– మల్లారెడ్డి ది ఉద్యమ జీవితం
– రైతుసంఘం రాష్ట్ర నాయకులు పుల్లయ్య
నవతెలంగాణ – అశ్వారావుపేట
రైతు సమస్యల పరిష్కారానికి అంకిత భావంతో,నమ్మిన సిద్ధాంతాన్ని ఆచరిస్తూ ఆఖరి వరకు సీపీఐ(ఎం) లోనే సాగిన నిబద్ధత గల నాయకుడు మల్లారెడ్డి అని రైతు సంఘం రాష్ట్ర నాయకులు కొక్కెరపాటి పుల్లయ్య ఆయన సేవలను కొనియాడారు. సీపీఐ (ఎం) మండల కమిటీ ఆధ్వర్యంలో,మండల కార్యదర్శి సోడెం ప్రసాద్ అధ్యక్షతన మంగళవారం స్థానిక ప్రజా సంఘాల కార్యాలయం సుందరయ్య భవన్ లో సారంపల్లి మల్లారెడ్డి సంస్మరణ సభ నిర్వహించారు.
ఈ సభకు ముఖ్య అతిథిగా హాజరైన పుల్లయ్య మాట్లాడుతూ..ఆస్పత్రి నుంచి డిశ్చార్జి చేస్తే వెళ్లి నల్లగొండలో జరిగే అఖిలభారత రైతు మహాసభల కోసం పనిచేయాలని ఆరాటపడినట్టు కుటుంబ సభ్యులు చెప్పినప్పుడు, ఆయన జీవితమంతా కళ్లముందు కదిలింది అన్నారు.శరీరం సహకరించని స్థితిలోనూ మనసు మాత్రం ఉద్యమ కార్యాచరణ వైపే పరుగులు తీస్తుండటం ఆయనకు మాత్రమే సాధ్యమేమో అనిపించింది అని, మల్లారెడ్డి మరణానంతరం కూడా ఆయన తనదైన రీతిలోనే మన మధ్య ఉన్నారు అని అన్నారు.
జీవించి ఉన్నంతకాలం ప్రజల కోసం పనిచేసిన ఆయన, మరణించిన తర్వాత కూడా తన శరీరం ఇతరులకు ఉపయోగపడాలని కోరుకోవడం ఆయన జీవన తత్వానికి కొనసాగింపేనని అభిప్రాయ పడ్డారు.ఆయన అంతిమయాత్రకు వచ్చిన జనాన్ని చూస్తుంటే మల్లారెడ్డి ఎన్ని జీవితాలను తాకారో అర్థమైంది అన్నారు. సీపీఐ (ఎం) జిల్లా కమిటీ సభ్యులు బుడితి చిరంజీవి మాట్లాడుతూ వివిధ రాజకీయ పార్టీల నాయకులు, ప్రజా సంఘాల ప్రతినిధులు, మేధావులు, ఉద్యమ సహచరులు.. తమ తమ అనుబంధాలతో ఆయనకు వీడ్కోలు పలికారు అన్నారు.
చివరకు ఉద్యోగాన్నే స్వచ్ఛందంగా వదిలి ప్రజా ఉద్యమాల బాట పట్టి, ప్రజా ఉద్యమాలకు పేరుగాంచిన వరంగల్ గడ్డపై దశాబ్దాలపాటు పనిచేశారు అన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కౌన్సిలర్ తగరం నిర్మల, మండల కార్యదర్శి వర్గ సభ్యులు మడకం గోవిందు, మడిపల్లి వెంకటేశ్వరరావు,మొడియం దుర్గా రావు తదితరులు పాల్గొన్నారు.


