వంట గ్యాస్ కోసం పరుగులు
సిలిండర్ కోసం తంటాలు
బుకింగ్ కన్ఫార్మ్ మెసేజ్ రాకపోవడంతో వినియోగదారుల ఆందోళన
ఏజెన్సీల కార్యాలయాల వద్ద బారులు
కృత్రిమ కొరత సృష్టిస్తున్న పలు గ్యాస్ ఏజెన్సీలు
బ్లాక్ మార్కెట్లో అధిక ధరలతో అమ్మకాలు
డొమెస్టిక్ గ్యాస్ కొరత లేదు.. అపోహలు నమ్మొద్దంటూ ప్రభుత్వం భరోసా
కమర్షియల్ సిలిండర్ల కొరతతో హోటళ్లు, మెస్ నిర్వాహకులూ ఆందోళన
నవతెలంగాణ – ఉమ్మడి జిల్లా ప్రాంతీయ ప్రతినిధులు/విలేకరులు
యుద్ధం ప్రభావంతో గ్యాస్ సరఫరా నిలిచిపోతుందన్న ప్రచారం సోషల్ మీడియాలో విపరీతంగా సాగుతుండటంతో రాష్ట్రవ్యాప్తంగా వినియోగదారుల్లో ఆందోళన నెలకొంది. సిలిండర్ పూర్తిగా ఖాళీ కాకముందే ముందస్తుగా బుక్ చేసుకునే వారి సంఖ్య దాదాపు 40 శాతం వరకు పెరిగినట్టు ఏజెన్సీ నిర్వాహకులు చెబుతున్నారు. సాధారణంగా రెండు మూడు రోజుల్లో వినియోగదారులకు సిలిండర్ అందేది. ప్రస్తుతం ఐదు రోజుల వరకు వేచి చూడాల్సిన పరిస్థితులు ఏర్పడుతున్నాయి. అయితే కమర్షియల్ గ్యాస్ సిలిండర్లకు కొరత ఉంది. ఈ ప్రభావంతో కమర్షియల్ గ్యాస్ ధర పెరగడం హోటళ్లలో టిఫిన్, భోజనం ధరల పెరుగుదలకు దారితీసింది. ఈ నేపథ్యంలో డొమొస్టిక్ గ్యాస్ సిలిండర్ల కొరత ఉందన్న ప్రచారంతో వేల సంఖ్యలో బుకింగ్స్ వస్తుండటంతో గ్యాస్ ఏజెన్సీల ఆన్లైన్ సర్వర్లు మొరాయిస్తున్నాయి.
బుకింగ్ నంబర్లు పనిచేయకపోవడం, యాప్‌లలో ‘ఎర్రర్’ వస్తుండటంతో జనం ఆందోళనతో నేరుగా ఏజెన్సీ కార్యాలయాలకు క్యూ కడుతున్నారు. ఆటోలు, కార్లకు గ్యాస్ నింపే ఎల్పీజీ బంక్‌ల వద్ద ‘నో స్టాక్’ బోర్డులు దర్శనమిస్తుండటంతో వాహనదారులు దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. కొన్ని బంక్‌లు రిపేర్‌లో ఉన్నాయంటూ కొన్నిచోట్ల బ్యానర్లు పెడుతున్నారు. గ్యాస్ సిలిండర్లు ఎప్పుడు నిండుకుంటాయో అన్న భయంతో ప్రజలు ప్రత్యామ్నాయాల వైపు మళ్లుతున్నారు. గడిచిన ఐదారు రోజుల్లోనే ఎలక్ట్రానిక్ షోరూమ్‌లలో ఇండక్షన్ స్టవ్‌ల విక్రయాలు 30 శాతానికి పైగా పెరిగాయి. మరోవైపు అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ వంటి ఈ-కామర్స్ సైట్లలో సైతం ‘అవుట్ ఆఫ్ స్టాక్’ మెసేజ్‌లు వస్తున్నాయి.
సూర్యాపేటలో అనేక హోటళ్లు, టిఫిన్ సెంటర్లు, బేకరీలు, ఫాస్ట్ ఫుడ్ సెంటర్లు, కర్రీ పాయింట్లు, ప్రైవేట్ వసతిగృహాలు కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయి. వీటిపై ప్రత్యక్షంగా, పరోక్షంగా వేలాదిమంది ఆధారపడి జీవిస్తున్నారు. పలు గ్యాస్ ఏజెన్సీల్లో పని చేసే కొందరు డెలివరీ బార్సు సిలిండర్లను బ్లాక్ మార్కెట్లో రూ.1500 వరకు విక్రయిస్తున్నారనే విమర్శలు బహిరంగంగా వెల్లువెత్తుతున్నాయి. ఇక ప్రయివేట్ ఏజెన్సీలలో ఇంతకుముందు కేజీ గ్యాస్‌ను రూ.80కు విక్రయించగా ప్రస్తుతం రూ.500 వరకు అమ్ముతున్నారు. నిజామాబాద్ జిల్లా బాన్సువాడ పట్టణంలో వినియోగదారులు వంట గ్యాస్ కోసం పరుగులు తీస్తున్నారు. పట్టణంలో ఓ ప్రయివేటు గ్యాస్ ఏజెన్సీ ఎదుట ఉదయం నుంచి గ్యాస్ సిలిండర్లతో బారులు తీరారు. వినియోగదారులు ఎక్కువ మెత్తంలో గ్యాస్ బుకింగ్ చేసుకుంటుండటంతో సర్వర్ సమస్య తలెత్తుతుందని డీలర్లు చెబుతున్నారు.
గ్రానైట్ పరిశ్రమకు గండం
రాష్ట్రంలోనే గ్రానైట్ హబ్‌గా పేరున్న కరీంనగర్, ఖమ్మం, తదితర ప్రాంతాలపై యుద్ధ ప్రభావం తీవ్రంగా ఉంది. హర్మూజ్ జలమార్గం మీదుగా వెళ్లే ఒక్కో కంటైనర్‌పై రూ. 2 లక్షల ‘యుద్ధ సెస్’ విధించడంతో వ్యాపారం గిట్టుబాటుకాక కంటైనర్లు కాకినాడ పోర్టులోనే నిలిచిపోయాయి. షిప్పింగ్ ఛార్జీలు పెరగడం, ‘వార్ సెస్’ రూపంలో అదనపు భారం పడటంతో ఎగుమతులు నిలిచిపోయాయి. గతంలో టన్నుకు 20 డాలర్లు ఉన్న షిప్పింగ్ ఛార్జీలు ఇప్పుడు 29 డాలర్లకు చేరాయి. చైనా, కువైట్, ఇరాన్, ఇరాక్ వంటి దేశాలకు వెళ్లాల్సిన వేలాది టన్నుల గ్రానైట్ కాకినాడ పోర్టులోనే పేరుకుపోయింది. దీని వల్ల కరీంనగర్ జిల్లాలోని సుమారు 414 క్వారీల్లో పనిచేస్తున్న 90 వేల మంది కార్మికులు, పరోక్షంగా ఉపాధి పొందే మరో 50 వేల మంది భవిష్యత్తు ఇప్పుడు అంధకారంలో పడింది.
వృద్ధాశ్రమాల్లో ఇబ్బందులు
ఎల్పీజీ సిలిండర్ల కొరత కారణంగా బోడుప్పల్ సర్కిల్ పరిధిలో అనేక వృద్ధాశ్రమాల నిర్వాహకులు ఇబ్బందులు పడుతున్నారు. ఓ వృద్ధాశ్రమా నిర్వహకురాలు మాట్లాడుతూ ప్రస్తుతం సిలిండర్ బుక్ చేసి ఎనిమిది రోజులు గడిచినా సరఫరా కాలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయమై సంబంధిత గ్యాస్ ఏజెన్సీని సంప్రదించినప్పటికీ సరైన స్పందన లభించలేదని తెలిపారు.రంగారెడ్డి జిల్లాలో ప్రధానంగా మొయినాబాద్, శంకర్పల్లి, శేరలిలింగంపల్లి, ఇబ్రహీంపట్నం, కొత్తూరు, యాచారం, వికారాబాద్ మండలాల్లో గ్యాస్ కొరత ఉంది. హాస్టల్స్, హౌటల్స్‌లో కట్టెల పోయ్యిపైన వంట చేయాల్సి వస్తోంది. కొన్నిచోట్ల టీస్టాల్స్‌ను మూసివేసిన పరిస్థితి ఉంది.
కమర్షియల్ సిలెండర్ నోస్టాక్
ఆదిలాబాద్ జిల్లాలోని హోటళ్లు, రెస్టారెంట్లకు సరఫరా చేసే 19 కేజీల కమర్షియల్ సిలెండర్లు సరఫరా చేయక పోవడంతో హోటళ్ల నుంచి రెస్టారెంట్ల వరకు ఇబ్బందులు పడుతున్నాయి. వ్యాపారం దెబ్బ తింటుందని ఆందోళనకు గురవుతున్నారు. ప్రత్యామ్నయ ఏర్పాటు చేసుకుని వ్యాపారం సాగిస్తున్నారు. కట్టెల పొయ్యిపై వంటలు చేసి వ్యాపారం సాగిస్తున్నారు. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో ఓ గ్యాస్ ఏజెన్సీకి నాలుగు రోజులుగా స్టాక్ రాకపోవడంతో ఆ గ్యాస్ వినియోగ దారులు ఆందోళన గురయ్యారు. మరో గ్యాస్ ఏజెన్సీ ఎదుట శుక్రవారం ఉదయం 9 గంటల నుంచి వినియోగ బారులు తీరారు. గంటల తరబడి క్యూ లైన్లో గ్యాస్ కోసం నిరీక్షించారు. కొన్నిచోట్ల కొందరు గొడవకు దిగడంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది.
కొరత లేదు.. అపోహలు నమ్మవద్దంటూ ప్రభుత్వం భరోసా
‘రాష్ట్రంలో ఎక్కడా బాట్లింగ్ ప్లాంట్లలో గ్యాస్ కొరత లేదు. ప్రజలు పానిక్ బుకింగ్ చేయవద్దు.’అని మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి కోరారు. బుకింగ్స్ ఒత్తిడి తగ్గించేందుకు పట్టణాల్లో 25 రోజులు, గ్రామీణ ప్రాంతాల్లో 45 రోజుల గడువును విధించినట్టు తెలిపారు. బ్లాక్ మార్కెటింగ్‌పై ఉక్కుపాదం మోపేందుకు గ్యాస్ నిల్వ చేసి అధిక ధరకు అమ్మే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని, ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా 288 కేసులు నమోదు చేశామని తెలిపారు.
బ్లాక్ మార్కెట్‌పై ఉక్కుపాదం
ప్రస్తుతం మార్కెట్లో డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్ అధికారిక ధర సుమారు రూ.950ఉండాలి. కానీ, డీలర్లు ‘స్టాక్ లేదు’ అనే సాకుతో సామాన్యులను ఇబ్బందులకు గురిచేస్తున్నారని తెలుస్తోంది. బ్లాక్‌లో రూ.1,800 నుంచి 2,800 వరకు పలుకుతోందని సమా చారం. కొరత చూపి బ్లాక్ మార్కెట్లో గ్యాస్ సిలిండర్లు అమ్ముతున్న వారిపై రాష్ట్రవ్యాప్తంగా అధికారులు ఉక్కు పాదం మోపారు. అదేవిధంగా డొమొస్టిక్ సిలిండర్లు వాడుతున్న హోటళ్లు, చిరుతిళ్లు కేంద్రాలపై టాస్క్‌ఫోర్స్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు మెరుపుదాడులు చేసి సీజ్ చేశారు. పలువురిపై కేసులు నమోదు చేశారు.


