Tuesday, July 21, 2026
E-PAPER
Homeఎడిట్ పేజి‘అయోధ్య’ పాపాలను సరయు నదిలో కడిగేస్తారేమో?

‘అయోధ్య’ పాపాలను సరయు నదిలో కడిగేస్తారేమో?

- Advertisement -

ఈ దేశంలో మతం పేర విధ్వంసాలకు, మారణ హోమాలకు లేక్కేలేదు. మతమే చాలాకాలం ప్రజలను పాలించింది, వారి జీవనాన్ని నిర్దేశించింది. ప్రపంచంలో మత సూత్రాలను వ్యతిరేకించిన వారికి మరణ శిక్షలు తప్పలేదు. ‘ఎవరి మతం వారిది’ అనే అభిమతం పోయి తమ మతమే అందరికీ సమ్మతం కావాలనే ప్రయత్నం మత విద్వేషాలకు దారితీసింది. ఈ దేశంలో శ్రీరాముడు నడయాడిన నేలగా చెప్పుకుంటూ ఈ ప్రజాస్వామ్య దేశాన్ని రామరాజ్యంగా మార్చే ప్రయత్నం కొన్ని దశాబ్దాలుగా జరుగుతూనే ఉంది. అదే తమ ఎన్నికల ఎజెండాలో మొదటి అంశంగా పేర్కొంటూ గత నాలుగు దశాబ్దాల నుండి ఎన్నికల్లో పోటీ చేస్తూ వస్తున్న బీజేపీ క్రమంగా బలపడుతూ గత పన్నేండేండ్లుగా అధికారంలో కొనసాగుతోంది. 1992లో బాబ్రీ మసీదు విధ్వం సంలో వీహెచ్‌‌పీ, ఆరెస్సెస్‌, బీజేపీలు ప్రముఖ పాత్ర వహించాయి. కాగా ఆ కేసు మూడు దశాబ్దాల పాటు కోర్టులో నడిచి చివరకు అక్కడి స్థలం రాముడిదేనని, బాబ్రీ మసీదుకు అయోధ్యలో మరొకచోట ఐదెకరాలు కేటాయించాలని కోర్టు ఆదేశించింది. రాముడిని రాజకీయం చేసి అధికారంలోనికి వచ్చిన బీజేపీ మొత్తం మీద 2020 ఆగస్టులో శంకుస్థాపన చేసింది. ఎన్నికలకు ముందు అనగా జనవరి 2024లో ప్రజల్లో మళ్లీ రామాలయ నిర్మాణం తమతోనే సాధ్యమైందని నిరూపించుకోవడానికి తద్వారా దేశంలోనే హిందువుల మనోభావాలను గెలవడం కోసం నిర్మాణం పూర్తి కాకపోయినా బాలరాముడిని ప్రతిష్టించాడు ప్రధాని మోడీ.
ఇక పార్లమెంట్ సాక్షిగా శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ అధ్యక్షుడిగా శ్రీ చంపత్ రాయ్ అనే వ్యక్తిని నియమించాడు. ఆయనకు తోడు మిశ్రాలు, యాదవులతో కమిటీ ఏర్పడింది. ఆలయ నిర్మాణానికి విరాళాలు వస్తుండగా ఆ నిధులు నగలు సరిగ్గా రికార్డులోనికి ఎక్కలేదు. బంగారు ఆభరణాలు, వెండి ఇటుకలు లెక్కల్లోకి రాలేదు. లక్షల రూపాయలు, లక్షల విలువైన నగలు, రెండు వందలకు పైగా వెండి ఇటుకలు ప్రజలు ఎంతో భక్తి శ్రద్ధలతో సమర్పించగా అవన్నీ కమిటీ సభ్యులు కైంకర్యం చేశారు. ఈ కమిటీ సభ్యులు తమ మనుషులను పరకామణి ఉద్యోగులుగా నియమించుకొని దేవుడి సొమ్ము తెలివిగా తరలించారు. వారు బ్యాంకులలో డిపాజిట్ చేసే సొమ్ములో అదనంగా కొన్ని నోట్లు చేర్చి ఆలయ ప్రాంగణం దాటిన తర్వాత, అదనపు నోట్లను తమ ఖాతాల్లో వేసుకునేవారు. వారు అక్కడి నగదును నగలను టాయిలెట్లలో కూడా దాచిపెట్టి రహస్యంగా తరలించారు. ఈ విధంగా డెబ్భయిసార్లు శ్రీరాముడి సొమ్మును అక్రమంగా తరలించినట్లు ‘సిట్‌’ ప్రాథమిక నివేదిక పేర్కొంది. సదరు వ్యక్తుల జీతం కేవలం రూ.15వేలు మాత్రమే అయినా విల్లాలలో విలాసవంతమైన జీవితం గడప సాగారు. వారందరినీ ఉద్యోగాల నుండి తొలగించారే కానీ సొమ్ము ఆభరణాలు రికవరీ సరిగా చేయలేదు. అసలు ఎన్ని కోట్ల సొమ్ము దొంగిలించబడిందో లెక్కలు తేలడం లేదు. అంటే శ్రీరాముడికే శఠగోపం పెట్టారు. భక్తుల విశ్వాసాలకు పాతరేసి తమ పబ్బం గడుపుకున్నారు.

ఈ అవినీతి రచ్చ కావడంతో ట్రస్ట్ తన బోర్డును ప్రక్షాళన చేసింది. ప్రభుత్వం నియమించిన ‘సిట్‌’ విరాళాల లెక్కింపుతో సంబంధం ఉన్న ఎనిమిది మందిని అరెస్టు చేసింది. ప్రాథమిక దర్యాప్తులో భద్రతా వైఫల్యం లెక్కింపులో లోపాలు బయటపడ్డాయి. దాదాపుగా ఎనభై లక్షల రూపాయలు స్వాధీనం చేసుకున్నారు. ట్రస్ట్ కార్యవర్గంలో జవాబుదారీ తనం పారదర్శకత లోపించడం ముఖ్యంగా ఆలయం సంఘ పరివార్ లేదా విశ్వ హిందూ పరిషత్ వారిదే అన్నట్లుగా భక్తులకేమీ సంబంధం లేదన్నట్లు ప్రవర్తించడం అప్రజాస్వామికం. 2020లో ఆలయ నిర్మాణం మొదలై 2024 ఎన్నికలకు ముందు పూర్తి కాకపోయినా బాలరాముడి విగ్రహ ప్రతిష్టకు మోడీ పూను కోవడం కేవలం ఎన్నికల ఎత్తుగడ మాత్రమే. 2025 నవంబర్‌‌లో మాత్రమే పూర్తి ఆలయ నిర్మాణం జరిగిందనేది గమనార్హం. రోజుకు 80 వేల నుండి లక్ష మంది భక్తులు సందర్శించే ఆలయంలో ట్రస్ట్ నిర్వాహకులు బాధ్యతా రహితంగా ప్రవర్తించి అవినీతిని ప్రోత్సహించారు. నిర్వాహకుల నిర్వాకం సిట్ దర్యాప్తులో వెల్లడవుతున్నది. భక్తుల మనోభావాలతో ఆడుకున్నారు. భగవంతుడికి, భక్తుడికి అనుసంధానంగా ఉండవలసిన ట్రస్టు వారిద్దరిని మోసం చేసింది. భజరంగ్ దళ్ వ్యవస్థాపకుడు, బీజేపీ సభ్యుడు వినయ్ కటియార్ మాట్లాడుతూ సంపత్ రాయ్, అనిల్ మిశ్రా ఈ అవినీతికి కారకులని తేల్చిచెప్పాడు. ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఒక అడుగు ముందుకేసి ‘ఎంతసేపు హిందూ దేవాలయాల్లో జరిగే అవినీతిని ప్రశ్నిస్తున్నారు. కానీ వక్ఫ్ బోర్డులలో జరుగుతున్న అవినీతిని ఎవరూ ప్రశ్నించడం లేదని’ సెలవిచ్చారు. ఎంత గొప్ప తర్కం? అవినీతి ఎక్కడ జరిగినా అవినీతే. అసలు సమాజ్ వాది పార్టీ సభ్యులు అనుమానం వ్యక్తం చేయకపోతే, ఈ అవినీతిపై విచారణ కోరకపోతే, అయోధ్య అవినీతి నేటికీ ప్రజలకు తెలిసేది కాదేమో?

ఇంతకాలంగా అయోధ్య ఆలయం తమ పేటెంట్ అని ప్రచారం చేసుకున్న బీజేపీ, వీహెచ్‌‌పీ, ఆరెస్సెస్‌, ఇంకా భజరంగ్ దళ్ గత పది రోజులుగా తమకు ఈ అవినీతితో, ఈ సంఘటనలతో ఏమీ సంబంధం లేదని, ట్రస్ట్ సభ్యులే అందుకు బాధ్యత వహించాలని సన్నాయి నొక్కులు వినిపిస్తున్నాయి. ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి ఏ వేదికపై కూడా ఒక్కమాట అయినా మాట్లాడలేదు. ప్రధాన సమస్యలు దేశంలో చుట్టుముట్టినప్పుడు అవి ప్రశ్నా పత్రాల లీకేజీ, రైతుల సమస్యలు లాంటివి ఏవైనా సరే ప్రధాని మోడీ మౌనముద్ర వేస్తారు. లేదంటే విదేశీ పర్యటనలకు వెళ్తారు. అంటే సమస్యలను బహిరంగంగా చర్చించడానికి ఇష్టపడరు. అది చర్చనీయాంశమైతే తమకు చుట్టుకుంటుందన్న వ్యూహంతో ప్రధాని మౌనం వహిస్తారు. ప్రధాన స్రవంతి మీడియాకు సైతం ఆలయ అవినీతి చర్చించక తప్పలేదు. ఆలయ నిర్మాణం బాలరాముడు ప్రతిష్టతో తమ బాధ్యత తీరిందా? ఇప్పుడు ఆలయ ప్రతిష్ట దెబ్బతిన్నది. దీనికి జవాబు చెప్పకుండా ప్రధాని తప్పించుకోలేరు. ఇప్పుడు బీజేపీ పాలనలోని ఉత్తరాఖండ్‌లో కూడా బద్రీనాథ్ ఆలయ నిర్వహణలో ముఖ్యంగా హుండీ లెక్కింపులో అవకతవకలు ‌వెలుగు లోకి వచ్చాయి. ఈ సందర్భంగా ఒక బాధ్యుడిని అరెస్టు చేసినట్టు వార్తలు. అక్కడ బద్రీనాథ్ నారా యణుడికి నామాలు పెట్టారు. బద్రీనాథ్, కేదార్‌‌నాథ్‌ టెంపుల్ కమిటీలో సీనియర్ ఉద్యోగి ప్రమోద్ నౌటీయాల్ భక్తుల విరాళాలను తస్కరించడం సీసీటీవీ ఫుటేజ్‌లో బయటపడింది. అక్కడ కూడా ఉత్తరాఖండ్ ప్రభుత్వం సిట్ నియమించింది. అంతేకాకుండా ఆలయ నిధులను బద్రీనాథ్, కేదార్‌‌నాథ్‌ సందర్శించే ‌బీజేపీ, కాంగ్రెస్ నాయకులకు ఆహార వసతి, రవాణా ఖర్చులకు కూడా వినియోగించినట్లు ఆర్టిఐ చట్టం ద్వారా వెలుగులోకి వచ్చింది. అంటే ఇంతకాలం భక్తి రాజకీయంగా మారి పార్టీ ముఖ్య ఎజెండాగా బీజేపీని అధికారంలోకి తీసుకు రావడానికి ఉపయోగపడింది. ఇప్పుడు అదే భక్తి భక్తుల విశ్వాసాలతో ఆడుకుంటూ కొద్దిమంది వ్యక్తులకు ఆదాయ వనరుగా సహాయ పడుతున్నది. రాజకీయ నేతల విలాసాలకు విరాళాలు ఉపయోగించడం క్షమించరాని నేరం.

రాజకీయం వరకేనా రాముడు? రాజ్యాధి కారం సాధించడానికేనా శ్రీరాముడు? ఆ తరువాత ఎంతో ఘనంగా ప్రతిష్టించడం వరకు మామూలే. కానీ దాని ప్రతిష్ట కాపాడటం కూడా ఆయన్ను రాజకీయంగా వాడుకున్న వారిదే బాధ్యత. రాజకీయాల్లో పొగడ్తలు మాత్రమే స్వీకరిస్తామంటే కుదరదు. విమర్శలను ఆహ్వా నించాలి, వాటికి జవాబు చెప్పాలి. లేదంటే మౌనం పూర్తి అంగీకారంగానే భావించవలసి వస్తుంది. ఇప్పటికే అయోధ్యలో పర్యాటకం పడిపోయింది. భక్తుల సందర్శన కూడా తగ్గింది. ఇదంతా కేవలం ట్రస్ట్ సభ్యులు నిర్వాకం. ట్రస్టు పట్ల ప్రజల్లో ‘ట్రస్ట్’ లేకపోవడమే ప్రధాన కారణం. మౌనం వహిస్తే తప్పు ఒప్పు అవుతుందా? విరాళాల సేకరణకు, విరాళాల నిర్వహణకు ట్రస్ట్ బాధ్యత లేదా? ఎంతో ప్రాధాన్యతను సంతరిం చుకొని జాతీయ రాజకీయాల్లో ప్రముఖ పాత్రే కాదు 2014 తర్వాత నిర్ణయాత్మక పాత్ర పోషించిన అయోధ్య రాముడు, 2024 నుంచి బాలరాముడు ఇప్పుడు చిన్నబోయాడు. ఈ దేశంలో రామభక్తులు కోట్లాదిమంది ఉండవచ్చు. అది భక్తి మాత్రమే. అంతమాత్రాన వారంతా తమ బీజేపీ అభిమానులు అనుకుంటే అంతకుమించిన అజ్ఞానం మరొకటి ఉండదు.
ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత కేజ్రీవాల్ దోషులను ఉరితీయాలంటున్నాడు. ఒకపక్క దేశంలో జన్ జి ఉద్య మాలు క్రమంగా ఊపందుకుంటున్నాయి. ఇంకా బొద్దింకల పార్టీ ఆలయ అవినీతిపై దృష్టి సారించలేదు. ఈ నేపథ్యంలోనే ట్రస్ట్ అధ్యక్ష పదవికి పత్రికలలో నోటిఫికేషన్ జారీ చేయడం గమనార్హం. అది ఎవరైనా సరే రాజ కీయ ప్రతి‘నిధులు’ కాకుండా భక్తుల మనోభావాలు గౌరవించే సేవా తత్పరత కలిగిన మాజీ న్యాయాధికారులు లేదా అఖిల భారత అధికారులు అయితే ఆలయ ప్రతిష్ట ఇనుమడిస్తుంది. చోరీకి గురైన సొత్తు ఇంకా రికవరీ జరగలేదు. ట్రస్ట్ పూర్తిస్థాయిలో ప్రక్షాళన కావలసిన అవసరం ఉంది. దొరికిన చిరు చేపల మాటున దాగివున్న భారీ తిమింగలాలను పట్టుకొని శిక్షించాలి. మొన్నటిదాకా శ్రీరాముడు బీజేపీ ఎన్నికల అస్త్రంగా ఉంటే నేడు విపక్షాలకు విమర్శనాస్త్రంగా మారిపోయాడు. ఈ అవినీతిపరుల పాపాలను తన జలాలతో ఎక్కడ ప్రక్షాళన చేస్తారో అన్న భయంతో అక్కడి సరయు నది బిక్కుబిక్కుమంటూ ప్రవహిస్తున్నది.
శ్రీశ్రీ కుమార్, 9440354092

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -