భారత్ ఎగుమతులు వెలవెల
పెరిగిన దేశ వాణిజ్య లోటు
ఆరు నెలల్లో 79.41 బిలియన్ డాలర్ల దిగుమతులు
ఎగుమతులు 12.31 బిలియన్ డాలర్లే
న్యూఢిల్లీ : చైనా నుంచి దిగుమతులు అమాంతం పెరగడంతో ఆ దేశంతో భారత వాణిజ్య లోటు భారీ స్థాయిలో పెరుగుతోంది. ఈ ఏడాది 2026 జూన్ నాటికి చైనాతో భారత్ వాణిజ్య లోటు ఏకంగా 15.3 బిలియన్ డాలర్లకు చేరింది. ఏడాదికేడాదితో పోల్చితే 430 శాతం భారీ పెరుగుదల చోటు చేసుకోవడం గమనార్హం. పెట్రోలియం ఉత్పత్తుల ధరల పెరుగుదల, సాధారణ వస్తువుల దిగుమతులు పెరగడమే ఈ భారీ లోటుకు ప్రధాన కారణమని ది హిందూ ఓ కథనంలో వెల్లడించింది. 2026 తొలి ఆరు నెలల్లో చైనా నుంచి మన దేశానికి దిగుమతులు రికార్డు స్థాయిలో 79.41 బిలియన్ డాలర్లకు చేరగా, అక్కడికి మన ఎగుమతులు మాత్రం కేవలం 12.31 బిలియన్ డాలర్లకే పరిమితమయ్యాయి. ఎగుమతుల్లో కొంత వృద్ధి నమోదైనప్పటికీ, దిగుమతుల ప్రవాహంతో పోలిస్తే అది ఏమాత్రం సరిపోవడం లేదు. ఫలితంగా ద్వైపాక్షిక వాణిజ్య లోటు విపరీతంగా పెరిగిపోయి భారత ఆర్థిక వ్యవస్థకు తీవ్ర ఆందోళన కలిగిస్తోంది.
ఆత్మనిర్భర్ లక్ష్యాలకు ఎదురుదెబ్బ
దేశీయంగా ‘మేక్ ఇన్ ఇండియా’, ఆత్మనిర్భర్, పిఎల్‌ఐ వంటి పథకాలతో తయారీ రంగాన్ని ప్రోత్సహిస్తున్నప్పటికీ, కీలక ఉత్పాదక ముడి సరుకుల కోసం చైనాపై మన దేశం ఆధారపడటం తగ్గడం లేదు. ఎలక్ట్రానిక్ పరికరాలు, మొబైల్ విడిభాగాలు, ఫార్మా ఎపిఐలు, యంత్ర సామగ్రి వంటి విడిభాగాలను చైనా నుంచి భారీగా దిగుమతి చేసుకుంటున్నాం. దేశంలో తయారీ పెరుగుతున్న వెనుక ఈ దిగుమతి ఆధారిత సరఫరా గొలుసు విస్తరిస్తుండటం ఆత్మనిర్భర్ భారత్ ఆశయాలకు గట్టి ఎదురుదెబ్బగా మారుతోంది. దీంతో ప్రధాని మోడీ చెబుతోన్న స్వయంసమృద్ధి గాలిమాటలుగా నిలిచిపోతున్నాయి.
భారత ఉత్పత్తులకు అవరోధాలు
ప్రపంచంలోనే అతిపెద్ద వినియోగ మార్కెటైన చైనాలో భారత ఉత్పత్తుల విక్రయాలు అంతంతమాత్రంగానే ఉంటున్నాయి. వ్యవసాయ ఉత్పత్తులు, ఔషధాలు, ఇంజనీరింగ్ రంగాల్లో అవకాశాలు ఉన్నప్పటికీ.. కఠినమైన నిబంధనలు, ముఖ్యంగా ధరల పోటీ, వాణిజ్యేతర అవరోధాలు ప్రతిబంధకంగా మారుతున్నాయి. బియ్యం, మిరపకాయలపై పరిమితులు, అరుదైన ఖనిజాల ఎగుమతుల నియంత్రణ వంటి అంశాలు మన ఎగుమతిదారులను తీవ్రంగా దెబ్బతీస్తున్నాయి.
వాణిజ్య లోటు ఆల్‌టైం రికార్డ్..
ప్రస్తుత ధోరణులు ఇలాగే కొనసాగితే 2026–27లో చైనాతో వాణిజ్య లోటు గత ఆర్థిక సంవత్సరపు రికార్డు అయిన 116 బిలియన్ డాలర్లను కూడా దాటే ప్రమాదం ఉంది. చౌకైన చైనా దిగుమతులు దేశీయ తయారీదారులపై తీవ్ర ధరల ఒత్తిడిని తెస్తున్నాయి. కేవలం దిగుమతులను నిలువరించడమే కాకుండా దేశీయంగా పరికరాల తయారీ సామర్థ్యాన్ని వేగంగా పెంచుకోకపోతే.. చైనాతో ఈ వాణిజ్య అసమతుల్యత భారత పారిశ్రామిక రంగానికి వ్యూహాత్మక ప్రమాదంగా మారుతుందని నిపుణులు పేర్కొంటున్నారు. చైనా నుంచి దిగుమతులపై ఆధారపడటాన్ని తగ్గించి దేశీయ తయారీని బలోపేతం చేయాలన్న ప్రధాని మోడీ మేక్ ఇన్ ఇండియా, ఆత్మనిర్భర్ భారత్ లక్ష్యాలు ఆశించిన స్థాయిలో ఫలించలేదనే విమర్శలకు తాజా గణాంకాలు బలం చేకూరుస్తున్నాయి.
చైనా నుంచి దిగుమతుల వెల్లువ
- Advertisement -
- Advertisement -



