సిరీస్ విజయంపై శ్రేయస్సేన గురి
భారత్, జింబాబ్వే రెండో టీ20 నేడు
సాయంత్రం 4.30 గంటల నుంచి..
జింబాబ్వేపై విజయం భారత శిబిరంలో ఇంత ఆనందం కలిగించటం ఇటీవల కాలంలో బహుశా ఇదే తొలిసారి కావచ్చు!. వరుస ఓటములకు బ్రేక్ వేస్తూ.. తొలి టీ20లో గెలుపొందిన భారత్ నేడు సిరీస్‌పై కన్నేసి బరిలోకి దిగుతోంది. హరారే స్పోర్ట్స్ క్లబ్లో భారత్, జింబాబ్వే రెండో టీ20 నేడు.
నవతెలంగాణ-హరారే
బ్రిటన్ పర్యటనలో వరుస సిరీస్ పరాజయాల భారంతో జింబాబ్వేలో అడుగుపెట్టిన టీమ్ ఇండియా.. ఇక్కడ తొలి మ్యాచ్‌లోనే గొప్ప ఊరట అందుకుంది. పేస్‌కు అనుకూలించిన పిచ్‌పై 126 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని 13.2 ఓవర్లలోనే ఛేదించి వరుస ఓటములకు చెక్ పెట్టింది. శ్రేయస్ అయ్యర్ కెప్టెన్‌గా తొలి విజయం ఖాతాలో వేసుకున్నాడు. ఎట్టకేలకు గెలుపు బాట పట్టిన టీమ్ ఇండియా.. ఇప్పుడు సిరీస్ విజయంపై కన్నేసింది. 3 మ్యాచ్‌ల సిరీస్‌ను 2-0తో ముగించేందుకు ఎదురుచూస్తోంది. మరోవైపు ఆతిథ్య జింబాబ్వే సైతం సిరీస్‌లో ఆశలు నిలుపుకునేందుకు నేడు అన్ని అస్ర్తాలు ప్రయోగించేందుకు సిద్ధమవుతోంది. మరోసారి పిచ్ పేస్ బౌలింగ్‌కు అనుకూలించనుండగా.. టాస్ నెగ్గిన జట్టు తొలుత బౌలింగ్ ఎంచుకోనుంది. భారత కాలమానం ప్రకారం సాయంత్రం 4.30 గంటలకు మ్యాచ్ ఆరంభం కానుంది.
అయ్యర్‌పైనే ఫోకస్
126 పరుగుల ఛేదనలో యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ 18 బంతుల్లో అర్థ సెంచరీ హైలైట్‌గా నిలిచింది. అంతర్జాతీయ క్రికెట్లో అర్థ సెంచరీ సాధించిన అతి పిన్న వయస్కుడిగా రికార్డు నెలకొల్పిన సూర్యవంశీ నేడూ మరో భారీ ఇన్నింగ్స్‌పై గురి పెట్టాడు. తొలి మ్యాచ్‌లో నిరాశపరిచిన అభిషేక్ శర్మ పరుగుల దాహంతో కనిపిస్తున్నాడు. గతంలో ఇక్కడ సెంచరీ బాదిన అభిషేక్ శర్మను నిలువరించటం జింబాబ్వే బౌలర్లకు కఠిన సవాల్‌గా మారనుంది. ఇషాన్ కిషన్ మరోసారి మంచి ఆరంభాన్ని సద్వినియోగం చేసుకోలేదు. దూకుడుగా ఆడుతున్నా.. భారీ స్కోర్లు సాధించటం లేదు. ఇక స్వల్ప లక్ష్య ఛేదనలో శ్రేయస్ అయ్యర్ ఇన్నింగ్స్ విమర్శలకు దారితీసింది. 24 బంతుల్లో 28 పరుగులే చేసిన అయ్యర్ ఎదురుదాడి చేసేందుకు ఇబ్బంది పడ్డాడు. భారత్ తొలుత బ్యాటింగ్ చేయాల్సి వస్తే.. ఇటువంటి ఇన్నింగ్స్‌లు మ్యాచ్‌ను దూరం చేయగలవు. వైస్ కెప్టెన్ తిలక్ వర్మ ఫామ్‌లో ఉన్నప్పటికీ.. స్పిన్ బౌలింగ్‌పై అతడి స్ర్టయిక్‌రేట్ చర్చనీయాంశంగా మారింది. స్పిన్నర్లను సమర్థవంతంగా ఎదుర్కొని వేగంగా పరుగులు చేయటం తిలక్‌కు తలనొప్పిగా మారకముందే, ఈ బలహీనత నుంచి గట్టెక్కటం అవసరం. శివమ్ దూబె, రింకు సింగ్‌లు లోయర్ ఆర్డర్‌ను పటిష్టం చేస్తున్నారు. అవకాశం చిక్కితే ఆఖర్లో దంచికొట్టేందుకు ఈ ఇద్దరు సిద్ధంగానే ఉన్నారు. యువ బౌలింగ్ బృందం తొలి మ్యాచ్‌లో ఆకట్టుకుంది. మయాంక్ యాదవ్, ప్రిన్స్ యాదవ్‌లు రెండేసి వికెట్లతో మెప్పించారు. అశోక్ శర్మ రాణించినా.. వికెట్ పడగొట్టలేదు. యువ పేస్ త్రయానికి రవి బిష్ణోయ్ మ్యాజిక్ తోడైతే జింబాబ్వే బ్యాటర్లకు మరోసారి తిప్పలు తప్పవు. భారత బ్యాటింగ్ లైనప్ టాప్-7లో శ్రేయస్ అయ్యర్ ఒక్కడే కుడి చేతి బ్యాటర్ కాగా.. మిగతా ఆరుగురు ఎడమ చేతి బ్యాటర్లు. కుడి-ఎడమ కాంబినేషన్ లేకపోయినా.. అయ్యర్‌సేన ప్రత్యర్థిపై పైచేయి సాధించేందుకు సిద్ధమవుతోంది.
రేసులో నిలవాలని..
తొలి మ్యాచ్‌లో ఓడినా.. జింబాబ్వే ఆత్మవిశ్వాసంతోనే కనిపిస్తోంది. పేస్‌కు అనుకూలించిన పిచ్‌పై రెండో ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్ చేస్తే ఫలితంలో మార్పు ఉంటుందని ఆతిథ్య జట్టు బలంగా నమ్ముతోంది. దీంతో ఆతిథ్య జట్టుకు తొలుత టాస్ అత్యంత కీలకం కానుంది. టాప్ ఆర్డర్లో బ్రియాన్ బెనెట్, బెన్ కరణ్, డియాన్ మేయర్స్, సికిందర్ రజాలు తొలి మ్యాచ్‌లో నిరాశపరిచారు. బలమైన భారత్‌ను ఢీకొట్టేందుకు టాప్ ఆర్డర్ మెరుపులు జింబాబ్వేకు అవసరం. ర్యాన్ బర్ల్, వెస్లీ మాదెవెరె, వికెట్ కీపర్ మారుమణి తొలి మ్యాచ్‌లో ఆకట్టుకున్నారు. లోయర్ ఆర్డర్‌కు తోడు టాప్ ఆర్డర్ అంచనాలను అందుకుంటే జింబాబ్వే భారీ స్కోరు చేయగలదు. బంతితోనూ జింబాబ్వే మెరుగవ్వాల్సి ఉంది. బ్లెస్సింగ్ ముజరబాణి, వెల్లింగ్టన్ మసకద్జ, రిచర్డ్‌ల నుంచి ఆతిథ్య జట్టు ఆరంభంలో వికెట్లను ఆశిస్తోంది. తొలి ఇన్నింగ్స్‌లో బంతి అందితే.. సత్తా చాటేందుకు బౌలింగ్ బృందం ఎదురుచూస్తుంది.
పిచ్ రిపోర్టు
హరారే స్పోర్ట్స్ క్లబ్ పిచ్ పేస్ బౌలింగ్‌కు అనుకూలం. ఇక్కడ ప్రస్తుతం శీతల వాతావరణ పరిస్థితులు నెలకొన్నాయి. తొలి ఇన్నింగ్స్‌లో బౌలింగ్ చేసే జట్టుకు పిచ్ నుంచి తేమ లభించనుంది. అదనపు బౌన్స్, పేస్‌తో బ్యాటర్లు పరుగులు చేసేందుకు చెమటోడ్చాల్సి ఉంటుంది. టాస్ నెగ్గిన జట్టు ఛేదనకే మొగ్గుచూపనుంది. రెండో టీ20 మ్యాచ్‌కు ఎటువంటి వర్షం సూచనలు లేవు.
జోరు కొనసాగేనా?
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



