నాలుగు గదుల్లో రెండు స్కూళ్లు ఎలా నడుపుతారు?
పాఠశాల పునరుద్ధరణకు నిధులు కేటాయించకుంటే
డీఈఓ కార్యాలయం ముట్టడిస్తాం
సీపీఐ(ఎం) రాష్ట్ర
కార్యదర్శివర్గ సభ్యులు పోతినేని సుదర్శన్‌రావు
నవతెలంగాణ-గాంధీచౌక్
ఖమ్మం నగరంలో ముగ్గురు మంత్రులకు సకల సౌకర్యాలతో హెడ్‌క్వార్టర్స్ ఉన్నప్పటికీ దేశ భవిష్యత్తును నిర్ణయించే విద్యార్థులు చదువుకునేందుకు సరైన పాఠశాల భవనాలు లేకపోవడం దురదృష్టకరమని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు పోతినేని సుదర్శన్ రావు అన్నారు. సీపీఐ(ఎం) ఖమ్మం డివిజన్ కమిటీ ఆధ్వర్యంలో బుధవారం నగరంలోని పలు ప్రభుత్వ పాఠశాలల్లో పేరుకుపోయిన సమస్యలను ఆ పార్టీ బృందం పరిశీలించింది. మొదట వికలాంగుల కాలనీ రజకవీధిలోని శిథిలావస్థకు చేరిన ప్రభుత్వ పాఠశాలను పరిశీలించిన అనంతరం రమణగుట్టలోని ప్రభుత్వ పాఠశాలను సందర్శించారు. ఈ సందర్భంగా పోతినేని మాట్లాడుతూ.. రజకవీధిలోని పాఠశాల పూర్తిగా శిథిలావస్థకు చేరడంతో అక్కడ చదువుతున్న 60 మంది విద్యార్థులను రెండు కిలోమీటర్ల దూరంలోని రమణగుట్టలోని నాలుగు గదుల పాఠశాలకు తరలించారని తెలిపారు. రజకవీధి పాఠశాలకు నిధులు కేటాయించి తిరిగి ప్రారంభించాలని స్థానికులు పలుమార్లు మంత్రులు, కలెక్టర్, డీఈఓకు విన్నవించినా ఫలితం లేకుండా పోయిందని అన్నారు. వెంటనే రజకవీధి పాఠశాల పునరుద్ధరణకు నిధులు కేటాయించకపోతే సీపీఐ(ఎం) ఆధ్వర్యంలో డీఈఓ కార్యాలయాన్ని ముట్టడిస్తామని హెచ్చరించారు. రమణగుట్ట పాఠశాలలో కేవలం నాలుగు గదులు మాత్రమే ఉండగా దాదాపు 160 మంది విద్యార్థులు చదువుతున్నారని, వారికి సరిపడా మౌలిక సదుపాయాలు లేవని తెలిపారు. నాలుగు గదుల్లో రెండు పాఠశాలలను ఎలా నిర్వహిస్తారని ప్రశ్నించారు. శ్రీశ్రీ విగ్రహం నుంచి బైపాస్ రోడ్డు మీదుగా మున్నేరు వరకు కుడివైపు ప్రాంతంలో కేవలం ప్రాథమిక పాఠశాలలు మాత్రమే ఉన్నాయని, హైస్కూల్ లేకపోవడంతో విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. ఈ ప్రాంతంలో వెంటనే హైస్కూల్ ఏర్పాటుకు నిధులు కేటాయించాలని డిమాండ్ చేశారు. విద్య, వైద్యం దేశ భవిష్యత్తును నిర్ణయించే కీలక రంగాలని, అలాంటి విద్యారంగానికి రాష్ట్ర ప్రభుత్వం తగిన నిధులు కేటాయించడం లేదని విమర్శించారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి వద్ద ఉన్న విద్యాశాఖపై ప్రత్యేక దృష్టి సారించి విద్యాభివృద్ధికి అధిక నిధులు కేటాయించాలని కోరారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రయివేటు పాఠశాలల యాజమాన్యాలు ఇష్టారాజ్యంగా అధిక ఫీజులు వసూలు చేస్తున్నాయని, వాటిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఖమ్మం నగరంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు కల్పించాలని కోరారు. ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వరరావు, ఖమ్మం డివిజన్ కార్యదర్శి వై.విక్రమ్, నాయకులు యర్రా శ్రీనివాసరావు, మెరుగు సత్యనారాయణ, ఎం.ఏ. జబ్బార్, నందిపాటి మనోహర్, దొంగల తిరుపతిరావు, పి.రమ్య, బోడపట్ల సుదర్శన్, ఎస్‌కే నాగులు మీరా, ఉపేంద్ర, వజినేపల్లి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.
స్కూల్ బిల్డింగ్స్ బాలేవ్
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES


