Tuesday, July 28, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్కళ్యాణలక్ష్మి–షాదీ ముబారక్‌ నకిలీ ధృవపత్రాల మోసాన్ని ఛేదించిన పోలీసులు

కళ్యాణలక్ష్మి–షాదీ ముబారక్‌ నకిలీ ధృవపత్రాల మోసాన్ని ఛేదించిన పోలీసులు

- Advertisement -

– ముగ్గురు అరెస్ట్.. నకిలీ రబ్బరు ముద్రలు, కంప్యూటర్లు, డిజిటల్ ఆధారాలు స్వాధీనం
– జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర 
నవతెలంగాణ – కామారెడ్డి

కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ ప్రభుత్వ సంక్షేమ పథకాల కింద నకిలీ ధృవీకరణ పత్రాలతో అక్రమంగా దరఖాస్తులు సమర్పిస్తున్న ముఠాను కామారెడ్డి పోలీసులు ఛేదించారు. మంగళవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర మాట్లాడుతూ.. ఈ కేసులో ముగ్గురు నిందితులను అరెస్టు చేసి, వారి వద్ద నుంచి కంప్యూటర్ పరికరాలు, నకిలీ అధికారిక రబ్బరు ముద్రలు, మొబైల్ ఫోన్లు, డిజిటల్ రికార్డులు స్వాధీనం చేసుకున్నట్లు  తెలిపారు. ప్రభుత్వ జిల్లా ఆసుపత్రిలో ఆర్‌ఎంఓగా విధులు నిర్వహిస్తున్న డా. చందారి సంతోష్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఆయన పేరుతో, అధికారిక హోదాతో నకిలీ సంతకాలు చేసి, అధికారిక రబ్బరు ముద్రలను దుర్వినియోగం చేస్తూ వయస్సు, మొదటి వివాహ ధృవీకరణ పత్రాలను తయారు చేసి సంక్షేమ పథకాల కోసం ఉపయోగిస్తున్నట్లు గుర్తించారు.

ఎస్పీ ఆదేశాల మేరకు డీఎస్పీ మధుసూదన్ పర్యవేక్షణలో ప్రత్యేక దర్యాప్తు బృందాలు సాంకేతిక ఆధారాలతో విచారణ జరిపాయి. దర్యాప్తులో భాగంగా భిక్కనూర్‌లోని లహరి జిరాక్స్ అండ్ ఆన్‌లైన్ సెంటర్‌లో తనిఖీలు నిర్వహించి ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకోవడం జరిగిందన్నారు. విచారణలో ప్రధాన నిందితులు తోడెంగల రాజా నరేందర్, తోడెంగల రాజలింగం తమ ఆన్‌లైన్ సేవా కేంద్రం ద్వారా ఇప్పటివరకు 52 వరకు దరఖాస్తులు చేయడం జరిగిందని వీటిని త్వరలోనే పూర్తిస్థాయిలో విచారణ చేయడం జరుగుతుంది అన్నారు. కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ దరఖాస్తుదారుల నుంచి అవసరమైన పత్రాలు సేకరించి, ఒక్కో దరఖాస్తుకు రూ.4,500 నుంచి రూ.5,000 వరకు వసూలు చేసినట్లు వెల్లడైందన్నారు. అనంతరం జిల్లా ఆసుపత్రిలో ఔట్‌సోర్సింగ్ ఉద్యోగిగా పనిచేస్తున్న బోయిని ప్రసాద్‌తో కుమ్మక్కై ప్రభుత్వ వైద్యాధికారుల పేర్లతో నకిలీ సంతకాలు, నకిలీ రబ్బరు ముద్రలు ఉపయోగించి ధృవీకరణ పత్రాలు తయారు చేసి ఆన్‌లైన్‌లో దరఖాస్తులు సమర్పించినట్లు పోలీసులు గుర్తించారు.

ఈ కేసులో  తోడెంగల రాజా నరేందర్ (భిక్కనూర్), తోడెంగల రాజలింగం (భిక్కనూర్), బోయిని ప్రసాద్ (భిక్కనూర్) నిందితుల వద్ద నుంచి కంప్యూటర్ సీపీయూ, ఎల్‌సీడీ మానిటర్, కీబోర్డ్, మౌస్, మూడు మొబైల్ ఫోన్లు, నకిలీ అధికారిక రబ్బరు ముద్రలు, స్టాంప్ ప్యాడ్, పెన్నులు, కంప్యూటర్‌లో భద్రపరిచిన డిజిటల్ రికార్డులు తదితర నేర సంబంధిత వస్తువులను స్వాధీనం చేసుకోవడం జరిగిందన్నారు. ఈ వ్యవహారంలో అక్రమంగా సమర్పించిన దరఖాస్తుల సంఖ్య, ప్రభుత్వానికి జరిగిన ఆర్థిక నష్టం, ఇతర వ్యక్తుల ప్రమేయంపై దర్యాప్తు కొనసాగుతోందని ఎస్పీ తెలిపారు. ప్రభుత్వ సంక్షేమ పథకాల దుర్వినియోగానికి పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కేసును ఛేదించిన డీఎస్పీ, టౌన్ ఎస్‌హెచ్‌ఓ నరహరి మరియు పోలీసు సిబ్బందిని ఎస్పీ అభినందించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -