– రైతుల్లో ఆందోళన
నవతెలంగాణ – అశ్వారావుపేట
వానాకాలంలో ఆశించిన స్థాయిలో వర్షాలు కురవకపోవడంతో రైతుల్లో ఆందోళన నెలకొంది.ఎల్‌నినో ప్రభావంపై ముందస్తు హెచ్చరికలు,భారత వాతావరణ శాఖ సూచనలు నిజమయ్యేలా ఈ సీజన్‌లో వర్షపాతం లోటు నమోదైంది. జూన్ నుంచి ఆగస్టు వరకు జిల్లాలో సాధారణ వర్షపాతంతో పోలిస్తే 31.8 శాతం లోటు నమోదైంది. సెప్టెంబర్ 1 నాటికి జిల్లా సాధారణ వర్షపాతం 786.5 మి.మీ. కాగా, 536.3 మి.మీ. మాత్రమే నమోదైంది.
మండలాల వారీగా చూస్తే దమ్మపేటలో అత్యధికంగా 62.4 శాతం లోటు నమోదైంది. ఆ తర్వాత అశ్వారావుపేటలో 53.1, ములకలపల్లిలో 42.5, అన్నపురెడ్డిపల్లిలో 34.1, బూర్గంపాడులో 48.4, భద్రాచలంలో 53.2 శాతం లోటు నమోదైంది. జిల్లాలో మొత్తం 23 మండలాలకు గాను ఆరు మండలాల్లో సాధారణ వర్షపాతం నమోదుకాగా,16 మండలాల్లో లోటు వర్షపాతం, ఒక మండలంలో అత్యల్ప వర్షపాతం నమోదైంది.
చండ్రుగొండలో రైతులకు ఊరట:
చండ్రుగొండ మండలంలో మాత్రం సాధారణం కంటే 6.9 శాతం అధికంగా వర్షపాతం నమోదైంది. మండల సాధారణ వర్షపాతం 700 మి.మీ. కాగా 748.6 మి.మీ. వర్షం కురిసింది. దీంతో ఈ మండల రైతులకు కొంత ఊరట లభించింది. జూలై, ఆగస్టు నెలల్లో వర్షపాతం లోటు తీవ్రంగా కనిపించింది. జూలైలో సాధారణంతో పోలిస్తే 31.8 శాతం, ఆగస్టులో 45.5 శాతం లోటు నమోదైంది.
వరి సాగుకు బ్రేక్.. ప్రత్యామ్నాయ పంటల వైపు
డివిజన్‌లో వర్షాధార వ్యవసాయం 50 శాతానికి పైగా ఉండటంతో వర్షపాతం లోటు పంటల సాగు విస్తీర్ణంపై ప్రభావం చూపింది. ముఖ్యంగా అశ్వారావుపేట, చండ్రుగొండ మండలాల్లో వరి సాధారణ సాగు విస్తీర్ణం కంటే తక్కువగా సాగైంది. ప్రభుత్వం కూడా వరి సాగును నిరుత్సాహపరుస్తూ తక్కువ నీటి అవసరం ఉన్న ప్రత్యామ్నాయ పంటలను సాగు చేయాలని సూచించడంతో రైతులు వరి సాగును తగ్గించారు. మినుము, మొక్కజొన్న, వేరుశనగ వంటి పంటల వైపు మళ్లారు.
అపరాల సాగును ప్రోత్సహించేందుకు ఆత్మనిర్భర్ పథకం ద్వారా రాయితీపై విత్తనాలు అందించడం రైతులకు కొంత ఊరటనిచ్చింది. సాగునీటి వసతి ఉన్న రైతులు ఆయిల్‌పామ్ సాగు కోసం పేర్లు నమోదు చేసుకోవడంతోపాటు మొక్కలు నాటుకుని డ్రిప్ సౌకర్యాన్ని ఏర్పాటు చేసుకున్నారు. ప్రస్తుతం వేరుశనగ, మొక్కజొన్న పంటల సాగు ప్రారంభమైంది.
అడపాదడపా వర్షాలు పంటలకు మేలు:
అడపాదడపా కురుస్తున్న వర్షాలు పత్తి, వరి పంటలకు అనుకూలంగా ఉన్నాయని ఏడీఏ పెంటేల రవికుమార్ తెలిపారు. గత ఏడాది జూన్‌లో 20.5 శాతం లోటు వర్షపాతం నమోదుకాగా, ప్రస్తుత వానాకాలం జూన్‌లో 4.3 శాతం లోటు మాత్రమే నమోదైందన్నారు. అయితే జూలై, ఆగస్టు నెలల్లో వరుసగా 31.8, 45.5 శాతం లోటు ఏర్పడటంతో మూడు నెలల సగటు లోటు 31.8 శాతానికి చేరిందని వివరించారు.
ఫార్మ్ పాండ్లు అత్యవసరం:
వర్షాభావ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని వీబీజీ రామ్‌జీ పథకం కింద ఫార్మ్ పాండ్ల ఏర్పాటుకు ప్రాధాన్యం ఇవ్వాల్సిన అవసరం ఉందని రవికుమార్ పేర్కొన్నారు. కురిసే ప్రతి చినుకు వృథా కాకుండా వర్షపు నీటిని సంరక్షించుకోవడం అత్యవసరమన్నారు. భవిష్యత్‌లో వర్షాధార వ్యవసాయానికి నీటి భద్రత కల్పించాలంటే పొలాల్లోనే వర్షపు నీటి నిల్వలను పెంచుకోవాలని సూచించారు.



