ప్రస్తుతం సీపీఐ(ఎం) పెద్దపల్లి జిల్లా కార్యదర్శిగా ఉన్న కామ్రేడ్ యెల్తూరి యాకయ్య తన నేపథ్యం, ఉద్యమానుభవాలను ‘మాకూ చరిత్ర ఉంది’ అనే శీర్షికతో నమోదు చేశారు. 13,14 ఏండ్ల నుండి ఆరు పదులు దాటి నాలుగు దశాబ్దాలకు పైగా కష్టజీవుల ఉద్యమంతో మమేకమై పనిచేస్తున్న ఆయన అనుభవాలు ఎంతో విలువైనవి. పేద దళిత కుటుంబంలో జన్మించిన ఆయన ప్రజాజీవితం రాడికల్ విద్యార్ది ఉద్యమంతో మొదలై ఒక దశాబ్ద కాలం పీపుల్స్ వార్ తోనూ, మరొక దశాబ్దానికి పైగా న్యూడెమోక్రసీ పార్టీతోనూ కొనసాగింది. అనంతరం ఆ పార్టీతో సైద్ధాంతికంగా విభేదించి సీపీఎంలో చేరారు. పార్టీలో హౌదాలతో నిమిత్తం లేకుండా ప్రతి నాయకుడు, కార్యకర్త తమ అనుభవాలను నమోదు చేయడం ఎంత ఉపయోగకరమో కామ్రేడ్ యాకయ్య రాసిన ఈ పుస్తకం తెలియజేస్తుంది. ఒక్కొకరి అనుభవాలు ఒక్కో రకంగా ప్రత్యేకమైనవి.
తనకు తొలి స్ఫూర్తి తన తండ్రి నుండే లభించిందని గర్వంగా చెబుతారు యాకయ్య. అంతగా మాట్లాడని తన తండ్రి న్యాయం అనుకున్న దానిపైపు నిర్భీతిగా ఎలా నిలబడే వారో వివరిస్తారు. నగ్జలైట్ ఉద్యమం ఉదృతంగా ఉన్నపుడు స్నేహలతా రెడ్డి ఎన్‌కౌంటర్‌కు గురైతే, ఆమె శవాన్ని తన తండ్రి మోసి రక్తం అంటిన దుస్తులతో వచ్చాడని, అలాగే గ్రామంలో కూడా అన్యాయాలకు వ్యతిరేకంగా జరిగే ప్రతి పోరాటంలో తానూ పాల్గొనేవాడని చెబుతారు. ఇదే తనను ప్రభావితం చేసిందని అంటారాయన.
న్యూడెమోక్రసీ పార్టీలో ఉన్న సమయంలో యాకయ్య ట్రేడ్ యూనియన్ బాధ్యతల్లో ఉన్నారు. గోదావరి లోయ బొగ్గుగని కార్మిక సంఘంలో ఉంటూ ముమ్మరంగా కార్యకలాపాలు నిర్వహించారు. ఆ సమయంలో పీపుల్స్ వార్ ఆధ్వర్యంలో నడుస్తున్న సింగరేణి కార్మిక సంఘంతో కూడా ఘర్షణలు పడ్డారు. న్యూడెమోక్రసీ పార్టీలో ఉన్న సమయంలోనే యాకయ్యను పోలీసులు పీపుల్స్‌వార్‌తో సంబంధం ఉందన్న అనుమానంతో కిడ్నాప్ చేసి, అనేక పోలీసు స్టేషన్లకు మారుస్తూ దాదాపు నెలరోజుల పాటు చిత్రహింసలకు గురిచేశారు. ఎన్‌కౌంటర్ చేయడానికి కూడ సిద్ధపడ్డారు. అప్పుడు న్యూడెమోక్రసీ పార్టీలోనే ఉన్న యాకయ్య సమీప బంధువు, పెద్దమ్మ కొడుకు బొజ్జా బిక్షమయ్య పెద్ద ఎత్తున ఆందోళన చేశారు. ఎంఎల్‌ఏ గుమ్మడి నర్సయ్య అసెంబ్లీలో ఈ అంశాన్ని లేవనెత్తారు. యాకయ్యనైనా, ఆయన శవాన్నయినా అప్పచెప్పమని డిమాండ్ చేశారు. ఇందులో నున్నా నాగేశ్వరరావు, సీపీఎం నాయకులు జి.రాములు మొదలైన వారు తీవ్రంగా కృషి చేశారు. చివరికి పోలీసులే యాకయ్య పీపుల్స్‌వార్‌తో లేడని నిర్ధారించుకోవడంతో చావు అంచులవరకు వెళ్ళి బయటపడ్డాడు. తాను ఏ పార్టీలో ఉంటే ఆ పార్టీకి చిత్తశుద్ధితో పనిచేసేవాడినని, అలాంటి తాను న్యూడెమోక్రసీ పార్టీలో చేరిన తర్వాత పీపుల్స్ వార్ గ్రూపు వారు తనను హత్య చేయడానికి సైతం ప్రయత్నించారని, న్యూడెమోక్రసీ దూరమైన తర్వాత ఆ పార్టీవారు తనపై తప్పుడు హత్యారోపణలు చేయడానికి సిద్ధపడ్డారని ఆవేదన వ్యక్తం చేస్తారు యాకయ్య. సీపీఎంలో తాను నిర్వహించిన అనేక పోరాటల గురించి సవివరంగా తెలియచేస్తారు ఈ పుస్తకంలో.
ఈ పుస్తకానికి సంబంధించి మరొక విషయాన్ని తప్పకుండా చెప్పుకోవాలి. యాకయ్య తన గ్రామం మేచిరాజు పల్లె గురించి సామాజిక, రాజకీయ, ఆర్థిక అంశాలను, వివక్షతలను, దోపిడీని సమగ్రంగా సేకరించి విశ్లేషణ కూడా చేశారు. అలా తాను పుట్టి పెరిగి, అభివృద్ధిచెందిన నేపథ్యం గురించి పాఠకులకు పరిచయం చేస్తారు. ఇదే క్రమంలో తన విస్తారమైన కుటుంబం గురించి, బంధుబలగాల గురించి కూడా విపులంగా వివరిస్తారు. ఓ రకంగా అది ఆయన సంపద కూడ. సీపీఎం భూపాలపల్లి జిల్లా కార్యదర్శి బండి సాయిలు యాకయ్యకు స్వయాన బావమరిది. ఇలా అన్ని విషయాలతో తన అనుభవాలకు బిక్షమయ్య వంటి వారి సహాయ సహకారాలతో ఒక పుస్తక రూపం ఇవ్వడంలో కృతకృత్యుడయ్యాడు కామ్రేడ్ యాకయ్య. కమ్యూనిస్టు, వామపక్ష శ్రేణులు, అభిమానులు, ప్రత్యేకించి యువత తప్పని సరిగా చదవాల్సిన పుస్తకం ఇది.
– గుడిపూడి విజయరావు
నేను, నా వూరు, నా వాళ్ళు, ఉద్యమం
- Advertisement -
- Advertisement -



