సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎస్. వీరయ్య
ఆగస్టు 10న క్విట్ ఇండియా స్ఫూర్తితో రాష్ట్రవ్యాప్త ఆందోళన
పెద్దపల్లిలో సీఐటీయూ, రైతు, వ్యవసాయ కార్మిక సంఘాల
ఆధ్వర్యంలో జిల్లా సదస్సు
నవతెలంగాణ – పెద్దపల్లి
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అవలంబిస్తున్న కార్పొరేట్ అనుకూల, కార్మిక,రైతు,ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా క్విట్ ఇండియా ఉద్యమ స్ఫూర్తితో పోరాటం వేగవంతం చేయాలని సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎస్. వీరయ్య పిలుపునిచ్చారు. శుక్రవారం సీఐటీయూ, రైతు సంఘం, వ్యవసాయ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో నిర్వహించిన పెద్దపల్లి జిల్లా సదస్సులో ఆయన ప్రసంగించారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న నాలుగు లేబర్ కోడ్లు, విద్యుత్ సవరణ బిల్లు, విత్తన చట్ట సవరణలు, విదేశీ సంస్థలతో కుదుర్చుకున్న స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలు.. దేశ కార్మిక, రైతాంగ ప్రయోజనాలకు తీవ్ర విఘాతం కలిగిస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. కార్మిక చట్టాలను నిర్వీర్యం చేస్తూ పని గంటలు పెంచడం, ఉద్యోగ భద్రతను దెబ్బతీయడం, సమ్మె హక్కుపై ఆంక్షలు విధించడం వంటి విధానాలను ప్రోత్సహించడం కార్మిక వర్గంపై తీవ్రమైన దాడి అని విమర్శించారు. దిగుమతులను ప్రోత్సహించే విధానాల వల్ల దేశీయ వ్యవసాయ ఉత్పత్తులకు గిట్టుబాటు ధరలు లభించక రైతులు తీవ్రంగా నష్టపోతున్నారన్నారు. స్వామినాథన్ కమిషన్ సిఫార్సుల మేరకు పంటల ఉత్పత్తి వ్యయంపై 50శాతం లాభం కలిపి చట్టబద్ధమైన కనీస మద్దతు ధర అమలు చేయాలని డిమాండ్ చేశారు.
ఆగస్టు 10వ తేదీ ‘జైల్ భరో’ను జయప్రదం చేయండి
రాష్ట్రవ్యాప్తంగా గ్రామాలు, బస్తీలు, పారిశ్రామిక ప్రాంతాలు, పట్టణాల్లో విస్తృత ప్రచారం నిర్వహించి, ఆగస్టు 10న జిల్లా, డివిజన్, మండల కేంద్రాల్లో జరిగే ‘జైల్ భరో’ కార్యక్రమంలో కార్మికులు, రైతులు, వ్యవసాయ కార్మికులు, యువజనులు, మహిళలు పెద్దఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని వీరయ్య పిలుపునిచ్చారు. కేంద్రం తీసుకొచ్చిన నాలుగు లేబర్ కోడ్లను వెంటనే రద్దు చేయాలని, కార్మిక హక్కులు, ప్రాథమిక సమ్మె హక్కును కాపాడాలని నినందించాలన్నారు. కార్మికులను ఎప్పుడు బడితే అప్పుడు తొలగించే ‘హైర్ అండ్ ఫైర్’ విధానాన్ని వీడాలని, స్వామినాథన్ కమిషన్ సిఫార్సుల ప్రకారం రైతులకు పంటలకు చట్టబద్ధమైన కనీస మద్దతు ధర కల్పించాలన్నారు. ప్రభుత్వ రంగ సంస్థల అమ్మకాన్ని, ప్రయివేటీకరణను తక్షణమే నిలిపివేయాలని, కార్పొరేట్ అనుకూల విధానాలకు స్వస్తి పలికి కార్మికులు, రైతులు, వ్యవసాయ కార్మికుల జీవనోపాధిని రక్షించే చట్టాలు తీసుకురావాలని డిమాండ్ చేశారు. ఈ జిల్లా సదస్సులో సీఐటీయూ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు వేల్పుల కుమారస్వామి, ఎర్రవెల్లి ముత్యంరావు; వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు మంద రాజేందర్, బూడిద గణేష్, సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షులు వనజారాణి, జిల్లా సహాయ కార్యదర్శులు జి. జ్యోతి, సీపెల్లి రవీందర్, ఎండీ ఖాజా, తాండ్ర అంజయ్య, జిల్లా కమిటీ సభ్యులు, కార్మిక నాయకులు పాల్గొన్నారు.
కేంద్ర కార్పొరేట్ విధానాలపై ‘జైల్ భరో’ సమరం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



