Sunday, July 26, 2026
E-PAPER
Homeట్రెండింగ్ న్యూస్మహిళల స్వేచ్ఛాకాంక్ష పురుషులకంటే భిన్నం

మహిళల స్వేచ్ఛాకాంక్ష పురుషులకంటే భిన్నం

- Advertisement -

శివ్య నాథ్… 2011లో తన 23 ఏండ్ల వయసులో తన కార్పొరేట్ ఉద్యోగాన్ని వదిలిపెట్టారు. ఓ స్వేచ్ఛాజీవిగా ప్రపంచాన్ని పర్యటించడం మొదలుపెట్టారు. పర్యావరణ పరిరక్షణకై తపిస్తూ జనసంచారం లేని గమ్యస్థానాలను అన్వేషించారు. కొంతకాలానికి హిమాచల్ ప్రదేశ్ పర్వతాలలో తన కోసం ఒక జీవితాన్ని నిర్మించుకున్నారు. అప్పటి వరకు అశాంతంగా ఉన్న ఆమె మనసుకు అక్కడే ప్రశాంతత లభించింది. ట్రావలర్‌, రచయిత్రి, బ్లాగర్‌‌గా గుర్తింపు తెచ్చుకున్నారు. ప్రపంచవ్యాప్తంగా తాను చేసిన అనేక సాహసాలను తన మొదటి పుస్తకం ‘ది షూటింగ్ స్టార్’లో నమోదు చేశారు. ఇప్పుడు ‘రూట్‌‌లెస్‌ అండ్‌ ‌రెస్ట్‌‌లెస్‌’ ‌పేరుతో మరో పుస్తకాన్ని ప్రపంచానికి పరిచయం చేసిన ఆమె సాహస యాత్ర గురించి నేటి మానవిలో…

నా సొంత రాష్ట్రం ఉత్తరాఖండ్‌. నా ఉద్దేశంలో ప్రయాణమంటే అర్థాన్ని వెతకడం. మన చుట్టూ ఉన్న ప్రపంచాన్ని, అందులో మన స్థానాన్ని అర్థం చేసుకోవడానికి, మనలోని మానవత్వాన్ని పరిశీలించడానికి, సమాజం మనకు అందించిన మార్గదర్శకాలను ప్రశ్నించడానికి ఇది ఒక మార్గం. నేను మొదట ప్రయాణించడం ప్రారంభించినప్పుడు సాహసం గురించిన నా ఆలోచన చాలా వాస్తవికంగా ఉండేది. సూర్యోదయం వేళ అగ్నిపర్వత సరస్సులోకి దూకడం, అగ్నిపర్వతం పైనుంచి బోర్డింగ్ చేస్తూ కిందకి రావడం, పసిఫిక్‌లో స్టాండ్-అప్ ప్యాడ్లింగ్ చేయడం.. ఇవన్నీ నేను చేశాను. కానీ ఏండ్లు గడిచేకొద్దీ సాహసం అనే భావన సుదూర ప్రాంతాలలో ఉన్న మారుమూల సమాజాలతో కలిసి జీవించడం అనే స్థాయికి పరిణామం చెందింది. దాదాపు రెండేండ్ల పాటు పర్వతాలలో గడిపిన తర్వాత నేను, నా భాగస్వామి ఇతర అవకాశాల కోసం మా మూలాలను వదిలి వెళ్ళాలనుకున్నాం. తూర్పు ఆఫ్రికా, ఇండోనేషియాలో కొంతకాలం గడిపాము. ఇప్పుడు జర్మనీలోని బెర్లిన్‌లో స్థిరపడ్డాం.

​స్వేచ్ఛగా ఉన్నామని అర్థం
నా హృదయాన్ని తాకిన సాహసాలలో ఒకటి రాబిన్సన్ క్రూసో ద్వీపంలో నెల కంటే ఎక్కువ గడపడం. ఇది ప్రపంచంలోని అత్యంత మారుమూల ద్వీపాలలో ఒకటి. ఇది చిలీ తీరానికి 700 కిలోమీటర్ల దూరంలో ఉంది. అక్కడ కేవలం 1,200 మంది మాత్రమే నివసిస్తున్నారు. ఇక్కడి ప్రజలు ఆ ద్వీపానికే ప్రత్యేకమైన జీవజాతులతో ఒక విభిన్నమైన బంధాన్ని పంచుకుంటారు. వారి జీవితాల్లోకి నన్ను ఆహ్వానించడం నిజంగా గొప్ప విషయం. ‘రూట్‌లెస్ అండ్ రెస్ట్‌లెస్’ పుస్తకంలో రాయడానికి నాకు అత్యంత ఇష్టమైన అధ్యాయాలలో ఇది కూడా ఒకటి. అయితే పుస్తకం శీర్షిక గురించి చాలా ప్రశ్నలు వచ్చాయి. మనం చేరుకోవడానికి మూలాలు లేవంటే స్వేచ్ఛగా ఉన్నామని అర్థం. ‘నాకు ఇల్లు ఎక్కడా లేకపోయినా, వెళ్ళడానికి నాకు ప్రతీచోట ఉంది’ అంటారు ఓ పర్షియన్‌ ‌కవి. కనుక నాకంటూ ప్రత్యేకమైన మూలాలు లేకపోయినా నేను వాటిని ప్రతిచోటా పెంచుకోగలను. ప్రపంచంలో అటువంటి స్వేచ్ఛ ఎక్కడున్నా నేను అక్కడిదాన్నే అని భావిస్తాను.

​విరామం కోసం కాదు
ఈ కాలంలో అర్థవంతంగా ప్రయాణించడమంటే, ఇన్‌స్టాగ్రామ్ ప్రేరేపిత FOMO (మిస్ అవుతున్నామనే భయం)ని JOMO (కోల్పోవడంలో ఆనందం)గా మార్చడం. మన హృదయాన్ని కదిలించేది, లోతైన బంధాలను ఏర్పరిచేవిగా మన ప్రయాణాలు ఉండాలి. సోషల్ మీడియా, ప్రయాణాన్ని మునుపెన్నడూ లేనంత ఆకాంక్షనీయంగా మార్చింది. ప్రయాణం అనేది కేవలం విరామం కోసమో, పదవీ విరమణ తర్వాత మాత్రమే చేయాల్సిన పని అనే భావనను మనలో చాలామందికి ఉంది. అయితే అవసరం లేని వస్తువులపై డబ్బు ఖర్చు పెట్టే బదులు ఈ ప్రపంచం గురించి తెలుసుకోవడానికి ఖర్చు పెట్టడం మంచిదని నా భావన. అలాగే నేను సమయం గడిపే ప్రదేశాలే నన్ను ఎంచుకుంటాయని నాకు ఎప్పుడూ అనిపిస్తుంటుంది. ఎక్కువ మంది వెళ్లని ప్రాంతాలకు ప్రయాణించడానికి నేను ఇష్టపడతాను. ఒక యాత్రా రచయితగా, పెద్దగా తెలియని ప్రదేశాల గురించిన తొలి కథనాలలో కొన్నింటికి రూపం ఇవ్వడం నాకు గొప్ప ఆనందాన్ని ఇస్తుంది.

మహిళల సంఖ్య పెరుగుతుంది
2011లో నేను ఒంటరిగా ప్రయాణించడం మొదలుపెట్టినప్పుడు, ఒంటరి ప్రయాణికులు అందునా మహిళలు చాలా అరుదుగా ఉండేవారు. మీ తల్లిదండ్రులు ఒంటరిగా వెళ్ళడానికి ఎలా అనుమతించారని నన్ను తరచుగా అడిగేవారు. నా భద్రతకు ఇంత పెద్ద ప్రమాదం తెచ్చుకుంటున్నందుకు నన్ను పిచ్చిదానివని అనేవారు. అయితే ఇది ఇప్పుడు సర్వసాధారణమయ్యింది. ఎక్కువ మంది మహిళలు ఒంటరిగా ప్రయాణిస్తూ, తమ అనుభవాలను పంచుకుంటున్న కొద్దీ, మరింత మంది ఈ సాహసం చేయడానికి స్ఫూర్తి పొందుతున్నారు. దానితో పాటు స్వేచ్ఛను అనుభూతి చెందుతున్నారు.

​మరింత స్థిరంగా ఉన్నాను
నా ఇరవైలలో తీసుకున్న ప్రతి నిర్ణయాన్ని ఇప్పుడు ప్రశ్నించుకుంటాను. స్థిరమైన ఉద్యోగాన్ని వదిలేశాను. నా జీవితాన్ని రెండు బ్యాగులకు కుదించుకున్నాను. ప్రయాణ కథల ద్వారా వచ్చే డబ్బుతో జీవితాన్ని నిర్మించుకున్నాను. కొత్త ప్రదేశాల నుండి నిరంతర ఉత్సాహాన్ని పొందుతున్నాను. ఇప్పుడు నలభైకి దగ్గర్లో ఉన్నాను. అప్పుడు నేను తీసుకున్న నిర్ణయాల పట్ల మరింత స్థిరంగా ఉన్నాను. ఎన్నో అడ్డంకులు ఎదుర్కొని, సంప్రదాయేతర మార్గాన్ని ఎంచుకున్నందుకు నా చిన్ననాటికి నేను కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను.

మహిళల కోసమే కొన్ని పాత్రలు
మహిళల స్వేచ్ఛాకాంక్ష పురుషుల కంటే చాలా భిన్నం. సంప్రదాయ కుటుంబంలో పెరిగిన నా చిన్ననాటి గురించి ఆలోచిస్తుంటాను. అప్పట్లో స్నేహితుల ఇంటికి ఒంటరిగా నడిచి వెళ్లడమే ఓ తిరుగుబాటు. పుట్టుకతోనే మహిళలకు కేటాయించ బడిన కొన్ని పాత్రలు ఉంటాయి. అవి అలాగే ఉండాలని కుటుంబాలు, సమాజం, చివరికి తోటివారు కూడా మనపై ఒత్తిడి తీసుకొస్తుంటారు. కూతుళ్లుగా, భార్యలుగా, తల్లులుగా, అమ్మమ్మలుగా తమ జీవితాలను గడిపేస్తుంటారు. ఈ పాత్రలు పోషిస్తూ తమదైన ప్రత్యేక గుర్తింపును కోల్పోతారు. మనం మన స్వేచ్ఛ కోసం అన్వేషణ మొదలుపెట్టినప్పుడు సమాజంతో పోరాడక తప్పదు.

– సలీమా

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -