– తొగుట సిఐ షేక్ లతీఫ్
నవతెలంగాణ – రాయపోల్ : రాయపోల్ మండలం ముంగిస్ పల్లి గ్రామంలో గత 25 యేండ్లుగా కొనసాగుతున్న భూ వివాదానికి పోలీసుల చొరవతో తెరపడింది. ఎన్నో సంవత్సరాలుగా పరిష్కారం కాని ఈ సమస్యను తోగుట సీఐ లతీఫ్, రాయపోల్ ఎస్ఐ మానస, ఇక్బాల్ ప్రత్యేక చొరవ తీసుకుని ఇరుపక్షాల మధ్య రాజీ కుదిర్చి పరిష్కరించారు.బుధవారం గ్రామపంచాయతీ కార్యాలయంలో ఇరుపక్షాలను పిలిపించి గ్రామ సర్పంచ్, గ్రామ పెద్దల సమక్షంలో చర్చలు నిర్వహించారు. ఇరువర్గాల అభిప్రాయాలను ఓపికగా విన్న అనంతరం పరస్పర అంగీకారంతో వివాదానికి ముగింపు పలికారు.ఈ సందర్భంగా తోగుట సీఐ లతీఫ్ మాట్లాడుతూ, గత 25 యేండ్లుగా ఈ భూ సమస్య పరిష్కారం కాకుండా కొనసాగిందన్నారు. ఈ కాలంలో పలువురు ఎస్ఐలు, సీఐలు, రెవెన్యూ అధికారులు మారరు. ఇరువర్గాలపై పలు కేసులు కూడా నమోదయ్యాయి. అయినప్పటికీ భూ సమస్యకు శాశ్వత పరిష్కారం లభించలేదని పేర్కొన్నారు. శాంతిభద్రతలకు భంగం కలగకుండా, భవిష్యత్తులో ఎలాంటి వివాదాలు తలెత్తకుండా ఇరువర్గాల మధ్య సామరస్య వాతావరణంలో రాజీ కుదిర్చడం జరిగిందన్నారు. ప్రజలు చిన్న చిన్న భూ వివాదాలను కోర్టులు, గొడవల వరకు తీసుకెళ్లకుండా పరస్పర అవగాహనతో పరిష్కరించుకోవాలని సూచించారు.
భూ వివాదం పరిష్కారమైన సందర్భంగా పట్టాదారులు కొత్త రాజేశ్వరరావు, కొత్త భాస్కర్, కొత్త సతీష్, కొత్త కిష్టయ్య, కొత్త శ్యామ్రావు పోలీసు అధికారులు, గ్రామ సర్పంచ్, గ్రామ పెద్దలకు కృతజ్ఞతలు తెలిపారు.ఈ కార్యక్రమంలో మాజీ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ శ్రీనివాస్ గుప్త, గ్రామ పెద్దలు, ఇరువర్గాల కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.



