ధాన్యంలో దళారీ

రైతులను అడ్డుపెట్టుకొని కొనుగోలు కేంద్రాల్లోకి ఎంట్రీ
– ముందుగా రైతుల నుంచి క్వింటాల్‌ రూ.1500లోపు కొనుగోలు
– వెంటనే డబ్బులు చెల్లిస్తుండటంతో అమ్ముతున్న అన్నదాతలు
– నిర్వాహకులతో కుమ్మక్కు..
– రైతుకు క్వింటాకు రూ.560 నష్టం
నవతెలంగాణ – ఖమ్మం ప్రాంతీయ ప్రతినిధి
రైతుల కోసం ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాల్లోకి దళారీలు ప్రవేశిస్తున్నారు. మిల్లర్ల కొర్రీలు, కొనుగోలు కేంద్రాల్లో రోజుల తరబడి నిరీక్షణతో విసిగి వేసారిన అన్నదాతలు దళారుల వైపు మొగ్గు చూపుతున్నారు. కేంద్రాల్లో ఏ గ్రేడ్‌ ధాన్యం క్వింటాల్‌ రూ.2,060, బీ గ్రేడ్‌ రూ.2,040 చొప్పున కొనుగోలు చేస్తున్నా మిల్లర్ల కొర్రీలు, విచ్చలవిడిగా తరుగు తీస్తుండటం, రోజులు తరబడి కొనుగోలు కేంద్రాల్లో నిరీక్షించాల్సి రావటంతో విసిగి వేసారిన రైతులు దళారులనే ఆశ్రయిస్తున్నారు. అన్నింటికీ మించి ధాన్యం అమ్మిన వెంటనే దళారీలు డబ్బులు ఇస్తుండటంతో క్వింటాల్‌ రూ.1,500 లోపు ధరకే తెగనమ్ముకుంటున్నారు. తిరిగి అదే ధాన్యాన్ని దళారీలు రైతుల పట్టేదారు పాస్‌పుస్తకాలు, ఇతరత్రా ఆధారాలను అడ్డుపెట్టుకుని కొనుగోలు కేంద్రాల్లోనే ప్రభుత్వం నిర్ణయించిన ధరకు అమ్ముకుని లాభాలు గడిస్తుండటం గమనార్హం.
ఆలస్యం.. కొద్దిరోజులకే మూత
ఉత్పత్తి ప్రారంభమైన నెల, నెలన్నర రోజుల తర్వాత రాష్ట్రంలో కొనుగోలు కేంద్రాలు తెరుచుకున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా 7,100 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశారు. మార్చి నెలలోనే ధాన్యం దిగుబడి ప్రారంభమైనా ఏప్రిల్‌లోగానీ కొనుగోలు కేంద్రాలు తెరుచుకోలేదు. ఈలోపు పలువురు రైతులు ఎలాంటి తరుగు లేకుండా పచ్చివడ్లనే క్వింటాల్‌ రూ.1,100 చొప్పున మిల్లుల్లో అమ్ముకున్నారు. ఉప్పుడు బియ్యానికి ఉపయోగపడతాయని మిల్లర్లు వీటిని కొనుగోలు చేశారు. కొందరు దళారులకు క్వింటాకు 5 కేజీల తరుగుతో విక్రయించారు.
ఆలస్యంగా మేలుకున్న సర్కారు కేంద్రాలను ప్రారంభించి పట్టుమని నెలన్నర రోజులు కూడా కాకముందే సరుకు రావట్లేదనే కారణంతో సగం మూతబడ్డాయి. అయితే కొనుగోలు కేంద్రాలు మూతబడే ముందు అధికారులు రైతులకు సమాచారం ఇవ్వాలి. కానీ ఇవేవీ జరగట్లేదు. కేంద్రాన్ని మూసే క్రమంలో పదిమంది రైతులతో కలిపి దళారీ ధాన్యాన్ని కూడా కాంటాలు వేస్తున్నారనే ఆరోపణలున్నాయి. పైగా దళారీ ధాన్యానికి ఎటువంటి కొర్రీలు లేకుండా కొనుగోలు కేంద్రాల నిర్వాహకులు జాగ్రత్త పడుతున్నట్టు సమాచారం. ఇందుకు కేంద్రాల నిర్వాహకులకు క్వింటాకు రూ.100 నుంచి రూ.200 వరకు దళారీ నుంచి అందుతున్నాయనే ఆరోపణలున్నాయి.
దళారీకే ప్రా’ధాన్యం’
కొనుగోలు కేంద్రాల్లో దళారీలకే ప్రాధాన్యం ఇస్తున్నట్టు ఆరోపణలున్నాయి. కేంద్రాల నిర్వాహకులకు దళారీలు తమ లాభంలో కొంత ముట్టజెప్పుతుండటంతో వారికి కొమ్ముకాస్తున్నట్టు చెబుతున్నారు. ఖమ్మం జిల్లాలోని పెనుబల్లి, సత్తుపల్లి, వేంసూరులో ఇటీవల కేంద్రాలు మూతబడే ముందు ఈ తంతు ఎక్కువగా కొనసాగినట్టు తెలుస్తోంది. తిరుమలాయపాలెం, కూసుమంచి మండలాలు, మహబూబాబాద్‌ జిల్లాలో మరిపెడ, డోర్నకల్‌, కురవి, తదితర మండలాల్లోని కేంద్రాల్లో ఇప్పుడు ఈ తంతు కొనసాగుతుందనే ఆరోపణలున్నాయి. ఖమ్మం జిల్లాలో మొత్తం 236 కేంద్రాలను తెరవగా దీనిలో 119 కేంద్రాలు మూతబడ్డాయి. వీటిలో గురువారం వరకు 1,16,593.28 మెట్రిక్‌ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేశారు. వీటిలో దళారీలకు సంబంధించిన ధాన్యం 30శాతం పైగా ఉంటుందని అంచనా. మరోవైపు దళారీల ధాన్యం వెంటనే మిల్లులకు తరలిస్తుండగా.. అక్కడ ఎలాంటి కొర్రీలు లేకుండా దిగుమతి చేసుకునేలా కొనుగోలు కేంద్రాల నిర్వాహకులు, సంబంధిత దళారీలు తమ పరపతిని వినియోగిస్తున్నట్టు చెబుతున్నారు. కొనుగోలు కేంద్రాల్లోని ఇబ్బందులకు తాళలేక రైతులు ఇష్టానుసారంగానే దళారీలకు అమ్ముతుండటం.. పైగా తమ ప్రూఫ్స్‌ కూడా ఇస్తుండటంతో దళారీల పని సులువవుతోంది. ఈ విషయాన్ని బయటకు వెల్లడించేందుకు కూడా రైతులు ముందుకు రావడం లేదు. పైగా దళారీ ధాన్యానికి సంబంధించిన నగదు వెంటనే చెల్లించాలని రైతు కోరితే నూటికి రూ.1-2 చొప్పున కోత పెడుతున్నట్టు కొందరు ఆరోపిస్తున్నారు. వారం, పదిరోజుల సమయం ఉంటే మాత్రం ఎలాంటి కోతపెట్టకుండా నగదు చెల్లిస్తున్నారని రైతులంటున్నారు.
– మా దృష్టికి వస్తే చర్యలు తీసుకుంటాం..
మధుసూదన్‌, అదనపు కలెక్టర్‌, ఖమ్మం
దళారీల విషయం మా దృష్టికి రాలేదు. ఎక్కడైనా దళారులు అమ్ముతున్నట్టు తెలిస్తే కచ్చితంగా చర్యలు తీసుకుంటాం. దీనిపై దృష్టి సారిస్తాం.

Spread the love