Saturday, July 25, 2026
E-PAPER
Homeప్రధాన వార్తలుయువతరంతో పెట్టుకోవద్దు

యువతరంతో పెట్టుకోవద్దు

- Advertisement -

ఒక్కో మెట్టెక్కి కేంద్ర ప్రభుత్వాన్ని తొక్కుతారు
మేకిన్‌ ఇండియా అడిగితే లీకిన్‌ ఇండియా ఇచ్చిన బీజేపీ
ధర్మేంద్ర ప్రధాన్‌ రాజీనామా చేయాల్సిందే
అవసరమైతే ఢిల్లీకి వెళ్లి విద్యార్థులకు అండగా ఉంటాం
మోడీని ప్రశ్నిస్తే రేవంత్‌‌రెడ్డికి ఎందుకు కోపం : బీఆర్‌ఎ‌స్వీ నిరసనలో కేటీఆర్‌


నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
‘ప్రధాని మోడీ యువతరంతో పెట్టుకున్నారు. జాగ్రత్త పడాలి. స్వరం మారుతున్నది, నవతరం మారుతున్నది అని కేంద్రం తెలుసుకోవాలి. శ్రీలంకలో ఈ యువతరం ఉరికించి ప్రభుత్వాలను పాతరేసింది. అలాంటి యువతరంతో పెట్టుకోవద్దు. హక్కుల కోసం పోరాడుతున్న యువతరాన్ని తీవ్రవాదులు, దేశద్రోహులు, పాకిస్తానీలు అంటూ అడ్డగోలుగా మాట్లాడుతున్నారు. నిజంగానే కేంద్రానికి బాధ్యత ఉంటే విద్యార్థుల వద్దకు వెళ్లి అనేకసార్లు చర్చలు చేసి సమస్యలు పరిష్కరించాల్సి ఉండే. ఈ యువతరం ఈ జనరేషన్ సీబీఐ, ఈడీ, ఐటీలకు భయపడేది కాదు. కేంద్రంపై పొట్టు పొట్టు కోపంగా ఉన్నారు. కేంద్ర ప్రభుత్వాన్ని మెట్టు మెట్టు ఎక్కి తొక్కుతారు. ఈ విషయాన్ని మోడీ ప్రభుత్వం గుర్తుంచుకోవాలి.’అని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ‌ప్రెసిడెంట్‌ ‌కేటీఆర్‌ హెచ్చరించారు. ఢిల్లీలో విద్యార్థులు, యువతపై కేంద్రం చేసిన దాష్టికానికి నిరసనగా వారికి సంఘీభావంగా బీఆర్‌ఎస్వీ ఆధ్వర్యంలో శుక్రవారం హైదరాబాద్‌‌లోని ఇందిరా పార్కు వద్ద భారీ నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి వేలాదిమంది యువతీ, యువకులు తరలివచ్చారు. ఈ సందర్భంగా కేటీఆర్‌ మాట్లా డుతూ ఆందోళన పేపర్ లీక్‌కి సంబంధించిందే కాదనీ, 12 ఏండ్లుగా కేంద్రం చేస్తున్న మోసాలు, ద్రోహాలపైన యువత ఆగ్రహంగా ఉందన్నారు. అసలు పని చేయకుండా కేవలం మతం పేరుతో తప్పించుకుంటున్నదని విమర్శించారు. ఏడాదికి రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తానన్న మోడీ 24 కోట్ల ఉద్యోగాలు ఇయ్యలేనందుకే యువతరం బయటకొచ్చిందని చెప్పారు. యువతరానికి ఏ రాజకీయ నాయకుడి అండ లేదన్నారు. మేకిన్ ఇండియా అడిగితే లీకిన్ ఇండియాను బీజేపీ ఇచ్చిందని విమర్శించారు. పోరాడుతున్న విద్యార్థులకు అందరం అండగా ఉండాల్సిన అవసరముందని చెప్పారు. ఢిల్లీలో విద్యార్థులపై జరిగిన దాష్టికాన్ని, అణచివేతను చూస్తే ఎవరి మనసైనా కరగాల్సిందేనని అన్నారు. వాళ్ళు అడిగిన దాంట్లో అన్యాయం ఏముందని కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ప్రధాని కుర్చీ అడిగారా?, కేంద్రమంత్రి కుర్చీ అడిగారా?అని అన్నారు. విద్యార్థులు కోరుతున్నట్టుగా ధర్మేంద్ర ప్రధాన్‌ కేంద్ర మంత్రి పదవికి రాజీనామా చేయించాలని డిమాండ్‌ ‌చేశారు. విద్యార్థులపై పెట్టిన పోలీసు కేసులను బేషరతుగా వెనక్కి తీసుకోవాలని కోరారు. అక్రమ కేసుల నమోదుకు క్షమాపణ చెప్పాలన్నారు. దేశంలో కేంద్ర మంత్రుల కొడుకులు లైంగిక దాడులు చేస్తే వెంటనే బెయిల్ వస్తున్నది కానీ పేపర్ లీకులపైన ఎంత అడిగినా సమాధానం మాత్రం ఎందుకు రావడం లేదని ప్రశ్నించారు. ఏ దేశం కోసం? ఏ ధర్మం కోసం? పేపర్ లీకులపైన సమాధానం చెప్పడం లేదో బీజేపీ నాయకులు చెప్పాలన్నారు. విద్యార్థుల ప్రశ్నలకు ప్రధాని సమాధానం చెప్పాలని డిమాండ్‌ ‌చేశారు. పరీక్షా పే చర్చ ఎందుకు చేయట్లేదని అడిగారు. రష్యా ఉక్రెయిన్ యుద్ధమే ఆపిన మోడీ పిల్లల కన్నీళ్లు, వారి మీద జరుగుతున్న దాడిని ఆపలేరా?అని ప్రశ్నించారు.

​కొడంగల్‌‌లో దాక్కున్న రేవంత్‌‌రెడ్డి
ప్రధాని మోడీపైన తాను కొట్లాడితే రేవంత్ రెడ్డికి ఎందుకు కోపం వచ్చిందని కేటీఆర్‌ అడిగారు. మోడీని ప్రశ్నిస్తే యూత్ కాంగ్రెస్‌ని ఎందుకు పంపించి ‌తనను అడ్డుకుంటున్నారో రేవంత్ రెడ్డి సమాధానం చెప్పాలని డిమాండ్‌ ‌చేశారు. రాహుల్ గాంధీ ఢిల్లీలో కొట్లాడితే కొడంగల్‌‌లో రేవంత్ రెడ్డి దాక్కున్నారని విమర్శించారు. దేశమంతా నరేంద్ర మోడీని, ధర్మేంద్ర ప్రధాన్‌ని ప్రశ్నిస్తుంటే రేవంత్ రెడ్డి మాత్రం కేసీఆర్‌‌తోపాటు తనను విమర్శిస్తున్నారని గుర్తు చేశారు. ఢిల్లీని వణికించి తెలంగాణ తెచ్చిన పార్టీ బీఆర్‌ఎస్‌ అని అన్నారు. అవసరమైతే ఢిల్లీకి వెళ్లి విద్యార్థులకు అండగా నిలబడతామని చెప్పారు. యువత స్వతంత్రంగానే పోరాడాలని కోరారు. ఈ కార్యక్రమంలో మాజీమంత్రులు జగదీశ్‌‌రెడ్డి, వేముల ప్రశాంత్‌‌రెడ్డి, వి శ్రీనివాస్‌‌గౌడ్‌, బీఆర్‌ఎస్‌ ‌ప్రధాన కార్యదర్శులు ఆర్‌ఎస్‌ ‌ప్రవీణ్‌‌కుమార్‌, టి జీవన్‌‌రెడ్డి, ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్‌, బీఆర్‌ఎస్వీ అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్‌‌యాదవ్‌, ఉపాధ్యక్షులు తుంగబాలు, మాజీ ఎమ్మెల్యేలు బాల్క సుమన్‌, గ్యాదరి కిషోర్‌, భూపాల్‌‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -