అభిప్రాయ సేకరణ గడువు 60 రోజులు పొడిగించాలి : ఎంఏయూడీ శాఖకు
ఈ-మెయిల్ ద్వారా యూడీఎఫ్ కన్వీనర్ ఎం.శ్రీనివాస్ మెమోరాండం
నవతెలంగాణ–సిటీ బ్యూరో
రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల విడుదల చేసిన ‘కోర్ అర్బన్ రీజియన్(ఇంటిగ్రేటెడ్ గవర్నెన్స్) బిల్లు- 2026’(క్యూర్ బిల్లు) ముసాయిదా స్థానిక స్వయంపరిపాలన సూత్రాలను కాలరాసేలా ఉందని అర్బన్ డెవలప్‌మెంట్ ఫోరం(యూడీఎఫ్) పేర్కొంది. దీనివల్ల పట్టణ పేద, మధ్యతరగతి ప్రజలపై తీవ్ర ఆర్థిక భారం పడుతుందని ఆందోళన వ్యక్తం చేసింది. ఈ మేరకు ఫోరం కన్వీనర్ ఎం. శ్రీనివాస్ బుధవారం ఈ మెయిల్ ద్వారా ఎంఏయూడీ శాఖకు మెమోరాండం పంపించారు. 271 పేజీల సుదీర్ఘ ముసాయిదాను అధ్యయనం చేయడానికి 20 రోజుల సమయం ఏమాత్రమూ సరిపోదని, ప్రజాభిప్రాయ సేకరణ గడువును కనీసం మరో 60 రోజులు పొడిగించాలని డిమాండ్ చేశారు.
74వ రాజ్యాంగ సవరణ ద్వారా మున్సిపాలిటీలకు లభించిన స్వయం ప్రతిపత్తిని ఈ బిల్లు తీవ్రంగా బలహీనపరుస్తోందని, పాలనాపరమైన అధికారాలన్నింటినీ రాష్ట్ర ప్రభుత్వమే తన వద్ద కేంద్రీకృతం చేసుకునేలా నిబంధనలు తీర్చిదిద్దారని తెలిపారు. రీజియన్ స్థాయిలో కీలక నిర్ణయాలు తీసుకునే ‘అపెక్స్ గవర్నెన్స్ కౌన్సిల్’, ‘ఎగ్జిక్యూటివ్ కమిటీ’ల్లో స్థానిక మేయర్లు, డిప్యూటీ మేయర్లు, కార్పొరేటర్లకు ఎలాంటి స్థానమూ కల్పించకపోవడం ప్రజాస్వామ్య సూత్రాలకు పూర్తిగా విరుద్ధమన్నారు ఆస్తిపన్ను విధానాన్ని ఇప్పటివరకు ఉన్న ‘యాన్యువల్ రెంటల్ వ్యాల్యూ’(ఏఆర్‌వీ) నుంచి ‘క్యాపిటల్ వ్యాల్యూ’(సీవీ)కి మార్చడం వల్ల పట్టణ ప్రజలపై, ముఖ్యంగా మధ్యతరగతి వర్గాలపై ఆస్తి పన్నులు విపరీతంగా పెరిగే ప్రమాదం ఉందన్నారు.
బిల్లులోని సెక్షన్ 237 ప్రకారం ప్రతి ఏటా నీటి సరఫరా, మురుగునీటి పన్నులను ఆటో మేటిక్‌గా 5శాతం చొప్పున పెంచే నిబంధన చేర్చా రన్నారు. ఇది సామాన్య ప్రజలపై తీవ్ర ఆర్థిక భారాన్ని మోపడమే అవుతుందన్నారు. రాజ్యాంగబద్ధంగా ఏర్పాటు చేయాల్సిన వార్డు కమిటీలకు బడ్జెట్ రూపకల్పనలోగానీ, నిధుల వినియోగ పరిశీల నలోగానీ ఎలాంటి నిర్ణయా ధికారాలూ ఇవ్వలేదని, దీనివల్ల స్థానిక పాలనలో ప్రజాభా గస్వామ్యం నామమాత్రంగానే మిగిలిపోతుందని ఆందోళన వ్యక్తం చేశారు. అక్రమ నిర్మాణాలపై 300 శాతం వరకు పెనాల్టీలు విధించే నిబంధన.. అక్రమాలను అరికట్టడానికి కాకుండా, ప్రభుత్వ ఆదాయాన్ని పెంచుకోవడానికి మాత్రమే ఉపయోగపడేలా ఉందని తెలిపారు.
271 పేజీలకుపైగా ఉన్న ఇంత పెద్ద చట్ట ముసాయిదాపై ప్రజలు, ప్రజాప్రతినిధులు, పట్టణ నిపుణులు విస్తృతంగా చర్చించేందుకుగాను అభిప్రాయ సేకరణ గడువును మరో 60 రోజులు పొడిగించాలని కోరారు. స్థానిక సంస్థల స్వయం ప్రతిపత్తిని కాపాడుతూ, ప్రజలపై భారాలు తగ్గించేలా బిల్లులో తగిన సవరణలు చేయాలని విజ్ఞప్తి చేశారు.
స్థానిక సంస్థల హక్కులను కాలరాసేలా ‘క్యూర్’ బిల్లు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



