మాజీ మంత్రి వి. శ్రీనివాస్ గౌడ్,
మాజీ ఎమ్మెల్సీ చెరుపల్లి సీతారాములు
గీతన్నల చైతన్య యాత్ర పోస్టర్ ఆవిష్కరణ
ఆగస్టు 2 నుంచి 18 వరకు బస్సు యాత్ర
నవతెలంగాణ – ముషీరాబాద్
కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రణాళికలో ఇచ్చిన హామీలు అమలు చేయాలని మాజీ మంత్రి వి. శ్రీనివాస్ గౌడ్, మాజీ ఎమ్మెల్సీ చెరుపల్లి సీతారాములు డిమాండ్ చేశారు. కల్లుగీత కార్మిక సంఘం ఆధ్వర్యంలో హైదరాబాద్ బాగ్‌లింగంపల్లిలోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో సంఘం రాష్ట్ర అధ్యక్షులు మేకపోతుల రమణ అధ్యక్షతన శుక్రవారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆగస్టు 2 నుంచి 18 వరకు నిర్వహించే ‘అమరుల యాదిలో గీతన్నలు’ చైతన్య యాత్ర పోస్టర్‌ను వారు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రణాళికలో గీత కార్మికులకు ఇచ్చిన హామీలు అమలు చేయాలని కోరారు. ప్రణాళికలో ప్రకటించిన విధంగానే పెన్షన్ రూ.4000, ఎక్స్‌గ్రేషియా రూ.10 లక్షలకు పెంచాలని డిమాండ్ చేశారు. 50 సంవత్సరాలు దాటిన గీత కార్మికులకు ప్రభుత్వ జీవో ప్రకారం పెన్షన్ ఇవ్వాలని కోరారు. పెండింగ్ ఎక్స్‌గ్రేషియా డబ్బులు రూ.20 కోట్లు వెంటనే చెల్లించాలని, రాష్ట్రంలోని తాటి, ఈత చెట్లకు నెంబర్లు వేసి రక్షించాలని కోరారు. వాటిని ధ్వంసం చేసిన వారిని కఠినంగా శిక్షించాలన్నారు.చెరుపల్లి మాట్లాడుతూ.. రాష్ట్రంలో కల్లుగీత కార్మికులు అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారని తెలిపారు. ఈ వృత్తి అనేక సాహ సాలతో కూడుకున్నదని, అయినా ప్రకృతి అందించిన పానీయాన్ని ప్రజలకు అందించడానికి అహర్నిశలు కృషి చేస్తూ సవాళ్లతో వృత్తిని కొనసాగి స్తున్నారని చెప్పారు. కాంగ్రెస్ అధికారంలోకి రావడానికి కల్లు గీత కార్మికులకు అనేక హామీలు గుప్పించిందని, వాటిని వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. వృత్తి చేసే వారందరికీ కాటమయ్య రక్షణ కవచం ఇవ్వాలని, అందరూ వాడే విధంగా చైతన్యం చేయాలని కోరారు. ప్రతి సొసైటీకీ 5 ఎకరాల భూమి ఇవ్వాలని, కోటి వరాల పథకం కింద గీత సొసైటీలకు కేటాయించిన భూములకు ఫెన్సింగ్, నీటి సౌకర్యం కల్పించి పొట్టి తాటి, ఈత, ఖర్జూరం మొక్కలు నాటాలని సూచించారు. నీరాకు రాష్ట్ర బడ్జెట్‌లో కేటాయించిన రూ.25 కోట్లు, సంక్షేమానికి కేటాయించిన రూ. 67 కోట్లు వెంటనే విడుదల చేయాలని కోరారు. ఆగస్టు 18లోపు ట్యాంక్‌బండ్‌పై సర్దార్ సర్వాయి పాపన్న విగ్రహాన్ని ప్రతిష్టించాలని డిమాండ్ చేశారు. ఆగస్టు 2న మానుకోటలో ప్రారంభమయ్యే గీతన్నల చైతన్య యాత్రను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో కల్లుగీత కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బెల్లంకొండ వెంకటేశ్వర్లు, గౌడ కల్లు గీత సంఘాల సమన్వయ కమిటీ రాష్ట్ర చైర్మెన్ బాలగోని బాలరాజు గౌడ్, గౌడ సంఘం రాష్ట్ర అధ్యక్షులు పల్లె లక్ష్మణరావు గౌడ్, గోపా రాష్ట్ర అధ్యక్షులు బండి సాయన్న గౌడ్, గౌడ ఐక్య సాధన సమితి రాష్ట్ర అధ్యక్షులు అంబాల నారాయణ గౌడ్, సమ్మి ఫౌండేషన్ చైర్మెన్ చిలువేరు సమ్మిగౌడ్ , నాయకులు వంగ సదానందం గౌడ్, ప్రభులింగం గౌడ్, వి.వెంకట నరసయ్య తదితరులు పాల్గొన్నారు.
కాంగ్రెస్ ఇచ్చిన హామీలెక్కడ..?
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



