Saturday, July 25, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంకేంద్ర ప్రభుత్వ మతోన్మాద, కార్పొరేట్ విధానాలను తిప్పికొట్టాలి

కేంద్ర ప్రభుత్వ మతోన్మాద, కార్పొరేట్ విధానాలను తిప్పికొట్టాలి

- Advertisement -


రామదాసు స్పూర్తితో
 కార్యకర్తలు ఉద్యమించాలి
సమస్యలపై యువత గళమెత్తడం 
దేశ భవిష్యత్‌కు శుభపరిణామం : సీపీఐ(ఎం) ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు
నవతెలంగాణ-గోవిందరావుపేట

కేంద్ర ప్రభుత్వ మతోన్మాద, కార్పొరేట్ విధానాలను తిప్పికొట్టాలని సీపీఐ(ఎం) ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కార్యదర్శి వి. శ్రీనివాసరావు పిలుపునిచ్చారు. శుక్రవారం ములుగు జిల్లా గోవిందరావుపేట మండల కేంద్రంలో ‘వీపనేని రామదాసు-వెంకట సుబ్బమ్మ’ల 6వ వర్ధంతి సభను తుమ్మల వెంకటరెడ్డి అధ్యక్షతన నిర్వహించారు. ముందుగా సీపీఐ(ఎం) జెండాను పార్టీ సీనియర్ నాయకులు గుండు సత్యనారాయణ ఆవిష్కరించారు. అనంతరం రామదాసు-వెంకటసుబ్బమ్మ దంపతుల విగ్రహాలకు పార్టీ రాష్ట్ర నాయకులు, కుటుంబ సభ్యులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ క్రమంలో గ్రామంలో భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం జరిగిన సభలో శ్రీనివాసరావు మాట్లాడుతూ.. అంతర్జాతీయ యుద్ధ పరిణామాలు ప్రజల జీవితాలపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయన్నారు. ప్రపంచవ్యాప్తంగా యుద్ధాలు, ఆర్థిక సంక్షోభం, ధరల పెరుగుదల, నిరుద్యోగం వంటి సమస్యలు సామాన్య ప్రజలపై భారంగా మారాయని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న మతోన్మాద, కార్పొరేట్ అనుకూల విధానాల వల్ల విద్య, వైద్యం, ఉపాధి రంగాలు తీవ్రంగా దెబ్బతింటున్నాయని విమర్శించారు. నీట్ పరీక్ష పేపర్ లీకేజీకి బాధ్యత వహించి కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని విద్యార్థులు 24 రోజులుగా ఢిల్లీలో చేపడుతున్న ఉద్యమాన్ని మోడీ ప్రభుత్వం అత్యంత పాశవికంగా అణిచివేయాలని ప్రయత్నం చేస్తున్నా యువత బెదిరిపోకుండా ఢిల్లీ వీధులను చుట్టుముట్టి ఉద్యమిస్తున్నారని అన్నారు.

సమస్యలపై యువత గళమెత్తడం దేశ భవిష్యత్‌కు శుభపరిణామం
ప్రస్తుతం దేశంలో ‘జెన్ జెడ్‌’ యువత సామాజిక, ఆర్థిక, రాజకీయ అంశాలపై చైతన్యంతో ముందుకు వస్తోందని శ్రీనివాసరావు అన్నారు. ఉపాధి, నాణ్యమైన విద్య, ప్రజాస్వామ్య హక్కులు, సామాజిక న్యాయం కోసం యువత గళమెత్తడం దేశ భవిష్యత్తుకు శుభపరిణామమని తెలిపారు. యువతను మతం, కులం పేరుతో విభజించే ప్రయత్నాలను తిప్పికొట్టి శాస్త్రీయ ‌దృక్పథంతో, ప్రజాస్వామ్య విలువలతో ముందుకు సాగాలని ఆకాంక్షించారు. ఓటరు జాబితా సమగ్ర సవరణ (సర్) పేరుతో గిరిజనులు, దళితులు, మైనార్టీలు, పేద ప్రజల ఓట్లను తొలగిస్తున్నారన్నారు. జనాభా పెరిగితే ఓట్లు కూడా పెరగాలి కానీ ఈ ప్రక్రియ వల్ల ఓట్ల సంఖ్య గణనీయంగా తగ్గిపోతుందని తెలిపారు. ఓటు నిరూపణకు పెట్టిన ప్రామాణికతలో ఆధార్‌కార్డులు, ఓటరుకార్డులు, పాస్‌పోర్టులు చెల్లడం లేదన్నారు. అన్నింటికి ఆధార్, ఓటర్ కార్డు అడుగుతారు కానీ సర్‌కు మాత్రం కుదరదని చెబుతున్నారంటే పేదలకు ఓట్లు ఉండకూడదనే బీజేపీ ఎజెండాలో భాగమేనని స్పష్టం చేశారు. ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసి ప్రజా ఉద్యమాలను తీవ్రంగా అణిచివేస్తూ ప్రజా సంపదను కార్పొరేట్లకు దోచి పెడుతున్నారని విమర్శించారు. అందుకే కమ్యూనిస్టు పార్టీ కార్యకర్తలు రామదాసు-వెంకటసుబ్బమ్మ స్పూర్తితో ఉద్యమించాలని పిలుపునిచ్చారు. సీపీఐ(ఎం) తెలంగాణ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు బండారు రవికుమార్ మాట్లాడుతూ.. రామదాసు స్ఫూర్తితో ములుగు జిల్లాలో ఆదివాసీ, గిరిజన, బడుగు బలహీన వర్గాల కోసం నిరంతరం ఎర్రజెండా పోరాడుతుందని, భవిష్యత్‌తో కూడా పోరాటం చేస్తుందని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ సభ్యులు సూడి కృష్ణారెడ్డి, జిల్లా కార్యదర్శి బిరెడ్డి సాంబశివ, జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు రత్నం రాజేందర్, పొదిళ్ళ చిట్టిబాబు, రఘుపతి, వాసు, దావూద్, మండల కార్యదర్శి మల్లారెడ్డి, నాయకులు అగిరెడ్డి, రాజేష్, రామస్వామి, నాగరాజు, లెనిన్, కొర్స నరసింహారావు, వంక రాములు, కుమ్మరి శీను, దుగ్గి చిరంజీవి, సమ్మక్క తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -