నవతెలంగాణ – అశ్వారావుపేట
దమ్మపేట మండలం నాయుడుపేట లో దొండపాటి వెంకట సుబ్బారావు వర్ధంతి కార్యక్రమాన్ని మంగళవారం ఘనంగా నిర్వహించారు. పార్టీ శాఖ కార్యదర్శి చెనుబోయిన బ్రహ్మయ్య అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో తొలుత దొండపాటి స్మారక స్థూపం వద్ద సీపీఐ(ఎం) మండల కార్యదర్శి మోరంపూడి శ్రీనివాసరావు పార్టీ పార్టీ పతాకాన్ని ఎగురవేసి నివాళులర్పించారు.
అనంతరం నిర్వహించిన సభలో సీపీఐ(ఎం) మాజీ జిల్లా కమిటీ సభ్యులు దొడ్డా లక్ష్మీనారాయణ మాట్లాడుతూ.. మార్క్సిస్టు కమ్యూనిస్టు సిద్ధాంతాన్ని, ఎర్రజెండాను విశ్వసించి, జీవితాంతం ఆ సిద్ధాంతాన్ని ఆచరిస్తూ రైతులు, కార్మికులు, వ్యవసాయ కార్మికులు, పేదల కోసం దొండపాటి వెంకట సుబ్బారావు పనిచేశారని అన్నారు.
భూమిలేని పేదలకు భూస్వాముల ఆధీనంలో ఉన్న అనర్హమైన భూములను సాధించేందుకు పార్టీ తరఫున పోరాడి, అర్హులకు భూములు ఇప్పించారని తెలిపారు. ఇళ్ల స్థలాలు లేని పేదలకు ఇంటి జాగలు సాధించేందుకు కృషి చేశారని చెప్పారు. నాటి భూస్వాములు, ధనవంతులు పేదలపై సాగించిన దాడులు, అరాచకాలకు వ్యతిరేకంగా పేదల పక్షాన నిలబడి పోరాడారని పేర్కొన్నారు.
ఈ ప్రాంతంలో భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు) అభివృద్ధికి దొండపాటి వెంకట సుబ్బారావు ఎనలేని కృషి చేశారని, ఆయన సేవలను స్మరించుకుంటూ ఘనంగా నివాళులర్పిస్తున్నామని తెలిపారు.
కార్యక్రమంలో పార్టీ శాఖ సభ్యులు కూచిపూడి రవి, గుండు రామమూర్తి, ఎస్కే నజీర్‌తో పాటు గ్రామ పెద్దలు మాదల చిన్నచంద్రరావు, నరకుళ్ల వెంకటేశ్వరరావు, మదమంచి శ్రీనివాసరావు, ఓబెళ్లనేని రాజగోపాల్‌రావు, అల్లూరి వీరరాజు తదితరులు పాల్గొన్నారు.



