Friday, July 24, 2026
E-PAPER
Homeఎడిట్ పేజివిద్యార్థులకు ‘బొట్టు’-ఆరెస్సెస్‌ మానసిక దాడి!

విద్యార్థులకు ‘బొట్టు’-ఆరెస్సెస్‌ మానసిక దాడి!

- Advertisement -

తెలంగాణలో కేంద్రమంత్రి బండి సంజయ్ ఇటీవల చేసిన వ్యాఖ్య రాజకీయ చర్చకు దారితీసింది. భవిష్యత్తులో తమ ప్రభుత్వం అధికారంలోకి వస్తే పాఠశాలల్లో చదివే అమ్మాయిలకు బొట్టు, గాజులు తప్పనిసరి చేస్తామని వార్తలొచ్చాయి. సహజంగానే దీనిపై అనుకూల, ప్రతికూల స్పందనలు వచ్చాయి. కానీ ఈ చర్చను కేవలం బొట్టు అనుకూలం, వ్యతిరేకం అనే స్థాయిలో అర్థం చేసుకుంటే సరిపోదు. ఎందుకంటే ఇక్కడ అసలు ప్రశ్న బొట్టు గురించి కాదు. విద్యావ్యవస్థ పై దేశవ్యాప్తంగా ఆందోళనలు వ్యక్తమవుతున్న ఈ సమయంలో ఒక రాజకీయ దృక్పథానికి ముందుగా బొట్టు ఎందుకు గుర్తుకొచ్చిందనేది. పదాలు యాదృచ్ఛికంగా బయటపడవచ్చు, కానీ ప్రతీకలు యాదృచ్ఛికంగా పుట్టవు. ఎందుకంటే అవి మాటలకంటే లోతుగా పనిచేసే ఒక భావజాలపు మానసిక వేలిముద్రలు.
ఈ వ్యాఖ్యలను కేవలం బండి సంజయ్ వ్యక్తిగత అభిప్రాయంగా చూడలేం. రాజకీయ నాయకులు చాలాసార్లు తమను కాదు, తమ వెనుక నిలబడి ఉన్న భావజాలాన్ని మాట్లాడుతుంటారు. బీజేపీ-ఆరెస్సెస్‌ ఆలోచనా ప్రపంచంలో విద్య కేవలం జ్ఞానం బదిలీ ప్రక్రియ కాదు. ఒక సనాతన సామాజిక కథనాన్ని, సాంస్కృతిక చిహ్నాన్ని, ఒక గుర్తింపు నిర్మాణాన్ని తర తరాలకు అందించే సాధనం కూడా. అందుకే విద్యా చర్చల్లో సంస్కృతి సంప్రదాయం, మత చిహ్నాలు ప్రవేశిస్తాయి. ఈ కోణంలో చూస్తే బొట్టు అనేది ఒక అలంకార వస్తువు కాదు, ఒక రాజకీయ సాంస్కృతిక ప్రతీక.

తెలంగాణ రాజకీయాల ప్రస్తుత నేపథ్యంలో ఈ వాక్యకు మరో అర్థం కూడా కనిపిస్తున్నది. జిహెచ్ఎంసి ఎన్నికల వాతావరణం, సామాజిక సమీకరణల కోసం జరగబోయే పోటీ, సాంస్కృతిక గుర్తింపుల చుట్టూ రాజకీయ చర్చలను నిర్మించే ప్రయత్నాలు, ఇవన్నీ ఈ వాక్యను ఒక రాజకీయ సంకేతంగా చదవాలని సూచిస్తున్నాయి. ఎందుకంటే రాజకీయాలు కేవలం అధికారాన్నీ గెలుచు కోవడానికి మాత్రమే పోరాడవు. ఒక సామూహిక రాజకీయ ప్రతీకాత్మను నిర్మించడానికి కూడా పోరాడుతాయి. ప్రతి రాజకీయ భావజాలం తన అనుచరులను ఒక నిర్దిష్ట గుర్తింపు చుట్టూ సమీ కరిస్తుంది అందుకే ఆ రాజకీయ సమీకరణకు కొన్ని ప్రతీకలు అవసరం అవుతాయి. రాజకీయాలు చాలాసార్లు వాస్తవాల భాష కంటే ప్రతీకల భాషను ఎక్కువగా ఆశ్రయిస్తాయి. ఎందుకంటే వాస్తవాలు మెదడుతో సంభాషిస్తే ప్రతీకలు అంతర్మ నసుతో సంభాషిస్తాయి. అయితే ప్రతీకల రాజకీయాలను కేవలం ఎన్నికల వ్యూహంగా మాత్రమే అర్థం చేసుకుంటే సరిపోదు. అధికారం ముందుగా భూభాగాలను ఆక్రమించదు, మానసిక భూభాగాలను ఆక్రమిస్తుంది.చట్టాలు,పరిపాలన తర్వాత వస్తాయి. ముందుగా ఒక ఆలోచనా చట్రం ఏర్పడుతుంది. ఆ చట్రంలో కొన్ని ప్రతీకలు సహజమైనవిగా, కొన్ని విలువలు పవిత్రమైనవిగా, కొన్ని గుర్తింపులు సహజ సత్యాలుగా కనిపించడం ప్రారంభమవుతుంది.

ప్రతి అధికారం తనను తాను కేవలం చట్టాల ద్వారా కాకుండా చిహ్నాత్మక అధికారాల ద్వారా కూడా పునరుత్పత్తి చేసుకుంటుంది. అందుకే ప్రతి రాజకీయ భావజాలం పాఠశాలను తన భవిష్యత్తు ప్రయోగశాలగా చూస్తోంది. పాఠశాల అనేది కేవలం విద్యాసంస్థ కాదు. సమాజం తన భవిష్యత్తును నిలువచేసే మానసిక గిడ్డంగి.నేటి పిల్లల మనసుల్లో నాటిన ఊహలే రేపటి రాజకీయ సంస్కృతిగా, సామాజిక విలువలుగా, పౌర చైతన్యంగా రూపాంతరం చెందుతాయి. అందువల్ల విద్య గురించి జరిగే ప్రతి చర్చ వాస్తవానికి భవిష్యత్తు గురించి జరిగే చర్చే. ఇక్కడే విద్యపై రెండు తత్వాలు ఎదురుగా నిలుస్తాయి. విద్య ఒక్క పిల్లవాడిని ప్రపంచానికి మరింత తెరువాలా? లేక ఒక నిర్దిష్ట గుర్తింపులో మరింత బలంగా నిలబెట్టాలా? గొప్ప విద్య సమాధానాలను బోధించదు, ప్రశ్నలను పుట్టిస్తుంది. విధేయతను తయారు చేయదు, స్వతంత్ర ఆలోచనను పెంచుతుంది. ఎందుకంటే విద్య అసలు లక్ష్యం ఒక సిద్ధమైన ప్రపంచాన్ని అంగీకరించడం కాదు, ప్రపంచాన్ని కొత్తగా చూడగలిగే మానసిక స్వేచ్ఛను కల్పించడం.

పిల్లల నుదుటిపై ఏమీ ఉండాలి అనే ప్రశ్న అడిగే ముందు వారి మనసులో ఏమీ ఉండాలనే ప్రశ్న అడగాలి. ఎందుకంటే ఒక సమాజం భవిష్యత్తును నిర్ణయించేది బాహ్య గుర్తింపులు కావు, అంతర్గత చైతన్యం. నుదుటిపై కనిపించేది సంస్కృతి కావచ్చు. కానీ మనసులో పెరిగేది వ్యక్తిత్వం. విద్య అసలు పని ఒక గుర్తింపును కాపాడడం కాదు, ఒక మనిషిని నిర్మించడం. అందుకే ఈ చర్చ చివరికి బొట్టు గాజుల గురించి కాదు. విద్యకు సంబంధించిన అసలు ప్రశ్నల నుంచి ప్రజల దృష్టిని ఏ వైపుకు మళ్లిస్తున్నారు అనేదాని గురించి. ఒక సమాజం తన పిల్లలకు ఏమి ధరించాలో చెప్పడం సులభం. ఏమి ఆలోచిం చాలో చెప్పడం కూడా సులభం. కానీ ఎలా ఆలోచించాలో నేర్పడమే విద్య అసలు బాధ్యత. నుదుటిపై కనిపించే గుర్తులు ఒక కాలానికి చెందినవి. ప్రశ్నించే చైతన్యం కాలాలను దాటుతుంది.అందుకే చరిత్ర చివరికి మనుషులు ఏమి ధరించారు అని కాదు. వారు ఎలా ఆలోచించారన్నదే గుర్తుంచుకుంటుంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -