Tuesday, July 28, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ప్రత్యేక విద్యా ఉపాధ్యాయులకు 'మనోన్యాయ్' పథకంపై అవగాహన

ప్రత్యేక విద్యా ఉపాధ్యాయులకు ‘మనోన్యాయ్’ పథకంపై అవగాహన

- Advertisement -

నవతెలంగాణ – కామారెడ్డి
తెలంగాణ రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ, హైదరాబాద్ ఆదేశాల మేరకు కామారెడ్డి జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో మంగళవారం కామారెడ్డి పట్టణంలోని యోగా భవన్‌లో జిల్లా ప్రత్యేక విద్యా ఉపాధ్యాయులకు మానసిక అనారోగ్యం, మేధో వైకల్యం కలిగిన వ్యక్తులకు న్యాయ సేవల పథకం–2024 (మనోన్యాయ్) పై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి నాగరాణి మాట్లాడుతూ, మానసిక అనారోగ్యం, మేధో వైకల్యం కలిగిన వ్యక్తులు గౌరవప్రదమైన జీవితం గడపడంతో పాటు విద్య, వైద్యం, ఉపాధి, సామాజిక భద్రత, న్యాయ పరిరక్షణ పొందే హక్కు కలిగి ఉన్నారని తెలిపారు.

మనోన్యాయ్ పథకం–2024 ముఖ్య ఉద్దేశ్యం మానసిక అనారోగ్యం, మేధో వైకల్యం కలిగిన వ్యక్తులకు ఉచిత న్యాయ సహాయం అందించడం, వారి హక్కులను పరిరక్షించడం, ప్రభుత్వ సంక్షేమ పథకాలతో అనుసంధానం చేయడం, అలాగే విద్య, వైద్యం, పునరావాసం, సంరక్షణకు సంబంధించిన సేవలను అందుబాటులోకి తీసుకురావడమేనని వివరించారు. ప్రత్యేక అవసరాలు గల పిల్లలు, వారి కుటుంబాలు ఎదుర్కొంటున్న న్యాయపరమైన, సామాజిక సమస్యల పరిష్కారంలో జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని పేర్కొన్నారు. ప్రత్యేక విద్యా ఉపాధ్యాయులు తమ వద్ద చదువుతున్న ప్రత్యేక అవసరాలు గల విద్యార్థుల సమస్యలను సకాలంలో గుర్తించి, న్యాయ సహాయం అవసరమైన సందర్భాల్లో జిల్లా న్యాయ సేవాధికార సంస్థతో సమన్వయం చేసుకుని వారికి తక్షణ సహాయం అందేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.

అనంతరం జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ద్వారా అందిస్తున్న ఉచిత న్యాయ సహాయం, ప్రజా న్యాయ పరిష్కార వేదికలు (లోక్ అదాలత్‌లు), మధ్యవర్తిత్వ సేవలు, బాధితులకు పరిహార పథకం, మహిళలు, పిల్లలు, దివ్యాంగులు, వృద్ధులు, ఇతర బలహీన వర్గాలకు అందుబాటులో ఉన్న న్యాయ సేవలు, న్యాయ అవగాహన కార్యక్రమాలు, న్యాయ సహాయ కేంద్రాల సేవల గురించి వివరించారు. న్యాయ సహాయం అవసరమైన వారు జిల్లా న్యాయ సేవాధికార సంస్థను నేరుగా లేదా టోల్‌ఫ్రీ నంబర్ 15100 ద్వారా సంప్రదించి ఉచిత న్యాయ సేవలు పొందవచ్చని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా సమన్వయకర్తలు చైతన్య, నాగవెందర్, జిల్లా వ్యాప్తంగా పనిచేస్తున్న సమగ్ర విద్య వనరుల ఉపాధ్యాయులు, ప్రత్యేక విద్యా ఉపాధ్యాయులు, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ సిబ్బంది పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -