Wednesday, July 22, 2026
E-PAPER
Homeఖమ్మంవిద్యార్థులపై ఖాకీల పైశాచికత్వం దారుణం

విద్యార్థులపై ఖాకీల పైశాచికత్వం దారుణం

- Advertisement -

– ​సత్తుపల్లి ఎమ్మెల్యే డాక్టర్ మట్టా రాగమయి దయానంద్ ఆవేదన
– ​నీట్ పేపర్ లీకేజీకి బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి వెంటనే రాజీనామా చేయాలి
– ​సత్తుపల్లిలో 10 వేల మంది విద్యార్థులతో కాంగ్రెస్ భారీ నిరసన ర్యాలీ
నవతెలంగాణ-సత్తుపల్లి

సామాజికవేత్త సోనమ్ వాంగ్‌చుక్ శాంతియుత దీక్షను భగ్నం చేయడం, నీట్ లీకేజీపై న్యాయం విన్నవించేందుకు ‘చలో పార్లమెంట్’ పిలుపునిచ్చిన విద్యార్థులపై పోలీసులు విచక్షణారహితంగా లాఠీ ఛార్జ్ చేయడం అత్యంత అమానుషమని సత్తుపల్లి ఎమ్మెల్యే డాక్టర్ మట్టా రాగమయి దయానంద్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. బుధవారం సత్తుపల్లిలో ఎమ్మెల్యే డాక్టర్ మట్టా రాగమయి దయానంద్, రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు డాక్టర్ మట్టా దయానంద్ విజయకుమార్ ఆధ్వర్యంలో సుమారు 10 వేల మంది విద్యార్థులతో భారీ నిరసన ర్యాలీ నిర్వహించారు. ర్యాలీ అనంతరం బస్టాండ్ రింగ్ సెంటర్‌లోని ఎల్ఈడీ స్క్రీన్‌పై ఢిల్లీ పోలీసులు జరిపిన దౌర్జన్యాన్ని వీక్షిస్తూ, రక్తం చిందేలా విద్యార్థులు దెబ్బలు తినడం చూసి ఎమ్మెల్యే రాగమయి కంటతడి పెట్టారు.

​ప్రజాస్వామ్యానికి చీకటి రోజులు
శాంతియుతంగా నిరసన తెలుపుతున్న విద్యార్థులను  అమ్మాయిలు, అబ్బాయిలు అని తేడా లేకుండా బాష్పవాయువు ప్రయోగించి దారుణంగా ఈడ్చుకెళ్లడం, రక్తం చిందేలా గొడ్డును బాదినట్లు బాదడం అమానుషమన్నారు. విద్యార్థులకు మద్దతుగా వెళ్లిన ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలను నిర్బంధించి బలవంతంగా తరలించడం ప్రజాస్వామ్య విలువలకే విరుద్ధమన్నారు.

నీట్ పరీక్ష నిర్వహణలో కేంద్ర వైఫల్యం
ఏళ్ల తరబడి శ్రమించి, ఆర్థిక ఇబ్బందులు తట్టుకుని ‘నీట్’ పరీక్షలు రాసిన విద్యార్థుల భవిష్యత్తును లీకేజీలతో నాశనం చేశారని ఎమ్మెల్యే రాగమయి దయానంద్ ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వ వైఫల్యం వల్లే 22 మంది విద్యార్థులు ప్రాణాలు కోల్పోయారని ఆమె బాధను వ్యక్తం చేశారు.

​కేంద్ర విద్యాశాఖ మంత్రిని వెంటనే బర్తరఫ్ చేయాలని, మరణించిన విద్యార్థుల కుటుంబాలకు రూ. కోటి పరిహారం చెల్లించాలని ఆమె డిమాండ్ చేశారు. కాంగ్రెస్ పార్టీ విద్యార్థి లోకానికి, సోనమ్ వాంగ్‌చుక్‌కు సంపూర్ణ మద్దతుగా నిలుస్తుందని స్పష్టం చేశారు.

​ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్‌పర్సన్ మొహమ్మద్ రెహానా కమల్, వైస్ చైర్‌పర్సన్ బొంతు సుమలత, ఏఎంసీ చైర్మన్ దోమ ఆనంద్ బాబు, పట్టణ, మండల కాంగ్రెస్ అధ్యక్షులు గాదె చెన్నకేశవరావు, భీమిరెడ్డి సుబ్బారెడ్డి, నాయకులు చల్లగుళ్ల నరసింహారావు, మొహమ్మద్ కమల్ పాషా, నారాయణవరపు శ్రీనివాస్, పింగుల సామేలు, కౌన్సిలర్లు, ఎన్ఎస్‍యూఐ నాయకులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -