ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2023 ఎక్కడ మొదలైందో, అక్కడే ముగించేందుకు సిద్ధమైంది. చెన్నై, గుజరాత్ మ్యాచ్‌తో మొతెరాలో మొదలైన ఐపీఎల్16.. నేడు అదే స్టేడియంలో సూపర్‌కింగ్స్, టైటాన్స్ మహా సమరంతో ముగియనుంది!. ఐదో టైటిల్‌తో ఐపీఎల్‌లో రికార్డు మరింత మెరుగుపర్చుకునేందుకు సూపర్‌కింగ్స్, రెండో టైటిల్‌తో ఐపీఎల్‌లో నయా ఆధిపత్యం చెలాయించేందుకు టైటాన్స్ ఎదురు చూస్తున్నాయి. క్రికెట్‌తో పాటు జీవితంలోనూ ధోని నుంచి ఎంతో నేర్చుకున్న హార్దిక్ పాండ్య.. నేడు గురువుపై గెలిచేందుకు రంగం సిద్ధం చేసుకున్నాడు!.
– ఐపీఎల్ ఫైనల్ పోరు నేడు
– ఐదుపై చెన్నై, రెండుపై టైటాన్స్ కన్ను
– రాత్రి 7.30 నుంచి స్టార్‌స్పోర్ట్స్‌లో..
నవతెలంగాణ-అహ్మదాబాద్
ఐపీఎల్ 16 అంతిమ సమరానికి సర్వం సిద్ధం. డిఫెండింగ్ చాంపియన్ గుజరాత్ టైటాన్స్, నాలుగు సార్లు విజేత చెన్నై సూపర్‌కింగ్స్ నేడు టైటిల్ వేటలో అమీతుమీ తేల్చుకోనున్నాయి. సీజన్ ఆరంభ మ్యాచ్‌లో మొతెరాలో చెన్నైపై గుజరాత్ గెలుపొందగా.. క్వాలిఫయర్1లో చెపాక్ వేదికగా టైటాన్స్‌ను సూపర్‌కింగ్స్ మట్టికరిపించింది. నేడు తుది పోరు మళ్లీ మొతెరాలో జరుగనుండగా ఆతిథ్య జట్టుగా గుజరాత్ టైటాన్స్ ఆత్మవిశ్వాసంతో కనిపిస్తోంది. అహ్మదాబాద్‌లో ఆడిన మూడు మ్యాచుల్లోనూ పరాజయం పాలైన చెన్నై సూపర్‌కింగ్స్.. ఇక్కడ తొలి విజయం కోసం నిరీక్షిస్తుంది. చెన్నై రికార్డు ఐదో టైటిల్‌పై కన్నేయగా.. ధోనీసేన (2010, 2011) తర్వాత ఐపీఎల్‌లో వరుస టైటిళ్లు సాధించిన జట్టుగా నిలిచేందుకు గుజరాత్ టైటాన్స్ ఉవ్విళ్లూరుతుంది. గుజరాత్ టైటాన్స్, చెన్నై సూపర్‌కింగ్స్ ఐపీఎల్ టైటిల్ పోరు నేడు.
ధోని వర్సెస్ పాండ్య
టైటిల్ పోరును మహి వర్సెస్ హార్దిక్‌గా చూడవచ్చు. క్రికెట్‌లోనే కాదు జీవితంలోనూ ధోనిని మెంటార్‌గా చూస్తాడు పాండ్య. అటు చెన్నై, ఇటు గుజరాత్ జట్లు సుమారు ఒకే తరహా ఫార్ములాతో నడుస్తున్నాయి. ఆటగాళ్లకు స్వేచ్ఛ ఇవ్వటం, ఫామ్‌లో లేకపోయినా మద్దతుగా నిలువటం, ప్రశాంతమైన డ్రెస్సింగ్‌రూమ్ వాతావరణం, ఫలితంపై కాకుండా ప్రక్రియపై ఫోకస్ పెట్టడం ఇరు జట్ల శైలి. అయితే, ఆట విధానంలో ఇరు జట్లు భిన్నం. టైటాన్స్ తడాఖా, సూపర్‌కింగ్స్ మ్యాజిక్ భిన్న అంశాలపై ఆధారపడి ఉంటుంది. కీలక ఫైనల్లో వ్యూహాత్మక ఎత్తుగడలే విజయాన్ని అందిస్తాయి. ధోని, పాండ్య నాయకత్వ పోటీ నేడు చూడవచ్చు.
టైటాన్స్ దూకుడు
క్వాలిఫయర్ 1లో తడబడిన టైటాన్స్.. క్వాలిఫయర్2లో ముంబయిపై చిత్తు చేసింది. శుభ్‌మన్ గిల్ సీజన్లో మూడో సెంచరీతో విశ్వరూపం చూపించాడు. శుభ్‌మన్ గిల్, హార్దిక్ పాండ్య, విజరు శంకర్, డెవిడ్ మిల్లర్‌లకు తోడు రషీద్ ఖాన్ బ్యాట్‌తో దండయాత్ర చేస్తుండటం గుజరాత్‌కు అత్యంత సానుకూలం. లక్ష్యాన్ని నిర్దేశించినా, ఛేదించినా టైటాన్స్ శిబిరంలో ఎటువంటి ఒత్తిడి కనిపించటం లేదు. మహ్మద్ షమి, మోహిత్ శర్మ పేస్ కాంబినేషన్ చెన్నైకి సవాల్‌గా మారనుంది. రషీద్ ఖాన్ 24 బంతులను ఎదుర్కొవటం సూపర్‌కింగ్స్‌కు మరో సమస్య. ముంబయిపై విజయోత్సాహంలో ఉన్న టైటాన్స్ నేడు ఫైనల్లో ఫేవరేట్‌గా బరిలోకి దిగుతోంది.
సూపర్‌కింగ్స్‌కు ఎదురుందా?
సాధారణ ఆటగాళ్లతో అసమాన ప్రదర్శనలు రాబట్టడంలో ఎం.ఎస్ ధోని దిట్ట. ఈ సీజన్లో అది మరోసారి నిరూపితమైంది. సూపర్‌కింగ్స్ శిబిరంలో అరివీర భయంకర బ్యాటర్లు ఎవరూ లేకపోయినా.. జట్టుగా చెన్నై ప్రమాదకారి. రుతురాజ్ గైక్వాడ్, డెవాన్ కాన్వే, అజింక్య రహానెలకు తోడు యువ ఆల్‌రౌండర్ శివం దూబె చెన్నైని ముందుండి నడిపిస్తున్నారు. మోయిన్ అలీ, రవీంద్ర జడేజా, అంబటి రాయుడు మంచి ఫామ్‌లో ఉన్నారు. ధోని బ్యాట్‌తో దండెత్తకపోయినా.. నాయకుడిగా ప్రభావం చూపిస్తున్నాడు. దీపక్ చాహర్, మతిశ పతిరణ పేస్.. మహీశ్ తీక్షణ, జడేజా, మోయిన్ స్పిన్ కాచుకోవటం టైటాన్స్‌కు సైతం సవాలే.
పిచ్, వాతావరణం
ఈ సీజన్లో అహ్మదాబాద్‌లో భారీ స్కోర్లు నమోదయ్యాయి. ఇక్కడ ఎనిమిది మ్యాచుల్లో సగటు తొలి ఇన్నింగ్స్ స్కోరు 193 పరుగులు. వాటిలో తొలుత బ్యాటింగ్ చేసిన జట్టు ఐదుసార్లు గెలుపొందింది. మంచు ప్రభావం లేకపోవటం, తుది పోరు ఒత్తిడి దృష్ట్యా టాస్ నెగ్గిన జట్టు తొలుత బ్యాటింగ్ చేసేందుకు మొగ్గు చూపవచ్చు. ఫైనల్ పోరుకు ఎటువంటి వర్షం ముప్పు లేదు!.