తొలి టీ20లో భారత్ గెలుపు
18 బంతుల్లోనే సూర్యవంశీ అర్థ సెంచరీ
జింబాబ్వే 125/7, భారత్ 126/3
18 బంతుల్లో అర్థ సెంచరీ సాధించిన సూర్యవంశీ
ఎట్టకేలకు టీమ్ ఇండియా గెలుపు బాట పట్టింది. టీ20 ప్రపంచ చాంపియన్‌గా బ్రిటన్‌లో అడుగుపెట్టి వరుసగా ఏడు మ్యాచ్‌ల్లో గెలుపెరుగని శ్రేయస్ అయ్యర్‌సేన… జింబాబ్వే పర్యటనలో బోణీ కొట్టింది. యువ పేసర్లు మయాంక్ యాదవ్ (2/18), ప్రిన్స్ యాదవ్ (2/19), యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ (50) చెలరేగటంతో తొలి టీ20లో భారత్ 7 వికెట్ల తేడాతో గెలుపొందింది. మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో 1-0తో ఆధిక్యంలో నిలిచింది.
నవతెలంగాణ-హరారే
చిచ్చరపిడుగు వైభవ్ సూర్యవంశీ (50, 19 బంతుల్లో 4 ఫోర్లు, 4 సిక్స్‌లు) చెలరేగాడు. 18 బంతుల్లోనే అర్థ సెంచరీ సాధించి జింబాబ్వే బౌలర్లపై విరుచుకుపడ్డాడు. టీ20ల్లో అర్థ సెంచరీ సాధించిన అతి పిన్న వయస్కుడిగా నిలిచిన వైభవ్ సూర్యవంశీ.. తనదైన ధనాధన్‌తో 126 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని భారత్ 13.2 ఓవర్లలోనే ఊదేసేలా చేశాడు. ఇషాన్ కిషన్ (35, 24 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్స్‌లు), శ్రేయస్ అయ్యర్ (28 నాటౌట్, 24 బంతుల్లో 3 ఫోర్లు) రాణించారు. తొలుత బ్యాటింగ్ చేసిన జింబాబ్వే 20 ఓవర్లలో 7 వికెట్లకు 125 పరుగులే చేసింది. యువ పేసర్లు మయాంక్ యాదవ్ (2/18), ప్రిన్స్ యాదవ్ (2/19) నిప్పులు చెరగటంతో ఆతిథ్య జింబాబ్వే స్వల్ప స్కోరుకే పరిమితమైంది. వెస్లీ మాదవెరె (39, 34 బంతుల్లో 3 ఫోర్లు, 1 సిక్స్), ర్యాన్ బర్ల్ (26, 35 బంతుల్లో 1 ఫోర్, 1 సిక్స్), మారుమణి (27 నాటౌట్, 20 బంతుల్లో 2 ఫోర్లు, 1 సిక్స్) రాణించారు. మయాంక్ యాదవ్ ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’గా నిలిచాడు. భారత్, జింబాబ్వే రెండో టీ20 శనివారం హరారే స్పోర్ట్స్ క్లబ్‌లోనే జరుగుతుంది. వైభవ్ అదరహో 126 పరుగుల ఛేదనలో యువ ఓపెనర్ వైభవ్ సూర్యవంశీ (50) చిచ్చరపిడుగులా చెలరేగాడు. అభిషేక్ శర్మ (1) నిరాశపరిచినా.. మరో ఎండ్‌లో వైభవ్ ఇరగదీశాడు. సూర్యవంశీ మెరుపులతో పవర్‌ప్లేలో భారత్ 66 పరుగులు పిండుకుని మ్యాచ్‌ను ఏకపక్షం చేసింది. 4 ఫోర్లు, 4 సిక్స్‌లతో దంచికొట్టిన వైభవ్ సూర్యవంశీ 18 బంతుల్లోనే అర్థ సెంచరీ బాదాడు.
ఫిఫ్టీ బాదిన సూర్యవంశీ.. ఈ ఫార్మాట్‌లో అర్థ సెంచరీ సాధించిన పిన్న వయస్కుడిగా నిలిచాడు. రికార్డు అర్థ సెంచరీ తర్వాత వైభవ్ అవుటైనా.. ఇషాన్ కిషన్ (35), శ్రేయస్ అయ్యర్ (28 నాటౌట్) ఇన్నింగ్స్‌ను ముందుకు నడిపించారు. అయ్యర్ ఎదురుదాడి చేసేందుకు ఇబ్బంది పడగా.. ఇషాన్ కిషన్ రెండు సిక్స్‌లు, మూడు ఫోర్లతో మెరిశాడు. ఆఖర్లో తిలక్ వర్మ (6 నాటౌట్) తోడుగా శ్రేయస్ అయ్యర్ లాంఛనం ముగించాడు. 13.2 ఓవర్లలో 3 వికెట్లకు 126 పరుగులు చేసిన భారత్.. మరో 40 బంతులు ఉండగానే 7 వికెట్ల తేడాతో గెలుపొందింది. జింబాబ్వే బౌలర్లలో బ్లెస్సింగ్ ముజరబాణి (2/26), రిచర్డ్ (1/30) వికెట్లు పడగొట్టారు. యువ పేసర్ల పంజా టాస్ నెగ్గిన భారత్ తొలుత బౌలింగ్ ఎంచుకోగా.. యువ పేసర్లు అందుకు తగిన ప్రదర్శన కనబరిచారు. ఇన్నింగ్స్ తొలి బంతికే బ్రియాన్ బెనెట్ (0)ను అవుట్ చేసిన మయాంక్ యాదవ్ భారత్‌కు తిరుగులేని ఆరంభం అందించాడు. మరో ఓపెనర్ బెన్ కరణ్ (10)ను ప్రిన్స్ యాదవ్ సాగనంపాడు. డియాన్ మేయర్స్ (6), సికిందర్ రజా (4) నిష్క్రమణతో 32/4తో జింబాబ్వే కష్టాల్లో కూరుకుంది. ఈ సమయంలో ర్యాన్ బర్ల్ (26), వెస్లీ (39), మారుమణి (27 నాటౌట్) విలువైన భాగస్వామ్యాలు నెలకొల్పారు. జింబాబ్వేకు గౌరవప్రద స్కోరు అందించారు. శివమ్ దూబె, రవి బిష్ణోయ్ చెరో వికెట్ ఖాతాలో వేసుకున్నారు. టాప్ ఆర్డర్ చతికిల పడినా జింబాబ్వే 20 ఓవర్లలో 7 వికెట్లకు 125 పరుగులు చేసింది. సంక్షిప్త స్కోరు వివరాలు జింబాబ్వే ఇన్నింగ్స్ : 125/7 (వెస్లీ మాదవెరె 39, మారుమణి 27, ర్యాన్ బర్ల్ 26, మయాంక్ యాదవ్ 2/18, ప్రిన్స్ యాదవ్ 2/19)భారత్ ఇన్నింగ్స్ : 126/3 (వైభవ్ సూర్యవంశీ 50, ఇషాన్ కిషన్ 35, శ్రేయస్ అయ్యర్ 28, బ్లెస్సింగ్ ముజరబాణి 2/26, రిచర్డ్ 1/30)



