నవతెలంగాణ-హైదరాబాద్ : దేశంలో పోటీ పరీక్షల నిర్వహణలో అక్రమాలు జరిగాయంటూ విద్యార్థుల ఆందోళనలు, విపక్షాల నిరసనలు ఉద్ధృతమవుతున్న వేళ, కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ కుమార్తె నైమిషా ప్రధాన్ ఆన్‌లైన్ నిరసనలను ఎదుర్కొంటున్నారు. సోషల్ మీడియాలో తనపై జరుగుతున్న నెగెటివ్ ప్రచారం, వ్యక్తిగత విమర్శల నేపథ్యంలో ఆమె తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాను డీయాక్టివేట్ చేసుకున్నారు. తండ్రి దేశ విద్యాశాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వర్తిస్తుండగా, కుమార్తె మాత్రం విదేశాలలో ఉన్నత చదువులు అభ్యసించడంపై పలువురు నెటిజన్లు ప్రశ్నలు గుప్పిస్తూ ఆమె ఖాతాలో కామెంట్ల వర్షం కురిపించారు.
నైమిషా ప్రధాన్ 2023లో అమెరికాలోని మాసాచుసెట్స్‌లో ఉన్న టఫ్ట్స్ యూనివర్సిటీకి చెందిన ఫ్లెచర్ స్కూల్ నుంచి మాస్టర్ ఆఫ్ లాస్ (ఎల్ఎల్ఎం) పూర్తి చేశారు. అనంతరం ఆమె యూఎస్-ఇండియా స్ట్రాటజిక్ పార్టనర్‌షిప్ ఫోరమ్‌లో సీనియర్ అసోసియేట్‌గా చేరారు. అయితే ఇటీవల ఢిల్లీలో విద్యార్థుల పార్లమెంట్ మార్చ్‌పై పోలీసులు విరుచుకుపడటంతో నిరసనలు మరింత వేడెక్కాయి. ఈ క్రమంలో నెటిజన్లు ఆమె ఇన్‌స్టాగ్రా్ ఖాతాను వెతికి పట్టుకుని, భారత్‌లోని విద్యా వ్యవస్థపై నమ్మకం లేకే విదేశాలకు వెళ్లారా? అంటూ తీవ్ర విమర్శలు చేశారు. అంతేకాకుండా ఆమె చదువుకున్న టఫ్ట్స్ విశ్వవిద్యాలయం అధికారిక సామాజిక మాధ్యమ పేజీలలో కూడా ప్రధాన్ రాజీనామా చేయాలంటూ కామెంట్లు పెట్టారు.



