నిలదీసిన విద్యార్థి నేతలు
ఢిల్లీ ఘటనలు అమానుషమంటూ ఆగ్రహం
కేంద్ర విద్యాశాఖామంత్రి తక్షణమే
రాజీనామా చేయాలని డిమాండ్
లేదంటే మోడీయే ఆయన్ను బర్తరఫ్ చేయాలి
ఎన్టీఏ రద్దు చేయాలి :
విద్యార్థి, యువజన సంఘాల ర్యాలీ, మానవ హారంలో నేతలు
రాష్ట్రవ్యాప్తంగా విద్యాసంస్థల బంద్ విజయవంతం
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
నీట్ ప్రశ్నాపత్రం లీకేజీతో విద్యార్థుల ఆత్మహత్యలకు కారణమైన కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ పై ప్రధానమంత్రి నరేంద్రమోడీకి ఎందుకంత ప్రేమ? అంటూ విద్యార్థి నేతలు ప్రశ్నించారు. ఆయనను మోడీయే రక్షిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. నీట్ పేపర్ లీకేజీ, ఢిల్లీలో విద్యార్థులపై పోలీసుల దాష్టీకాన్ని నిరసిస్తూ రాష్ట్రవ్యాప్తంగా విద్యార్థి, యువజన సంఘాలు శుక్రవారం చేపట్టిన విద్యాసంస్థల బంద్ సందర్భంగా వారు కేంద్ర ప్రభుత్వ వైఖరిని దుయ్యబట్టారు. బంద్ లో భాగంగా హైదరాబాద్ లోని నారాయణగూడ చౌరస్తా నుంచి హిమాయత్ నగర్ వై జంక్షన్ వరకు వామపక్ష విద్యార్థి, యువజన సంఘాలు భారీ ర్యాలీ నిర్వహించాయి. ఎస్ఎఫ్ఐ, ఏఐఎస్ఎఫ్, పీడీఎస్ యూ, ఏఐఎఫ్ డీఎస్, డీవైఎఫ్ఐ, ఏఐవైఎఫ్, పీవైఎల్, ఏఐఎఫ్ డీవై ల ఆధ్వర్యంలో విద్యార్థులు ఫ్లకార్డులను ప్రదర్శిస్తూ, నినాదాలు చేశారు. ఆయా సంఘాల నేతలు ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద విద్యార్థులపై పోలీసు దాడులను ఖండించారు. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ వెంటనే రద్దు చేయాలని కోరారు. ఈ క్రమంలో నారాయణగూడ నుంచి హిమాయత్ నగర్ వైపు వెళ్లే దారి పొడవునా ట్రాఫిక్ నిలిచిపోయింది. మరోవైపు నారాయణగూడ నుంచి హిమాయత్ నగర్ మధ్యలో కేశవ మెమోరియల్ విద్యాలయంలోకి ప్రవేశించిన ఆయా సంఘాల నాయకులు, కార్యకర్తలు అక్కడ బాధ్యులతో మాట్లాడారు. బంద్‌లో పాల్గొనేందుకు విద్యార్థులకు అనుమతినివ్వాలని కోరారు. పర్మిషన్ ఇవ్వటంతో అక్కడి విద్యార్థులు కూడా ర్యాలీలో పాల్గొన్నారు. వారితో కలిసి ర్యాలీ హిమాయత్ నగర్ వరకు నినాదాలతో మారుమోగుతూ ముందుకు సాగింది.
అనంతరం హిమాయత్ నగర్ వై జంక్షన్ వద్ద విద్యార్థులు, యువజనులు పెద్ద సంఖ్యలో మానవ హారం నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ విద్యా వ్యవస్థను సంక్షోభంలోకి నెట్టిన కేంద్ర ప్రభుత్వం విద్యార్థుల ఆందోళనను అత్యంత క్రూరంగా అణచివేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది అత్యంత అమానుషమని దుయ్యబట్టారు. నీట్ పరీక్షల నిర్వహణలో వరుస వైఫల్యాలు, ప్రశ్నాపత్రాల లీకేజీలు, అవకతవకలు, విద్యార్థుల ప్రాణాలు బలిగొన్న ఘటనలకు కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజకీయ, నైతిక బాధ్యత వహించాలని హెచ్చరించారు. ఆయన్ను మోడీ ఎందుకు రక్షిస్తున్నారు? అని ప్రశ్నించారు. విద్యార్థులు, యువతతో ఘర్షణ పడిన ఏ ప్రభుత్వమూ చరిత్రలో మిగల్లేదని హెచ్చరించారు.
ఢిల్లీలో శాంతియుతంగా నిరసన తెలుపుతున్న విద్యార్థులపై పోలీసులు దాడులు చేయడం ప్రజాస్వామ్యానికే మాయని మచ్చ అని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఘటనపై నిష్పక్షపాత విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. లేదంటే తమ పోరాటాన్ని మరింత తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ రాష్ట్ర కార్యదర్శి టి. నాగరాజు, ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు కె. మణికంఠ రెడ్డి, పుట్టా లక్ష్మణ్, పీడీఎస్ యూ రాష్ట్ర కార్యదర్శి ఎస్. అనిల్, పీడీఎస్ యూ రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు పి. మహేష్, పొడపంగి నాగరాజు, ఏఐఎఫ్ డీఎస్ రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు పల్లె మురళీ, గడ్డం నాగార్జున, డీవైఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు కోట రమేష్, ఆనగంటి వెంకటేష్, ఏఐవైఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు వలి ఉల్లాఖాద్రి, పీవైఎల్ రాష్ట్ర కార్యదర్శి పెద్దింటి రామకృష్ణ, ఏఐఎఫ్‌డీవై రాష్ట్ర కార్యదర్శి వనం సుధాకర్ తదితరులు మాట్లాడారు. బంద్‌ను విజయవంతం చేసిన విద్యార్థులు, యువజనులు, అధ్యాపకులు, ప్రజలకు వారు కృతజ్ఞతలు తెలిపారు. ర్యాలీలో ఎస్ఎఫ్ఐ రాష్ట్ర ఉపాధ్యక్షులు కె.అశోక్ రెడ్డి, రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు రమ్య, రాష్ట్ర కమిటీ సభ్యులు లెనిన్ గువేరా, సహాన, డీవైఎఫ్ఐ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎం.డి.జావేద్, ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర నాయకులు అనిల్, జోసెఫ్, హరీష్, పీడీఎస్ యూ రాష్ట్ర నాయకులు హారిష్, శ్రీను, నవీన్, ఏఐపీఎస్ యూ రాష్ట్ర నాయకులు గోపాల్, కార్తీక్, ఏఐవైఎఫ్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎన్.శ్రీకాంత్, పీవైఎల్ రాష్ట్ర నాయకులు కృష్ణ, ఎస్ఎఫ్ఐ హైదరాబాద్ నాయకులు ప్రవీణ్, అర్జున్, శ్రీకాంత్ ,తదితర నాయకులు పాల్గొన్నారు.
ప్రధాన్‌పై ప్రధానికెందుకంత ప్రేమ?
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



