ఎల్‌నినో సవాల్‌ను సమర్థవంతంగా ఎదుర్కొంటున్న తెలంగాణ విద్యుత్ వ్యవస్థ
7 వేల మెగావాట్ల అదనపు భారాన్ని విజయవంతంగా నిర్వహించాం
దురదృష్టవశాత్తు విద్యుత్ ప్రమాదంలో మరణిస్తే.. కోటి రూపాయల ప్రమాద బీమా
దేశంలోనే తొలిసారిగా ‘ఎలక్ట్రిసిటీ ఆంబులెన్స్’, 1912 హెల్ప్‌లైన్‌కు కృత్రిమ మేధ :
రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క
రూ.56 కోట్లతో వివిధ విద్యుత్ అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు
సంప్రదాయేతర విద్యుత్ అవసరాలకు దేవాలయ భూములు : మంత్రి సురేఖ
నవతెలంగాణ-వరంగల్ ప్రాంతీయ ప్రతినిధి
‘ఎల్‌నినో ప్రతికూల ప్రభావంతో వర్షాకాలంలోనూ వేసవిని తలపించే స్థాయిలో విద్యుత్ డిమాండ్ పెరిగింది. మరోవైపు జలాశయాల్లో నీటి లభ్యత తగ్గిపోయింది. దాంతో జలవిద్యుత్ ఉత్పత్తి గణనీయంగా పడిపోవడంతో ఒకేసారి సుమారు 7,000 మెగావాట్ల అదనపు భారాన్ని తెలంగాణ విద్యుత్ వ్యవస్థ అత్యంత సమర్థవంతంగా ఎదుర్కొంటోంది. దానివల్ల ప్రజలకు ఎలాంటి అంతరాయం లేకుండా నాణ్యమైన విద్యుత్‌ను అందించగలుగుతున్నాం’ అని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క తెలిపారు. బుధవారం హనుమకొండ నక్కలగుట్టలోని టీజీఎన్పీడీసీఎల్ కార్పొరేట్ కార్యాలయంలో (విద్యుత్ భవన్) రూ.56కోట్ల వ్యయంతో చేపట్టిన పలు విద్యుత్ అభివృద్ధి పనులకు ఆయన శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు నిర్వహించారు. ఈ సందర్భంగా వాజ్‌పేయి కాలనీ, ఆర్ అండ్ బీ క్వార్టర్స్, విద్యుత్ నగర్, వడ్డేపల్లి ఫిల్టర్ బెడ్ ప్రాంతాల్లో నిర్మించనున్న 33/11 కేవీ విద్యుత్ ఉపకేంద్రాలు, హనుమకొండ నూతన సర్కిల్ కార్యాలయ భవనం, టీజీఎన్పీడీసీఎల్ కార్పొరేట్ కార్యాలయం ఐదో అంతస్తు నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. అనంతరం డబుల్ బెడ్రూమ్ కాలనీలో నిర్మించిన 33/11 కేవీ విద్యుత్ ఉప కేంద్రాన్ని, టీజీఎన్పీడీసీఎల్ కార్పొరేట్ కార్యాలయంలో అత్యాధునిక సమావేశ మందిరాన్ని ప్రారంభించారు.అనంతరం జరిగిన సమీక్షా సమావేశంలో టీజీఎన్పీడీసీఎల్ సీఎండీ కర్నాటి వరుణ్‌రెడ్డి.. పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా సంస్థ పనితీరు, వినియోగదారులకు అందిస్తున్న సేవలు, భవిష్యత్ కార్యాచరణను వివరించారు. 2023 డిసెంబర్ నుంచి 2026 జూన్ వరకు 70 కొత్త 33/11 కేవీ విద్యుత్ ఉపకేంద్రాలు, 31,448 కిలోమీటర్ల కొత్త విద్యుత్ లైన్లు, 35,736 డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్లు (డీటీఆర్లు) ఏర్పాటు చేసినట్టు తెలిపారు. అదే కాలంలో 7.72 లక్షల కొత్త ఎల్టీ కనెక్షన్లు, 771 హెచ్‌టీ కనెక్షన్లు విడుదల చేయగా, 1,656 గ్రామాలు, 11.16 లక్షలకు పైగా వినియోగదారులు ప్రత్యక్షంగా లబ్ది పొందినట్టు వెల్లడించారు.
ఈ సందర్భంగా ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. సాధారణంగా వర్షాకాలంలో 11వేల మెగావాట్లుగా ఉండే విద్యుత్ డిమాండ్ అనూహ్యంగా 16,500 మెగావాట్లకు పెరగడం, మరోవైపు జలవిద్యుత్ ఉత్పత్తి 2,000 మెగావాట్లు తగ్గిపోవడం విద్యుత్ పంపిణీ వ్యవస్థపై తీవ్రమైన ఒత్తిడి సృష్టించిందని అన్నారు. అయినప్పటికీ, విద్యుత్ శాఖ అధికారులు, సిబ్బంది ముందస్తు ప్రణాళికలు, అంకితభావంతో పనిచేయడం వల్ల ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా నిరంతరాయంగా నాణ్యమైన విద్యుత్ సరఫరా చేశామని తెలిపారు. ఎన్పీడీసీఎల్ పరిధిలోని కాళేశ్వరం, దేవాదుల, సీతారామ ఎత్తిపోతల పథకాలు, వర్షాభావం కారణంగా రైతులు అధికంగా బోర్వెల్లను వినియోగించడం వల్ల పెరిగిన విద్యుత్ అవసరాలను కూడా ప్రభుత్వం విజయవంతంగా నిర్వహించిందన్నారు. రాష్ట్రంలో ‘పవర్ కట్’ అనే పరిస్థితి లేదని, ప్రకృతి వైపరీత్యాల వల్ల విద్యుత్ స్తంభాలు, లైన్లు దెబ్బతిన్నప్పుడు మాత్రమే తాత్కాలిక అంతరాయం ఏర్పడుతుందని, దాన్ని పవర్ కట్‌గా భావించవద్దని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
దేశంలోనే తొలి ‘ఎలక్ట్రిసిటీ ఆంబులెన్స్’ సేవలు
దేశంలోనే తొలిసారిగా తెలంగాణలో ఎలక్ట్రిసిటీ ఆంబులెన్స్ సేవలను ప్రారంభించినట్టు ఉప ముఖ్యమంత్రి ప్రకటించారు. గతంలో వైద్య సేవల్లో 108 అంబులెన్స్ సేవలు అందించిన తరహాలోనే, ఇప్పుడు విద్యుత్ అత్యవసర సమస్యల పరిష్కారం కోసం ప్రత్యేకంగా రూపొందించిన ఈ సేవల్లో ట్రాన్స్ఫార్మర్లు, వైర్లు, నిచ్చెనలు, అవసరమైన పరికరాలు, నిపుణులైన సిబ్బంది అందుబాటులో ఉంటారని తెలిపారు. వినియోగదారులు టోల్ ఫ్రీ నంబర్ 1912కు ఫోన్ చేయగానే కృత్రిమ మేధస్సు ఆధారిత వ్యవస్థ ద్వారా సమాచారం వెంటనే సంబంధిత బఅందానికి చేరి, అత్యంత వేగంగా సంఘటనా స్థలానికి చేరుకుని సమస్యను పరిష్కరిస్తుందని వివరించారు.
లైన్మెన్ల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉంది
విద్యుత్ వ్యవస్థకు వెన్నెముకైన లైన్మెన్లు, ఉద్యోగుల సంక్షేమానికి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని భట్టి విక్రమార్క తెలిపారు. విధి నిర్వహణలో ప్రమాదవశాత్తు మరణించిన ఉద్యోగుల కుటుంబాలకు రూ.1.20 కోట్ల బీమా సౌకర్యం కల్పించామని, సురక్షితంగా విధులు నిర్వహించేందుకు అవసరమైన సేఫ్టీ కిట్లు, యూనిఫారాలు అందిస్తున్నట్టు చెప్పారు. గృహజ్యోతి పథకం ద్వారా 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ పొందుతున్న 53 లక్షల కుటుంబాల విద్యుత్ బిల్లులను రాష్ట్ర ప్రభుత్వం డిస్కంలకు చెల్లిస్తోందని, రాష్ట్రవ్యాప్తంగా 30లక్షల వ్యవసాయ పంపుసెట్లకు ఏటా రూ.14 వేల కోట్ల సబ్సిడీని కూడా ప్రభుత్వం విడుదల చేస్తోందని తెలిపారు.
సంప్రదాయేతర ఇంధన వనరులపై దృష్టి : మంత్రి సురేఖ
మంత్రి కొండా సురేఖ మాట్లాడుతూ.. రాష్ట్రంలో పెరుగుతున్న విద్యుత్ అవసరాలను దృష్టిలో ఉంచుకుని సంప్రదాయేతర ఇంధన వనరుల అభివృద్ధికి ప్రాధాన్యత ఇవ్వాలని, ముఖ్యంగా సౌర (సోలార్), పవన (విండ్) విద్యుత్ ఉత్పత్తి విస్తరణపై ప్రత్యేక కార్యాచరణ రూపొందించాలని సూచించారు. విద్యుత్ ఉపకేంద్రాలు, సోలార్ పార్కులు, ఇతర విద్యుత్ మౌలిక వసతుల ఏర్పాటుకు అవసరమైతే దేవాదాయ శాఖ భూములను కేటాయిస్తామని తెలిపారు. దీనివల్ల దేవాదాయ భూముల ఆక్రమణలు నివారించబడటంతోపాటు అదనపు ఆదాయం సమకూరుతుందని అన్నారు. రాష్ట్రంలోని ప్రధాన దేవాలయాలు, ప్రభుత్వ కార్యాలయాలు, కలెక్టరేట్లపై సౌర విద్యుత్ ఉత్పత్తి వ్యవస్థలను ఏర్పాటు చేసేలా పరిశీలించాలని కోరారు. ముఖ్యంగా భద్రకాళి ఆలయం పరిసర ప్రాంతాల్లోని నీటి వనరులు, చెరువుల్లో ఫ్లోటింగ్ సోలార్ ప్రాజెక్టుల ఏర్పాటుకు అవసరమైన డిజైన్లు సిద్ధం చేయాలని టీజీఎన్పీడీసీఎల్ అధికారులను మంత్రి ఆదేశించారు. ఈ కార్యక్రమంలో మంత్రి పొన్నం ప్రభాకర్, ఎమ్మెల్యేలు నాయిని రాజేందర్‌రెడ్డి, కేఆర్ నాగరాజు, హనుమకొండ, వరంగల్ జిల్లాల కలెక్టర్లు చాహత్ బాజ్‌పాయి, డాక్టర్ సత్య శారద, గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కమిషనర్ టి. వెంకన్న, వరంగల్ జిల్లా అటవీ అధికారి (డీఎఫ్ఓ) నిఖిల, విద్యుత్ శాఖ ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.
రాష్ట్రంలో పవర్ కట్స్ లేవు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



