత జోడించింది. ఒకటి:ఆదాయపు పన్ను సవరణ బిల్లు 2026, గల్ఫ్‌ ‌యుద్ధం కారణంగా పెట్టుబడులను ఆకర్షిం చేందు కోసం బయటినుంచి వచ్చేవారి ఆదాయాల మీద పన్నును మినహాయిస్తూ తెచ్చిన ఆర్డినెన్స్‌‌కు శాసనరూపం. రెండు: పెండింగు కేసులు భారం రీత్యా సత్వర న్యాయం కోసం సుప్రీంకోర్టు న్యాయమూర్తుల సంఖ్య పెంపుదల బిల్లు. మూడు:జనన మరణాల నమోదులో ఆలస్యాన్ని నివారించే కఠిన చర్యల కోసం బిల్లు. నాలుగు:జాతీయ స్మారకాల అవమానాన్ని నిరోధించే బిల్లు పేరిట వందేమాతర పాడకపోతే శిక్షతో పాటు ఆ పాటలో గతంలో నిషేదించిన చరణాలను కూడా చేర్చడం. ఐదు: సులభతర వాణిజ్య ప్రొత్సాహంలో భాగంగా కొన్ని రకాలైన తనిఖీలను స్థానిక కేంద్రాలకు అప్పగింత. వీటితో పాటు మరో రెండు విదేశీ విరాళాల స్వీకారం నియంత్రణ కోసం చట్టాలు కట్టుదిట్టం చేయడమనే వివాదాస్పద శాసనం, వికసిత్‌ ‌భారత్‌ ‌విద్యా శిక్షణ అధిష్టాన్‌ ‌బిల్లు.

కీలకాంశాల దాటవేత
ఈ జాబితాలోవే గాక ఇంకా మరికొన్ని రావచ్చని సూచనలు ఇస్తున్నారు గానీ రాజకీయంగా రాజ్యాంగ పరంగా అతి కీలకమైన మరో రెండు బిల్లులపై బీజేపీ నేతలు మౌనం పాటిస్తున్నారు. లేదంటే భిన్నమైన సూచనలు చేస్తున్నారు. మహిళా రిజర్వేషన్‌‌తో ముడిపెట్టి నియోజకవర్గాల పునర్విభజన పేర 543 స్థానాలను 850కి పెంచే బిల్లు. లోక్‌‌సభ శాసనసభలకు ఒకేసారి ఎన్నికలు జరగాలని చెప్పే జమిలి బిల్లు. రాజకీయంగా అమిత ప్రాధాన్యత గల ఈ రెండు శాసనాలను గురించి ఎందుకు చెప్పడం లేదనేది ఒకటైతే , వాటిని హఠాత్తుగా తీసుకొచ్చి ఆమోదించేసుకుంటారా అనే సందేహాలు కూడా బలంగానే వున్నాయి. వాటిమీద రాజకీయంగా బయట చర్చలు, వివాదాలు నడుస్తున్నాయి గానీ పారదర్శకంగా కేంద్రం ప్రకటన చేయకుండా దాగుడు మూతలాడుతున్నది. అనేక కీలకమైన బిల్లులను ఆఖరి నిమిషంలో ఆదాటున ప్రవేశపెట్టి మమ అనిపించుకున్న వ్యూహం ఇప్పుడు కూడా అమలవుతుందనే అనుమానాలున్నాయి.

ఉదాహరణకు జమిలి ఎన్నికలు లేదా ఒకే దేశం-ఒకే ఎన్నిక (ఒఎన్‌ఒఇ) అధ్యయనం కోసం నియ మించిన సంయుక్త పార్లమెంటరీ కమిటీ(జెపిసి)ఛైర్మెన్‌ ‌జెజెచౌదరి మాట్లాడుతూ 2029లోనే ఇది జరిగే అవకాశమందన్నారు. తాము అభిప్రాయాలు అడిగిన వారిలో 99 శాతం స్పందించారనీ, ముఖ్యమంత్రులతోనూ మాట్టాడామని చెప్పారు. త్వరగా ముగించి ఉన్నతస్థాయి కమిటీ ఛైర్మెన్‌, మాజీ రాష్ట్రపతి రామ్‌‌నాథ్‌ ‌కోవింద్‌‌కు అందజేస్తామని, తర్వాత ఎప్పుడైనా నివేదిక వెలువడవచ్చని వెల్లడించారు. మోడీ విజన్‌ ప్రకారమే ఈ జమిలి చర్చ వచ్చిందని, 1967 వరకూ ఇదే పద్ధతి వుంది గనక దీనివల్ల సమాఖ్య విధానానికి భంగమేమీ వుండబోదని ముందస్తుగానే చెబుతున్నారు. చీటిమాటికీ ఎన్నికల వల్ల వచ్చే అస్థిరత్వం అడ్డుకోవచ్చని, దీనివల్ల ఏడు లక్షల కోట్ల రూపాయలు ఆదా అవుతాయని ఏదో లెక్కబెబుతున్నారు. చర్చ ఇప్పుడు జరిగినా 2034లో గానీ జమిలి వుండదని గతంలో హామీ ఇస్తూవచ్చిన బీజేపీ నాయకత్వం ఎందుకుని హఠాత్తుగా మాట మార్చింది? ఇదే సమయంలో సీట్ల సంఖ్య పెంపు కూడా అనివార్యంగా చేస్తామని సంకేతాలు వదులుతున్నది. తమకు అవసరమైన మద్దతు వుందని మంత్రి రామదాస్‌ అథవాలే చెప్పకనే చెప్పారు.
2026 ఏప్రిల్‌ ‌నెలలో సభలో ప్రవేశపెట్టి వెనక్కు తీసుకున్న బిల్లుపై మళ్లీ హడావుడి పడటానికి కారణాలు స్పష్టంగానే కనిపిస్తున్నాయి. ఇటీవలి శాసనసభ విజయాల తర్వాత రాజ్యసభలో బీజేపీ బలం పెరిగింది. ఇక లోక్‌‌సభ విషయానికి వస్తే ఓటమిపాలైన అనేక ప్రాంతీయ పాలకపార్టీల నేతలు జెండా ఎత్తేసి బీజేపీతో చేతులు కలపడానికి సిద్ధమై పోయాయి. అప్పటి అగ్గిబరాటా ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఉరప్‌ ‌దీదీ ఇప్పుడు గాలితీసిన బెలూన్‌‌లా అయిపోగా ఆమె వంధిమాగధులైన ఇరవై మంది ఎంపీలు నేషనలిస్ట్‌ ‌కాంగ్రెస్‌ ‌పార్టీ ఆఫ్‌ ఇండియా(ఎస్‌సిపిఐ)లో చేరడానికి అనుమతి కోరుతున్నారు. శివసేన ఉధ్ధవ్‌ ‌ఠాకరే వర్గానికి చెందిన ఆరుగురు ఎంపీలు ఏక్‌‌నాథ్‌ ‌షిండే వర్గంలో చేరిపోవచ్చంటున్నారు. శరద్‌ ‌పవార్‌ ఎన్‌‌సిపికి చెందిన ఎనిమిది మంది సభ్యులు కూడా సానుకూల సంకేతాలు పంపుతున్నారు. పవార్‌ కుమార్తె పార్టీ ఎంపీ సుప్రియా సూలే అన్ని రాష్ర్టాల్లో ఒకే విధంగా సీట్లు పెంచితే బలపర్చడానికి అభ్యంతరమేమిటని సన్నాయి నొక్కులు మొదలుపెట్టారు. 22 స్థానాలున్న డిఎంకె కూడా అటూ ఇటూ మాట్లాడుతూ బలపర్చేలా సూచనలు వదులు తున్నది. వైసీపీ ఎంపీలు నలుగురు కూడా ఏదో విధంగా అనుకూల పాత్ర నిర్వహిస్తారనే అంచనా వుంది. ఇక ఎన్‌‌సిపి, శివసేనల మద్దతుతోనే 319కి చేరిన ఎన్డీయేకున్న 299 బలానికి ఇవి కూడా తోడైతే పరిస్థితి మారుతుంది. ఇందుకోసం లోలోపల మంతనాలు బేరసారాలు సాగుతున్నాయనేది అందరికీ తెలుసు. కనుకనే నియోజకవర్గాల పునర్వి భజన పేరిట పెంపు తథ్యమని పరిశీలకులు అంటున్నారు. పునర్విభజన లేదా ఏపి పునర్విభజన చట్టం కింద ఏదో ఒకవిధంగా సీట్ల సంఖ్య పెరుగుతుందని బీఆర్‌ఎస్‌ అధినేతలు కూడా ఈ మధ్యనే ప్రకటించారు. రాజ్యాంగ సవరణకు అవసరమైన మూడింట రెండు వంతుల మెజార్టీ వస్తే లోక్‌‌సభ స్థానాలు 543 నుంచి 850కి చేరతాయి. ఈ సంఖ్య పెంపు కోసం నియోజకవర్గాల జనాభా పొందిక కూడా పూర్తిగా మారిపోవచ్చు. మతాలవారీగా ఓటర్లను ఒక చోటికి చేర్చే పథకం సాగుతున్నదని కూడా బలమైన సంకేతాలున్నాయి. సర్‌ ‌కింద కోట్ల ఓట్ల తొలగింపు, పౌరసత్వ ప్రక్షాళన పేరిట విదేశీయుల తొలగింపు ప్రహసనం కూడా ఇందుకు తోడవుతున్నది. ఈ సమావేశాలలో తీసుకొస్తున్న జనన మరణాల బిల్లులో కూడా ఇదే వ్యూహం వుంది. నెలరోజులు జైలులో వుంటే ముఖ్యమంత్రి ప్రధానమంత్రి సహా ఏ పదవికి అనర్హత కలిగించే అతి నిరంకుశమైన 131 వ రాజ్యాంగ సవరణ కూడా ఇప్పుడు రాదంటున్నారు.

అంతర్గత అలజడి
ఒకవైపున ఇతర పార్టీల నుంచి చేర్చుకుని క్రృతిమంగా సంఖ్యా బలం పెంచుకునే ప్రయత్నాలు ఒకవైపున జరుగుతుంటే మరోవైపున కూటమిలో వున్నవారే జీర్ణించుకోలేని నిర్ణయాలు మరోవైపున నిరసనలకు దారితీస్తున్నాయి. మొదట పేర్కొన్న జాబితాలోని వికసిత్‌ ‌భారత్‌ ‌శిక్షా విద్యా అధిష్టాన్‌ (‌విబిఎస్‌ఐ) ‌బిల్లు ఉమ్మడి జాబితాలోని విద్యారంగాన్ని పూర్తిగా కేంద్రం చేతుల్లో పెడుతున్నది. దీనికి రాష్ట్రాలు, ప్రయివేటు కార్పొరేట్‌ ‌రంగం కూడా అభ్యంతరం చెబుతున్నాయి. అన్నివేళలా విధేయత చాటే ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం కూడా అనంగీకారం చెబుతున్నది. ఇందులోని 45వ క్లాజు ప్రకారం రాష్ర్టాలు చేసే బిల్లులపై రాష్ర్టపతి మాటే అంతిమం. యుజిసి, ఎఐసిటిఇ వంటి సంస్థలన్నీ విఫలమైపోయాయని కేంద్రం చెబుతున్నది. ఈ ప్రకారం అంతిమవాక్యం కేంద్రం చేతుల్లో పెడితే ఉన్న కాసిన్ని హక్కులు కూడా హరించుకుపోతాయని నిపుణులు హెచ్చ రిస్తున్నారు. పైగా దేశంలో భాషా సాంస్కృతిక వైవిధ్యానికీ ముప్పు ఏర్పడుతుంది. ఇప్పటికే తప్పనిసరిగా త్రిభాషలు నేర్చుకోవాలన్న విధానం మంట పుట్టిస్తున్నది. దీనిపై ఈ మధ్యనే సుప్రీంకోర్టు కూడా అభ్యంతరం చెప్పింది. ఇంగ్లీషును కూడా మాతృభాషతో పాటు లెక్కలోకి తీసుకోవాలి గానీ మూడోభాష అంటూ వత్తిడి చేయొద్దని ఆదేశించింది. కానీ, విద్యారంగాన్ని పూర్తిగా గుప్పిట్లోకి తెచ్చుకుంటున్న ఆరెస్సెస్‌, ‌సంఘ పరివార్‌‌లు అందుకు సిద్ధంగా లేవు. ఆగమేఘాల మీద దానిపై కేంద్రానికి పెత్తనం ఇచ్చేయాలంటున్నాయి.

నీట్‌‌,ఇరాన్‌‌పై దురాక్రమణ
ఆసక్తికరమేమంటే విద్యపై ఇంత హంగామా చేస్తున్న కేంద్రం నీట్‌ ‌అవినీతికి కారకుడైన మంతి ధర్మేంద్ర ప్రధాన్‌‌ను రాజీనామా చేయించేందుకు సిద్ధం కాలేదు. నీట్‌‌తో పాటు ఇరాన్‌‌పై దుర్రాకమణ, ఇండియాపై వివక్ష వంటి విషయాలలోనూ మోడీ వ్యవహరించిన తీరు తీవ్ర విమర్శలకు గురైంది. మన విదేశాంగ విధానం కూడా విమర్శల పాలైంది. మోడీ మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ సమయంలో ఆయనతో పాటు మరికొందరిని కూడా తప్పిస్తారని ఊహాగానాలు వున్నా ఏం జరిగేది ప్రత్యక్షంగానే చూడాలి. పదవీకాలం సగం కాగానే వచ్చే ఎన్నికలకు సిద్ధమై పోవడం బీజేపీకి రివాజు గనక సమావేశాలు, ఈ మంత్రుల మార్పులు కూడా వచ్చే ఎన్నికలకు ముందస్తు సూచికలవుతాయి. కాంగ్రెస్‌ ప్రధాన ప్రతిపక్షంగా తన బాధ్యతల నిర్వహణలో పూర్తిగా జయప్రదం కాకపోగా కొన్ని కొత్త సమస్యలు కూడా సృష్టిస్తున్న మాట యథార్తం. అయినా ఈ సమావేశాల్లో మోడీ సర్కారు నిరంకుశ పోకడలకూ, శాసనాలకు ఏకోన్ముఖంగా పగ్గాలు వేయాలనే లౌకిక పార్టీలు అవగాహనకు వస్తున్నాయి.
తెలకపల్లి రవి

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -