– విద్యార్థులపై లాఠీచార్జ్ ఖండనీయం.
– కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు జాల దుర్గాప్రసాద్.
నవతెలంగాణ – రాయపోల్ : దేశ రాజధాని ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద విద్యార్థుల నిరసనలకు మద్దతుగా శాంతియుతంగా ఆందోళన చేపట్టిన లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, ఏఐసీసీ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే, ఎంపీ ప్రియాంక గాంధీతో పాటు పలువురు కాంగ్రెస్ ఎంపీలను అరెస్టు చేయడాన్ని కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తుందని రాయపోల్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు జాల దుర్గాప్రసాద్, ఏఎంసీ చైర్మన్ గొల్లపల్లి కనకయ్య అన్నారు. బుధవారం రాయపోల్ మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ నాయకుల అక్రమ అరెస్టులను నిరసన వ్యక్తం చేస్తూ ప్రధాని మోడీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ధర్నా నిర్వహించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దేశవ్యాప్తంగా నీట్ పేపర్ లీకేజీ పై కేంద్ర ప్రభుత్వం పై వ్యతిరేకంగా ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద నిరుద్యోగ విద్యార్థులు పెద్ద ఎత్తున శాంతియుతంగా నిరసన కార్యక్రమం చేపట్టారు. నిరసన వ్యక్తం చేస్తున్న విద్యార్థులపై మోడీ ప్రభుత్వం కర్కషంగా లాఠీచార్జి, టీయర్ గ్యాస్, రబ్బర్ బుల్లెట్లతో కాల్పులు జరిపి విద్యార్థులను చిత్రహింసలకు గురి చేశారు. పోలీసుల లాఠీచార్జ్‌లో గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించి, బాధ్యులైన అధికారులను సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. నీట్ పేపర్ లీకేజీ వ్యవహారంపై పార్లమెంట్‌లో చర్చ జరిపి, కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ నైతిక బాధ్యత వహిస్తూ వెంటనే రాజీనామా చేయాలని కోరారు.
ప్రజాస్వామ్య హక్కులను కాలరాస్తూ శాంతియుత నిరసనలకు అడ్డంకులు సృష్టించడం తగదని, ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం కాంగ్రెస్ పార్టీ నిరంతరం పోరాడుతుందని వారు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచులు అశోక్ రెడ్డి, స్వామి, ఏఎంసీ డైరెక్టర్ ఆదిరెడ్డి, బాకీ మల్లేశం, యాదగిరి, మాజీ మండల అధ్యక్షులు తప్పటి సుధాకర్, మాజీ ఎంపీటీసీ స్వామి, నాయకులు కిష్టారెడ్డి, పుర్ర నర్సింలు, రామకృష్ణ, చందు, గోపాల్, ప్రభాకర్, శ్రీనివాస్, ఇంద్రకరణ్, దుర్గాప్రసాద్, నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.



