‘‘నీరుంటేనే జీవితం… నీరు లేకపోతే నగరం కూడా ఎడారే’’ ఈ మాట హైదరాబాద్ నగర శివార్లలోని బోడుప్పల్ ప్రాంత ప్రజల జీవితాలను చూస్తే అక్షర సత్యంగా అనిపిస్తుంది. ఆకాశాన్ని తాకే భవనాలు, విశాలమైన రహదారులు, ఆధునిక సౌకర్యాలతో మెరిసిపోతున్న మహానగరం ఒకవైపు కనిపిస్తుంటే, మరోవైపు ఒక బిందె నీటి కోసం గంటల తరబడి ఎదురుచూస్తున్న కుటుంబాల వేదన నగర అభివృద్ధిపై ప్రశ్నలు లేవనెత్తుతోంది. గత రెండు నెలలుగా బోడుప్పల్, ఉప్పల్ పరిసర ప్రాంతాలు నీటి కొరతతో విలవిల్లాడుతున్నాయి. ఒకప్పుడు జీవనంతో కళకళలాడిన వీధులు, నేడు ఒక్క బిందె నీటి కోసం నిట్టూర్పులు విడిచే గృహాలుగా మారిపోయాయి. తెల్లవారక ముందే నీటి కోసం ప్రారంభమయ్యే నిరీక్షణ, అర్ధరాత్రి దాటినా ముగియని ఆవేదనగా ప్రతి ఇంటి గడపను చుట్టుముడుతోంది. తాగడానికి గుక్కెడు నీరు లేదు… స్నానం చేయడానికి చుక్క లేదు… కనీసం మరుగుదొడ్డిని ఉపయోగించుకోవ డానికి కూడా బిందె నీటి కోసం కళ్లప్పగించి ఎదురు చూడాల్సిన దుస్థితి. ఒకప్పుడు ప్రశాంత జీవనానికి నిలయమని, నగర రద్దీకి కాస్త దూరంగా సుఖంగా బతకవచ్చని భావించి వేలాది కుటుంబాలు బోడుప్పల్, ఉప్పల్ పరిసర ప్రాంతాలను తమ ఆశల నిలయంగా ఎంచుకున్నాయి. జీవితకాల పొదుపును వెచ్చించి కొందరు సొంత ఇంటి కలను నిజం చేసుకోగా, మరికొందరు ప్రశాంతమైన జీవితం కోసం అద్దె ఇళ్లలో అడుగుపెట్టారు. కానీ నేడు అదే ఇల్లు, అదే గడప, అదే కాలనీ…ఒక్క బిందె నీటి కోసం కన్నీళ్లు కార్చే వేదనకు చిరునామాగా మారింది.
ఒకవైపు బోర్లు పూర్తిగా ఎండిపోవడంతో భూగర్భ జలాలు అడుగంటిపోయాయి. మరోవైపు వాటర్ ట్యాంకర్ బుక్ చేస్తే అది ఎప్పుడు వస్తుందో చెప్పలేని పరిస్థితి. రోజులు గడుస్తున్నా ట్యాంకర్ జాడ ఉండదు. ప్రతి ఉదయం ఫోన్‌లో బుకింగ్ స్థితిని చూస్తూ, ప్రతి శబ్దానికీ ‘‘ట్యాంకర్ వచ్చిందేమో’’ అని గేటు వైపు పరుగెత్తే అమాయక నిరీక్షణ మాత్రమే మిగులుతోంది. ప్రతి ఖాళీ బిందె ఒక కుటుంబం దాహాన్ని చెబుతోంది. ప్రతి ఎండిపోయిన నల్లా ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని ప్రశ్నిస్తోంది. నీటి కోసం గడిచే ప్రతి నిమిషం ప్రజల సహనాన్ని పరీక్షిస్తుంటే, ప్రతి రోజు వారి జీవితాలపై కొత్త భారాన్ని మోపుతోంది. ట్యాంకర్ వస్తుందో రాదో తెలియని అనిశ్చితి… వచ్చినా అందరికీ సరి పోతుందో లేదో అన్న ఆందోళన… ఇదే నేడు బోడుప్పల్, ఉప్పల్ ప్రజల నిత్యజీవితానికి ప్రతిబింబంగా మారింది.
కోట్ల ఆశలతో బతుకుతున్న ప్రజల ప్రాథమిక అవసరాలను తీర్చే పరిపాలన. కానీ నేడు బోడు ప్పల్ పరిస్థితిని చూస్తే, మహానగరం అనే మాట గర్వంగా కాకుండా గాయంగా అనిపిస్తోంది. పేరుకే మహానగరం… కానీ ప్రజలు మాత్రం దాహంతో విలవిలలాడుతున్నారు. కొత్త కొత్త కాలనీలు పుట్టుకొస్తున్నాయి. జనాభా రోజురోజుకూ పెరుగుతోంది. కానీ వాటికి అనుగుణంగా మౌలిక వసతులు పెరగకపోతే, ఆ అభివృద్ధి కేవలం ప్రకటనలకే పరిమితమవుతుంది.
సిమెంట్‌తో నగరాన్ని నిర్మించడం సులభమే..కానీ ప్రజల విశ్వాసాన్ని నిర్మించడం అంత సులభం కాదు. ఒక నగర గొప్పదనం భవనాల ఎత్తులో కాదు, ప్రజల జీవన ప్రమాణాల్లో ఉంటుంది. నీటి కోసం ప్రజలు బిందెలు పట్టుకుని గంటల తరబడి ఎదురుచూడాల్సి వస్తే, ఆ నగరం ఎంత పెద్దదైనా, ఎంత ఆధునికమైనదైనా, అది అసంపూర్ణ అభివృద్ధికే నిదర్శనం.ఎన్నికల సమయంలో ప్రతి ఇంటి గుమ్మం తట్టిన నాయకులు, “మీ సేవకులం”, “మీ సమస్యలే మా సమస్యలు” అని మాటలు ఇచ్చిన ప్రజాప్రతినిధులు, ప్రజల దాహాన్ని ఎందుకు చూడలేకపోతున్నారు? ఓటు అడిగినప్పుడు గుర్తుకొచ్చిన ఇల్లు, గెలిచిన తర్వాత ఎందుకు గుర్తుకు రావడం లేదు? ప్రజాస్వామ్యం అంటే ఎన్నికల రోజుతో ముగిసే బాధ్యత కాదు, ప్రజల అవసరాలు తీరే వరకు కొనసాగే కర్తవ్యం. ఈ ప్రాంత ప్రజలు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. చెరువులు కాపాడితే భూగర్భ జలాలు పెరుగుతాయని విశ్వసించారు. కుంటలను పరిరక్షిస్తే రాబోయే తరాలకు నీటి కొరత ఉండదని కలలు కన్నారు. కానీ తక్కువ వర్షపాతం, పెరుగుతున్న జనాభా, ప్రణాళికల లోపం, నియంత్రణలేని నిర్మాణాలు కలిసి ఆ ఆశలన్నింటినీ ఆవిరి చేస్తున్నాయి. ప్రకృతి సహకరించకపోతే పరిపాలన మరింత చురుకుగా పనిచేయాలి. వర్షాలు తక్కువ పడితే ముందస్తు ప్రణాళికలు ఎక్కువగా ఉండాలి. సంక్షోభం వచ్చిన తర్వాత స్పందించడం కాదు, రాకముందే నివారించడం నిజమైన పాలనా దక్షత.
– కోట దామోదర్, 9391480475
నీటి కోసం నగరం నిట్టూర్పు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



