Wednesday, July 29, 2026
E-PAPER
Homeఎడిట్ పేజివిద్యా వ్యాపారం!

విద్యా వ్యాపారం!

- Advertisement -

ఇంజినీరింగ్ విద్య ఇప్పుడు జ్ఞానాన్ని అందించే వ్యవస్థగా కాకుండా, ప్రయివేటు కాలేజీలకు అదనపు ఫీజుల పేరుతో డబ్బు వసూలు చేసే యంత్రంగా మారింది. ప్రభుత్వం, ఫీజుల రెగ్యులేటరీ కమిటీ నిర్ణయించిన ట్యూషన్ ఫీజు కాకుండా యాజమాన్యాలు ఒక్కో విద్యార్థి నుంచి రూ.20 వేల నుంచి రూ.50 వేల వరకు ముక్కుపిండి వసూలు చేస్తున్నాయి. ఇదేంటని అడిగితే? ల్యాబ్, కాలేజ్ డెవలప్‌మెంట్ ఫండ్, లైబ్రరీ, అడ్మిషన్, జేఎన్‌టీయూ, మెయింటెనెన్స్, ఇతర ఖర్చులు అంటూ కాకమ్మ కథలు చెబుతున్నాయి. అంతేకాదు, గుర్తింపు పొందిన పెద్ద పెద్ద కాలేజీల్లో బి కేటగిరి సీట్లను కూడా ఒక్కొక్క సీటును డొనేషన్ కింద లక్షల రూపాయలకు అమ్ముకుంటున్నాయి. గత కొన్నేండ్లుగా ఈ దందా నడుస్తున్నా సర్కారు చర్యలు మాత్రం శూన్యంగానే కనిపిస్తున్నాయి. ఈ అక్రమ వసూళ్లకు అడ్డుకట్ట లేదా? ప్రతి విద్యా సంవత్సరంలో వేలాది తల్లిదం డ్రుల బాధ ఇదే. అధికారంలో ఉంటు న్న పాలకులు ఎవరిని కాపాడుతున్నా రు? విద్యార్థులనా… విద్యను వ్యాపా రంగా మార్చుకున్న యాజమాన్యా లనా? ప్రభుత్వం లో యాజమాన్యాల భాగస్వామ్యం ఉన్నప్పు డు చర్యలు ఉంటాయనుకోవడం భ్రమే. 2025-26, 2026-27, 2027-28 విద్యా సంవత్సరాలకు తెలంగాణ అడ్మిషన్ అండ్ ఫీజు రెగ్యులేటరీ కమిటీ (టీఏపీఆర్‌సీ) గత విద్యా సంవత్సరం ట్యూషన్ ఫీజులను ఖరారు చేసింది.

కమిటీ ప్రతిపాదనలకు అనుగుణంగా ప్రయి వేటు కాలేజీలకు ఫీజుల వివరాలను పొందు పరుస్తూ ప్రభుత్వం జీవోను విడుదల చేసింది. మూడేండ్ల ఫీజుల పీరియడ్‌లో ట్యూషన్ ఫీజు గాకుండా ఎలాంటి అదనపు ఫీజులూ అక్రమంగా వసూలు చేసినా చర్యలు తీసుకుంటామని ప్రభుత్వం హెచ్చరించింది. ఆ ఆదేశాలను యాజమాన్యాలు తుంగలో తొక్కేశాయి. ఈ విద్యాసంవత్సరం అడ్మిషన్ల ప్రక్రియ పూర్తికాలేదు. ఇంకా క్లాసుల్లోకి విద్యార్థులు అడుగుపెట్టకముందే అదనపు ఫీజుల వసూలుకు తెరలేపాయి. ఫీజులు చెల్లిస్తేనే అడ్మిషన్ ఇస్తామని మొహం మీదనే చెప్పేస్తున్నాయి. ఒకవైపు ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకం సరిగా అమలు గాకపోవడం, మరోవైపు ఈ అదనపు ఫీజుల వసూళ్లతో ప్రస్తుత విద్యార్థులకు ఇంజినీరింగ్ విద్య కఠినంగా తయారైంది. ప్రభుత్వం ప్రకటనలు చేసినంత సులభంగా వాటి అమలు విషయంలో సీరియస్‌గా లేకపోవడం ప్రస్తుత పరిస్థితులకు కారణం. విద్యార్థులందరికీ ఇంజినీరింగ్ విద్యను దగ్గర చేయడం కోసం గత ప్రభుత్వాలు తీసుకొచ్చిన అనేక విధానాల వల్ల లక్షలాది మంది విద్యార్థులు ఇంజి నీర్లుగా మారి దేశ నిర్మాణంలో భాగస్వా ములయ్యారు. సాంకేతిక నిపుణు లుగా ప్రపంచంలోనే గుర్తింపు పొందారు. ఎప్పుడైతే విద్యార్థులు ఇంజినీరింగ్‌వైపు మొగ్గుచూపారో ఆనాటి నుంచి ఫీజుల పేరుతో ఇంజినీరింగ్ విద్యను యాజమా న్యాలు దోపిడీకి అడ్డాగా మార్చేశాయి.

గతంలో అన్ని కాలేజీలకు ఒకేరకమైన ఫీజు ఉండేది. ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకం వచ్చిన తర్వాత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో చాలా కాలేజీలు పుట్టుకొచ్చాయి. ఈ పథకం మీదనే ఆధారపడి చాలా కాలేజీలు నడిచాయి కూడా. చివరికి కొంతమంది యాజమాన్యాలు ప్రభుత్వంలో భాగస్వామ్యమై చివరికి ప్రభుత్వాలనే శాసించే స్థాయికి చేరాయి. అదే సందర్భంలో చిన్న కాలేజీలను పట్టించుకోవడమే మానేశాయి. దేశవ్యాప్తంగా చాలా రాష్ట్రాల్లో ఇవే పరిస్థితులు నెలకొన్నాయి. రాష్ట్రంలో 176 ఇంజినీరింగ్ కాలేజీలుంటే అందులో 157 ప్రయివేటు కాలేజీలే. ఇందులో పాలకులకు దగ్గరగా ఉన్న కాలేజీలే ఎక్కువ. ఖర్చులకు అనుగుణంగా ఫీజులు సరిపోవడం లేదంటే కొన్ని కాలేజీలకు ప్రభుత్వాలు ఫీజులు పెంచేశాయి. నాలుగేండ్ల ఇంజినీరింగ్ విద్యలో కన్వీనర్ కోటాలో ఏడాదికి ఫీజు ప్రస్తుతం చాలా కాలేజీల్లో లక్ష రూపా యలు, లక్షా 50 వేలు, లక్షా 80 వేలు, రెండు లక్షల చొప్పున ఫీజు ఉంది. బీ కేటగిరి సీట్లకు డొనేషన్ ఫీజు సరేసరి. కొన్ని కాలేజీల్లో తక్కువ ఫీజు ఉంది. ఇవి గాకుండా ఇతరత్రా కేటగిరిల కింద అదనంగా ఫీజులు వసూలు చేస్తున్నాయి.

దీనకంతటికీ ప్రభుత్వ విధానాల అమలు లోపమే కారణం. ఫీజు రీయింబర్స్‌మెంట్ కింద విద్యార్థులకు సకాలంలో ఫీజులు చెల్లిస్తే అదనంగా ఫీజులు వసూలు చేయాల్సిన దుస్థితి ఉండేది కాదనేది యాజమాన్యాల వాదన. ప్రభుత్వం కూడా ఆ దిశగా ఆలోచించాల్సి ఉంది. విద్యను సేవగా కాకుండా వ్యాపారంగా మార్చే ధోరణి రోజురోజుకూ పెరుగుతోంది. దీనికి అనుగుణంగా కేంద్రరాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న విధానాలూ అందులో భాగం. అనేక ప్రయివేటు విద్యాసంస్థలు కొంతమంది ప్రభుత్వ పెద్దల చేతుల్లో ఉండటం వల్ల నియంత్రణ సంస్థలు కూడా కఠినంగా వ్యవహరించలేకపోతున్నాయి. ఈ సమస్యకు పరిష్కారంగా ప్రభుత్వం స్పష్టమైన విధానాన్ని అమలు చేయాలి. పర్యవేక్షణ సంస్థలకు పూర్తి స్వేచ్ఛ ఇవ్వాలి. ప్రభుత్వం నిర్ణయించిన ఫీజు మినహా అదనపు వసూళ్లు చేసినా చర్యలు తీసుకోవాలి. విద్యను కాపాడాలంటే ఫీజుల దోపిడీని అరికట్టాలి. లేకపోతే ‘విద్య హక్కు’ అనే రాజ్యాంగ వాగ్దానం, ‘డబ్బు ఉన్నవారికే విద్య’ అనే చేదు వాస్తవంగా మిగిలిపోతుంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -