Tuesday, July 21, 2026
E-PAPER
Homeజాతీయంపేరే అడ్డంకి..

పేరే అడ్డంకి..

- Advertisement -

ఉపాధిపైనా మత వివక్ష నీడ
పట్టణ అసంఘటిత రంగంలో చేదు వాస్తవాలు
అవకాశాలను నిర్ణయించేది మత గుర్తింపే!
కష్టాల్లో ముస్లిం మహిళా వలస కార్మికులు
ఢిల్లీలో నిర్వహించిన అధ్యయనంలో ఆందోళనకర విషయాలు వెలుగులోకి ఈ ధోరణి ఆర్థిక వ్యవస్థకూ నష్టమే : పరిశోధకులు, మేధావులు

న్యూఢిల్లీ : దేశంలోని మోడీ పాలనలో ముస్లింలు మతపరంగా వివక్ష, ద్వేషాన్ని ఎదుర్కొంటున్నారు. ఇందుకు ఢిల్లీలోని బీజేపీ డబుల్ ఇంజిన్ సర్కారు పాలనలో నెలకొన్న పరిస్థితులే ప్రత్యక్ష ఉదాహరణ. భారత్‌లో ముస్లింలపై పెరుగుతున్న సామాజిక పక్షపాతం ఇప్పుడు పట్టణ అసంఘటిత కార్మిక రంగంపైనా ప్రభావం చూపుతోంది. ఢిల్లీలో నిర్వహించిన తాజా అధ్యయనం ఈ విషయాన్ని వెల్లడించింది. ముఖ్యంగా ఇండ్లల్లో పనులు చేసే ముస్లిం మహిళా వలస కార్మికులు ఉద్యోగాల కోసం తమ పేర్లు, మత గుర్తింపును దాచుకోవాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయని పేర్కొంది. నైపుణ్యం, పని సామర్థ్యం కంటే మత గుర్తింపే ఉపాధి అవకాశాలను ప్రభావితం చేస్తుండటం ఆందోళనకరమని పరిశోధకులు అభిప్రాయపడ్డారు.

​పేరు చెప్తే గేటు వద్దే ‘నో’!
వలస మహిళా కార్మికుల జీవనోపాధిపై అధ్యయనం నిర్వహిస్తున్న సమయంలో పరిశోధకులకు అనేక ఆందోళనకర విషయాలు వెలుగుచూశాయి. ఇంటి పనుల కోసం వెతుకుతున్న ఓ మహిళ మొదట తన అసలు పేరు చెప్పడానికి కూడా వెనుకాడింది. ఉద్యోగం కోసం వెళ్లినప్పుడు వేరే పేరు చెప్పాల్సి వస్తోందనీ, అసలు పేరు చెప్తే అవకాశాలు ముందే మూసుకుపోతున్నాయని ఆమె తెలిపింది. మరో మహిళ.. తన పేరు తెలుసుకున్న సెక్యూరిటీ గార్డు తనను అపార్ట్‌మెంట్‌లోకి అనుమతించలేదని వివరించింది. యజమానిని కలిసే అవకాశం కూడా దక్కలేదనీ, తన పనితీరును అంచనా వేయకుండానే తనను పనికి నిరాకరించారని వాపోయింది. ఈ పరిశోధనలో పాల్గొన్న పలువురు మహిళలు ఇదే తరహా అనుభవాలను వెల్లడించారు. ముస్లింలు కావడం వల్ల కొన్ని నివాస సముదాయాల్లోకి ప్రవేశానికే అనుమతి నిరాకరించారనీ, మరికొన్ని ప్రాంతాల్లో తిరస్కరణ తప్పదనే భావనతో ఉపాధి కోసం వెళ్లడమే మానేశామని చెప్పారు. మరికొందరు ఉపాధి కోసం ఇప్పటికీ ఇతర పేర్లతోనే జీవనం కొనసాగిస్తున్నట్టు వెల్లడించారు.

​భయంతో బిక్కుబిక్కుమంటూ..
గతంతో పోలిస్తే వివక్ష స్వరూపం మారిందని మహిళలు తెలిపారు. ఒకప్పుడు యజమానిని కలిసిన తర్వాత ఉపాధిని నిరాకరించేవారనీ, ఇప్పుడైతే అపార్ట్‌మెంట్ గేటు వద్దే సెక్యూరిటీ సిబ్బంది, రెసిడెంట్ వెల్ఫేర్ అసోసియేషన్లు (ఆర్‌డబ్ల్యూఏలు), నమోదు ప్రక్రియలే తొలి అడ్డంకిగా మారాయని వివరించారు. దీంతో గేటు వద్దే ఉపాధికి తొలి అవరోధం ఏర్పడుతోందని పరిశోధకులు విశ్లేషించారు. ఆధార్ అనుసంధానం, పోలీసు వెరిఫికేషన్, బయోమెట్రిక్ గుర్తింపు వంటి ప్రక్రియలు అమల్లోకి రావడంతో ఇతర పేర్లు, నకిలీ గుర్తింపు పత్రాలతో ఇండ్లల్లో పనులు పొందడం ముస్లిం మహిళా వలస కార్మికులకు మరింత కష్టమైందని అధ్యయనం వెల్లడించింది. పని దొరికిన తర్వాత కూడా చాలామంది మహిళలు వేరే పేర్లను కొనసాగిస్తున్నారు. తమ అసలు మత గుర్తింపు బయటపడుతుందేమోననే భయంతో జీవిస్తున్నారు. అసలు పేరు బయటపడితే వారు తమ ఉపాధి కోల్పోవడంతో పాటు అవమానాలను ఎదుర్కోవాల్సి వస్తోందని అధ్యయనం వివరించింది.

​పని కోసం అష్టకష్టాలు
ఈ పరిస్థితులు ఉపాధి అనే ఆర్థిక భావనకే కొత్త కోణాన్ని తీసుకొచ్చాయని పరిశోధకులు అభిప్రాయపడ్డారు. సాధారణంగా పని చేయగల సామర్థ్యం, పని చేయాలనే ఆసక్తి ఉంటే ఉపాధి పొందే అవకాశం ఉండాలి. కానీ ముస్లిం మహిళా వలస కార్మికుల విషయంలో పరిస్థితి మరో రకంగా ఉంది. అదే తమ మత గుర్తింపును దాచుకోవడమని వారు వివరించారు. దీంతో పని కోసం వెతకడమే అదనపు ఖర్చుతో కూడిన ప్రక్రియగా మారిందని అధ్యయనం వెల్లడించింది. ఎక్కు వ సమయం వెచ్చించడం, దూర ప్రాంతాలకు వెళ్లడం, కొన్ని కాలనీలను పూర్తిగా దూరం పెట్టడం, అవకాశాలను కోల్పోవడం వంటి పరిస్థితులు నెలకొంటున్నాయని పేర్కొంది. పని దొరికిన తర్వాత కూడా మాట్లాడే తీరు, ప్రవర్తన, వ్యక్తిగత వివరాల ద్వారా మత గుర్తింపు బయటపడకుండా నిరంతరం అప్రమత్తంగా ఉండాల్సి వస్తోందని తెలిపింది. ఈ మానసిక ఒత్తిడిని తట్టుకోలేక కొందరు మహిళలు ఉపాధి కోసం ప్రయత్నించడాన్నే విరమించుకుంటున్నట్టు అధ్యయనంలో వెల్లడైంది.

దేశ ఆర్థిక వ్యవస్థకు నష్టం
ఇది సామాజిక వివక్ష మాత్రమే కాదనీ, ఉపాధి పొందడానికి చెల్లించాల్సి వస్తున్న మానసిక, ఆర్థిక మూల్యమంటూ పరిశోధకులు విశ్లేషించారు. మత గుర్తింపు ఆధారంగా ఉద్యోగ, ఉపాధి అవకాశాలు నిరాకరిస్తే.. కార్మిక మార్కెట్ సామర్థ్యాన్ని కోల్పోతుందని ఆందోళన వ్యక్తం చేశారు. నైపుణ్యం ఉన్న కార్మికులు అవకాశాలు కోల్పోవడం వల్ల వారి కుటుంబాల ఆదాయం తగ్గడమే కాకుండా వినియోగ వ్యయం కూడా క్షీణిస్తుందని, దీని ప్రభావం మొత్తం ఆర్థిక వ్యవస్థపై పడుతుందని మేధావులు, సామాజిక కార్యకర్తలు వివరించారు.​

​‘నైపుణ్యం ఆధారంగా మమ్మల్ని అంచనా వేయాలి’
తాము ప్రత్యేక రాయితీలు కోరడం లేదని, ఇతరుల వలే సమాన అవకాశాలు కల్పించి తమ పనితీరును నైపుణ్యం ఆధారంగా అంచనా వేయాలని మాత్రమే మహిళలు కోరుతున్నారని పరిశోధకులు వెల్లడించారు. ప్రపంచ ఆర్థిక శక్తిగా ఎదగాలన్న భారత్ లక్ష్యాన్ని సాధించాలంటే ప్రతి కార్మికుడికి మతం, గుర్తింపుతో సంబంధం లేకుండా సమాన ఉపాధి అవకాశాలు కల్పించాల్సిన అవసరం ఉందని సూచించారు. ఈ విషయంలో ప్రభుత్వాలు మతం ఆధారంగా వ్యవహరించకుండా, తటస్థ విధానాలను తీసుకురావాలని తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -