నవతెలంగాణ – సత్తుపల్లి : ఎలాంటి కఠిన వాతావరణ పరిస్థితులనైనా తట్టుకుని నిలబడగల సామర్థ్యం ఉన్న పంటల్లో ఆయిల్‌పామ్ ఒకటని, తెలంగాణలో దీని సాగు విస్తరణను వేగవంతం చేయాలని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అధికారులను ఆదేశించారు. శుక్రవారం తెలంగాణ స్టేట్ ఆయిల్‌ఫెడ్ కార్యాలయంలో నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడారు. మార్కెట్లో తాజా గెలలకు మంచి ధర లభిస్తుండటంతో రైతులు ఈ సాగు వైపు ఎక్కువగా మొగ్గుచూపుతున్నారని చెప్పారు. రైతులు నర్సరీలకు వచ్చినప్పుడు మొక్కలు లేవనే పరిస్థితి రాకూడదని, ముందస్తు అంచనాతో నాణ్యమైన మొక్కలను సిద్ధంగా ఉంచాలని ఆదేశించారు.
భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా తక్కువ ఎత్తు పెరిగే, అధిక దిగుబడినిచ్చే రకాలను దిగుమతి చేసుకోవాలని సూచించారు. డ్రిప్ పరికరాల పంపిణీలో ఎలాంటి జాప్యం జరగకుండా కంపెనీలతో సమన్వయం చేసుకోవాలని స్పష్టం చేశారు. ఖమ్మం జిల్లా వేంసూరు మండలం కల్లూరుగూడెంలో నిర్మిస్తున్న ఆయిల్‌పామ్ ప్రాసెసింగ్ ప్లాంట్ పనులను నిర్ణీత గడువులోగా పూర్తి చేసి ప్రారంభోత్సవానికి సిద్ధం చేయాలని సంబంధిత అధికారులను మంత్రి ఆదేశించారు. టీజీ ఆయిల్‌ఫెడ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేస్తున్న మెగా ఆయిల్ ప్యాకింగ్ స్టేషన్ పనులను కూడా వేగవంతం చేయాలన్నారు. ‘విజయ హైదరాబాద్’ బ్రాండ్ వంటనూనెల విక్రయాలను పెంచేందుకు సమర్థవంతమైన మార్కెటింగ్ చర్యలు చేపట్టాలని, ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ (ఐఎస్బీ) భాగస్వామ్యంతో మార్కెటింగ్ విభాగాన్ని బలోపేతం చేయాలని తుమ్మల సూచించారు.



