చలో ఢిల్లీ యాత్రను
అడ్డుకున్న పోలీసులు
ప్రభుత్వ హామీతో యాత్ర విరమణ
న్యూఢిల్లీ : అటు కాక్రోచ్ పార్టీ ధర్నా గురించి కేంద్రం తంటాలు పడుతుంటే..మరో వైపు అన్నదాతలు చలో ఢిల్లీ అంటూ కదిలారు. మోడీ ప్రభుత్వం ప్రతిపాదిత భారత్-అమెరికా వాణిజ్య ఒప్పందానికి వ్యతిరేకంగా జరగనున్న కిసాన్ మహాపంచాయత్‌లో పాల్గొనేందుకు మంగళవారం ఢిల్లీ వైపు పాదయాత్ర ప్రారంభించారు. పంజాబ్‌కు చెందిన వందలాది మంది రైతులను, హర్యానా ప్రవేశ ద్వారమైన శంభు సరిహద్దు వద్ద హర్యానా పోలీసులు అడ్డుకున్నారు. 2024 ఫిబ్రవరిలో జరిగిన ‘ఢిల్లీ చలో-2’ ఆందోళనను తలపించేలా రైతన్నలు కదిలారు. దీంతో ముందస్తుగా పంజాబ్-హర్యానా సరిహద్దులో బారికేడ్లు ఏర్పాటు చేశారు. ఆ ఆందోళనలో రైతులను జాతీయ రాజధానిలోకి ప్రవేశించకుండా నిరోధించడానికి కాంక్రీట్ దిమ్మెలు, ఇనుప మేకులు, బహుళ అంచెల బారికేడ్లతో సరిహద్దును ఒక దిగ్బంధనంగా మార్చారు. అయితే ప్రభుత్వం ప్రవేశించకుండా చర్యలు తీసుకోవటంతో.. రైతులు శంభు సరిహద్దును నిరసన ప్రదేశంగా మార్చుకున్నారు. ఢిల్లీలో సమావేశమయ్యే తమ ప్రజాస్వామ్య హక్కును హర్యానా, పంజాబ్ ప్రభుత్వాలు అణచివేస్తున్నాయని వారు ఆరోపించారు. అయితే మధ్యాహ్నానికల్లా, తమ రెండు డిమాండ్లపై హర్యానా ప్రభుత్వం ఇచ్చిన హామీలతో రైతులు సరిహద్దు నుంచి వెనుదిరిగారు.
డిమాండ్లు ఇవే..
హర్యానాలో అరెస్టు అయిన రైతు సంఘాల నాయకులందరినీ విడుదల చేయాలి కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్‌తో సమావేశం ఏర్పాటు చేయాలి అంతకుముందు హర్యానా పోలీసులు పంజాబ్ భూభాగంలోకి బారికేడ్లు ఏర్పాటు చేశారని బీకేయూ షహీద్ భగత్ సింగ్ నాయకుడు తేజ్‌వీర్ సింగ్ ఆరోపించారు. ఈ చర్యను ప్రతిఘటించకుండా పంజాబ్ ప్రభుత్వం “నిశ్శబ్ద ప్రేక్షకునిగా” ఉండిపోయిందని ఆయన పేర్కొన్నారు. పంజాబ్ లో రైతు యాత్రను నిలిపివేసినప్పటికీ, అంబాలా, కురుక్షేత్ర , పొరుగు జిల్లాలతో సహా హర్యానాకు చెందిన రైతులు ఢిల్లీకి తమ ప్రయాణాన్ని కొనసాగించారు. ప్రతిపాదిత భారత్-అమెరికా వాణిజ్య ఒప్పందాన్ని కేంద్రం విరమించుకోవాలని డిమాండ్ చేస్తూ, ‘దేశ్ బచావో మోర్చా’ బ్యానర్ కింద ఏర్పాటు చేసిన మహాపంచాయత్, పంజాబ్, హర్యానా , హిమాచల్ ప్రదేశ్‌లకు చెందిన రైతు సంఘాలను ఏకతాటిపైకి తెచ్చింది. కేఎంఎస్ సీ కిసాన్ మజ్దూర్ మోర్చా (పంజాబ్ చాప్టర్), ఆజాద్ కిసాన్ మోర్చా ,బీకేయూ ఏక్తా సంఘర్ష్‌ల కాన్వాయ్‌లను శంభు సరిహద్దులో ఆపడానికి ముందే పంజాబ్‌లోని వివిధ ప్రాంతాల నుంచి బయలుదేరినట్లు కిసాన్ మజ్దూర్ సంఘర్ష్ కమిటీ (కేఎంఎస్ సీ ) నాయకుడు సర్వన్ సింగ్ పంధేర్ తెలిపారు. ఫిబ్రవరి 2026లో జారీ చేసిన భారత్-అమెరికా సంయుక్త ప్రకటన ప్రకారం.. బహుళ రంగాల ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందంలోని మొదటి విడతపై చర్చలు జరపడానికి ఇరు దేశాలను కట్టుబడి ఉండేలా చేసిందని పాంధర్ అన్నారు.
ప్రతిపాదిత ఒప్పందం ఒక సంప్రదాయ వాణిజ్య ఒప్పందం కంటే చాలా ఎక్కువని, ఇది వ్యవసాయం, పాడి, పరిశ్రమ, డిజిటల్ వాణిజ్యం, ఇ-కామర్స్, పెట్టుబడి, ప్రభుత్వ సేకరణ, మేధో సంపత్తి హక్కులు , సేవల రంగంలో చర్చలకు మార్గం సుగమం చేయగలదని ఆయన వాదించారు. సోయాబీన్స్, మొక్కజొన్న, పత్తి, ఇథనాల్, ఆపిల్స్, బాదం, పాల ఉత్పత్తులు, కోళ్లు మరియు మత్స్య పరిశ్రమ వంటి ఉత్పత్తులపై తక్కువ సుంకాలు , తక్కువ పరిమితుల ద్వారా భారతదేశ వ్యవసాయ, పాడి మార్కెట్లలోకి మరింత లోతైన ప్రవేశం కల్పించాలని గత అమెరికా వాణిజ్య నివేదికలు నిరంతరం కోరాయని రైతు నాయకులు తెలిపారు. సబ్సిడీతో కూడిన అమెరికన్ వ్యవసాయ, పాడి ఉత్పత్తులకు భారతదేశ మార్కెట్‌ను తెరవడం వల్ల లక్షలాది మంది చిన్న, సన్నకారు భారతీయ రైతులు పోటీ పడలేరని వారు హెచ్చరించారు. ప్రతిపాదిత ఒప్పందంలోని కీలక వివరాలను బహిరంగపరచలేదని ఆరోపిస్తూ, చర్చల చుట్టూ పారదర్శకత లోపించడంపై కూడా వారు ఆందోళన వ్యక్తం చేశారు. భారతదేశంలోని పాడి రంగం ఒక్కటే దాదాపు 8 కోట్ల గ్రామీణ కుటుంబాలకు జీవనాధారమని ఆ సంస్థలు పేర్కొన్నాయి. దీనివల్ల కలిగే ఏ ప్రతికూల ప్రభావమైనా గ్రామీణ ఆర్థిక వ్యవస్థ అంతటా ప్రతిధ్వనిస్తుందని, పాడి ఉత్పత్తిదారులు, చిన్న వ్యాపారులు, వ్యవసాయ ఆధారిత పరిశ్రమలు, ఆహార ప్రాసెసర్లు , సూక్ష్మ సంస్థలను ప్రభావితం చేస్తుందని హెచ్చరించాయి.
ప్రతిపాదిత భారత్-అమెరికా వాణిజ్య ఒప్పందానికి సంబంధించిన అన్ని పత్రాలను కేంద్రం తక్షణమే ప్రజలకు అందుబాటులో ఉంచాలని, అలాగే రైతులు, కార్మికులు, పాడి ఉత్పత్తిదారులు, చిన్న వ్యాపారులు మరియు ఇతర భాగస్వాములతో సమగ్ర సంప్రదింపులు జరపకుండా ఎలాంటి ఒప్పందంపై సంతకం చేయవద్దని దేశ్ బచావో మోర్చా డిమాండ్ చేసింది.



