ప్రాజెక్టుల్లో నీటి నిల్వలు పరిమితం : వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు
నవతెలంగాణ-రఘునాథపాలెం
అధిక నీటి అవసరమున్న పంటలకు బదులుగా ప్రత్యామ్నాయ పంటల సాగువైపు రైతులు మళ్లాలని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సూచించారు. తాగునీటిని పరిరక్షిస్తూ అందుబాటులో ఉన్న నీటిని పొదుపుగా వినియోగించాలన్నారు. బుధవారం ఖమ్మం జిల్లా రఘునాథపాలెం మండలం లోని వి.వెంకటాయపాలెం డీప్‌కట్ వద్ద గోదావరి జలాల పరిస్థితిని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, జిల్లా కలెక్టర్ దివాకర టీఎస్‌తో కలిసి పరిశీలించారు. అనంతరం అధికారులు, ఇంజినీర్లతో నీటి లభ్యత, తాగునీటి పరిరక్షణ, గోదావరి జలాలను ఖమ్మం వైపు మళ్లించే కార్యాచరణపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ప్రస్తుతం ప్రాజెక్టుల్లో నీటి నిల్వలు పరిమితంగా ఉన్నందున ప్రతి చుక్క నీటిని పొదుపుగా వినియోగ చా లని అన్నారు. వరి, మిర్చి వంటి అధిక నీటి అవసరమున్న పంటలకు బదులుగా ఆయిల్‌పామ్, చిరుధాన్యాలు, పప్పుధాన్యాల సాగుపై రైతులు దృష్టి సారించాలని సూచించారు. ప్రత్యామ్నాయ పంటలపై వ్యవసాయ శాఖ ఇప్పటికే అవగాహన కల్పిస్తున్నప్పటికీ రైతులు వరి సాగుపైనే మొగ్గు చూపితే ఇబ్బందులు తప్పవని తెలిపారు. 1977 కరువుతో పోలిస్తే ఈసారి సూపర్ ఎల్‌నినో ప్రభావం మరింత తీవ్రంగా ఉండే అవకాశం ఉందని, ఆగస్టు, సెప్టెంబర్ నెలల్లో భూగర్భ జలాలు మరింత తగ్గే పరిస్థితి ఏర్పడవచ్చని అన్నారు. తాగునీటి పరిరక్షణపై అధికారులు, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచిం చారు. ఖమ్మం జిల్లాకు గోదావరి జలాలను అందించా లన్న లక్ష్యంతో సీతారామ ఎత్తిపోతల పథకాన్ని ప్రారంభించామని, ప్రస్తుతం ఆ ప్రాజెక్టు ద్వారా జిల్లాకు గోదావరి జలాలు అంలేవు న్నాయని తెలిపారు. వైరాకు తరలించిన గోదావరి నీటిని రాజీవ్ కాలువ షట్టర్లు మూసివేసి తిరిగి ఖమ్మం వైపు మళ్లించే వినూత్న ప్రయోగం కొనసాగుతోందన్నారు. మంచు కొండతో పాటు ఇతర ఎత్తిపోతల వ్యవస్థల ద్వారా చెరువులను నింపి ఖమ్మం నగర తాగునీటి అవసరాలు తీర్చేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. రాజీవ్ కాలువ నిర్మాణంతో సుమారు రెండు లక్షల ఎకరాలకు సాగునీరు అందించే అవకాశం ఏర్పడిందని, ప్రాజెక్టు విజయవంతంగా పూర్తిచేసిన ఇంజినీర్లను అభినందించారు. యూరియా సరఫరాలో పారదర్శకత కోసం ప్రభుత్వం యూరియా బుకింగ్ యాప్‌ను ప్రవేశపెట్టిందని, రైతులు అపోహలకు లోనుకాకుండా దానిని వినియోగించుకోవాలని సూచించారు.నీళ్ళు లేవు : కలెక్టర్ దివాకర్
ప్రస్తుతం నీటి లభ్యత చాలా తక్కువగా ఉందని, వర్షాలు కురవకపోతే రాబోయే రోజుల్లో తాగునీటి సమస్య తీవ్రరూపం దాల్చే అవకాశం ఉందన్నారు. వచ్చే జూన్ వరకు తాగునీటి అవసరాలు తీరేలా సమగ్ర కార్యాచరణ సిద్ధం చేశామని తెలిపారు. రాజీవ్ కాలువ ద్వారా గోదావరి జలాలను తిరిగి ఖమ్మం వైపు మళ్లించి పాలేరు రిజర్వాయర్‌ను నింపే అవకాశాలను పరిశీలిస్తున్నామని చెప్పారు. రైతులు నీటి లభ్యతను దృష్టిలో ఉంచుకుని ప్రత్యామ్నాయ పంటల సాగుకే ప్రాధాన్యం ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. అనంతరం మంత్రి ఖమ్మం నగరంలోని 3, 4, 5 డివిజన్లలో యూఐడీఎఫ్ నిధులతో రూ.1.75 కోట్ల వ్యయంతో చేపట్టనున్న సీసీ రోడ్లు, సీసీ కాలువల నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో సుడా చైర్మెన్ పువ్వాల దుర్గాప్రసాద్, రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మెన్ రాయల నాగేశ్వరరావు, ఖమ్మం మార్కెట్ కమిటీ చైర్మెన్ హనుమంతరావు, ఇరిగేషన్ చీఫ్ ఇంజినీర్ శ్రీనివాసరెడ్డి, ఎం.వెంకటేశ్వర్లు, డీపీఓ రాంబాబు, వి.వెంకటాయపాలెం సర్పంచ్ కాపా ఆదినారాయణ, వివిధ శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.
ప్రత్యామ్నాయ పంటల సాగు చేయాలి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



