రోడ్ల నిర్మాణాలతో పెరుగుతున్న సౌకర్యం
రూ.13 వేల కోట్ల
హ్యామ్ ప్రాజెక్టుకు శ్రీకారం
ఆర్ అండ్ బీ శాఖపై
సర్కారు ప్రత్యేక శ్రద్ధ
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
రాష్ట్రంలో రవాణా వ్యవస్థను మెరుగుపరిచేందుకు ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తున్నది. రోడ్ల అభివృద్ధికి పెద్దపీట వేస్తున్నది. మరమ్మత్తులతోపాటు కొత్త రోడ్ల నిర్మాణాలకు కసరత్తులు పెంచింది. రహదారులు, వంతెనలు, ఎలివేటెడ్ కారిడార్లు, రింగ్ రోడ్లు, ఎక్స్ ప్రెస్వేలు, ప్రభుత్వ భవనాల నిర్మాణాలను వేగవంతం చేస్తున్నది. భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా భారీ ప్రాజెక్టులను చేపడుతున్నది. గ్రామీణ ప్రాంతాల నుంచి హైదరాబాద్ మహానగరం వరకు రోడ్ల అనుసంధానాన్ని పెంచేందుకు చర్యలు తీసుకుంటున్నది. రవాణా సౌలభ్యం, పారిశ్రామికాభివృద్ధి, పెట్టుబడుల ఆకర్షణ, ఆరోగ్య, న్యాయ సేవల విస్తరణకు వాటిని కీలకంగా భావిస్తూ పనులు చేపడుతున్నది. తద్వారా తెలంగాణను దేశంలోనే అత్యుత్తమ మౌలిక వసతులు కలిగిన రాష్ట్రంగా తీర్చిదిద్దాలన్న లక్ష్యంతో ప్రభుత్వం ముందుకు సాగుతున్నది. ఈ మేరకు రోడ్లు, భవనాల శాఖ ఒక ప్రకటన విడుదల చేసింది.
వేగంగా రహదారుల విస్తరణ
రోడ్లు, భవనాల శాఖ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా 29,075 కిలోమీటర్ల రహదారి నెట్వర్క్ నిర్వహణ ఉన్నదని తెలిపింది. ప్రజా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రూ.6,617.86 కోట్లతో 239 అభివృద్ధి పనులకు అనుమతులు వచ్చాయని పేర్కొంది. వాటిలో 1,659 కిలోమీటర్ల రహదారుల అభివృద్ధి, 62 వంతెనల నిర్మాణాలున్నాయని వివరించింది. ఇప్పటికే 514.8 కిలోమీటర్ల రహదారి విస్తరణ, 69 వంతెనలు, 617 కిలోమీటర్ల రోడ్ల పునరుద్ధరణ పనులు పూర్తయ్యాయని తెలిపింది. అంబర్పేట్, బీహెచ్ఈఎల్, ఆరాంఘర్–శంషాబాద్, నిర్మల్–ఖానాపూర్ నాలుగు ప్రధాన రహదారి ప్రాజెక్టులు ప్రారంభమయ్యాయని పేర్కొంది. రహదారుల విస్తరణతో ప్రయాణ సమయం తగ్గడంతోపాటు లాజిస్టిక్స్ వ్యయం తగ్గి పరిశ్రమలకు మేలు జరుగుతుందని ప్రభుత్వం భావిస్తున్నదని తెలిపింది.
హ్యామ్ మోడల్‌తో రికార్డు
రాష్ట్ర చరిత్రలోనే అతిపెద్ద రహదారి నిర్మాణ కార్యక్రమంగా హైబ్రిడ్ యాన్యుటీ మోడల్ (హ్యామ్) కింద రూ.13,006 కోట్లతో 6,092 కిలోమీటర్ల పొడవున 441 రహదారుల నిర్మాణానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టిందని రోడ్లు, భవనాల శాఖ తెలిపింది. ఈ హ్యామ్ రోడ్ల నిర్మాణ పనులకు జూన్ 28న ముఖ్యమంత్రి ఎ రేవంత్ రెడ్డి నల్లగొండ జిల్లా కనగల్ సమీపంలో శంకుస్థాపన చేసి పైలాన్‌ను ఆవిష్కరించారని పేర్కొంది. హ్యామ్ ప్రాజెక్టు ఫేజ్-1 కింద రాష్ట్రవ్యాప్తంగా 34 ప్యాకేజీలుగా టెండర్లు పిలవగా, 31 ప్యాకేజీల పనులు ఖరారయ్యాయని వివరించింది. నిర్మాణ దశలో ప్రభుత్వం ప్రాజెక్టు వ్యయంలో 40 శాతం చెల్లిస్తుందని తెలిపింది. మిగిలిన 60 శాతం మొత్తాన్ని కాంట్రాక్టర్ ముందుగా పెట్టుబడి పెట్టి రోడ్లను నిర్మించాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. ఆ తర్వాత 15 ఏండ్ల నిర్వహణ కాలంలో ప్రభుత్వం విడతల వారీగా చెల్లిస్తుందని పేర్కొంది. ఈ విధానంలో రోడ్ల నిర్వహణ బాధ్యత కూడా కాంట్రాక్టర్లదేనని వివరించింది. ఇదే తరహాలో పంచాయతీరాజ్ శాఖ పరిధిలో రూ.6,294 కోట్లతో 7,449 కిలోమీటర్ల గ్రామీణ రహదారుల నిర్మాణానికి చర్యలు చేపట్టిందని తెలిపింది. దీంతో గ్రామీణ రవాణా వ్యవస్థలో భారీ మార్పులు రానున్నాయని పేర్కొంది. హైదరాబాద్ – విజయవాడ ఎనిమిది లేన్ల ఎక్స్ ప్రెస్‌వే, హైదరాబాద్–శ్రీశైలం ఎలివేటెడ్ కారిడార్, హైదరాబాద్–నాగ్‌పూర్ డబుల్ డెక్కర్ ఎలివేటెడ్ కారిడార్, రాజీవ్ రహదారిపై ఎలివేటెడ్ కారిడార్, హైదరాబాద్–అమరావతి–మచిలీపట్నం గ్రీన్‌ఫీల్డ్ ఎక్స్ ప్రెస్‌వే వంటి ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టులు రూపుదిద్దుకుంటున్నాయని వివరించింది. కోత్వాల్‌గూడ ట్రంపెట్ ఇంటర్చేంజ్, గచ్చిబౌలి–కొండాపూర్, కేబీఆర్ పార్కు పరిసరాల్లో ఫ్లైఓవర్లు, అండర్‌పాస్‌ల నిర్మాణంతో హైదరాబాద్ నగరంలో ట్రాఫిక్ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపేందుకు ప్రభుత్వం చర్యలు చేపడుతోందని తెలిపింది.
రూ. 18 వేల కోట్లతో ఆర్ఆర్ఆర్
హైదరాబాద్ చుట్టూ సుమారు రూ.18 వేల కోట్ల వ్యయంతో నిర్మించే రీజినల్ రింగ్ రోడ్ (ఆర్ఆర్ఆర్) ప్రాజెక్టు రాష్ట్ర అభివృద్ధిలో కీలక మైలురాయిగా మారనుందని రోడ్లు, భవనాల శాఖ పేర్కొంది. ఈ రహదారి సుమారు 340 కిలోమీటర్ల పొడవుతో రూపుదిద్దుకుంటోందని వివరించింది. సంగారెడ్డి, నర్సాపూర్, తూప్రాన్, గజ్వేల్, ప్రజ్ఞాపూర్, భువనగిరి, చౌటుప్పల్, ఇబ్రహీంపట్నం, అమనగల్, చేవెళ్ల, శంకర్పల్లి ప్రాంతాలను అనుసంధానించే ఈ ప్రాజెక్టు ద్వారా హైదరాబాద్‌పై ట్రాఫిక్ ఒత్తిడి తగ్గనుందని తెలిపింది. దీంతోపాటు జిల్లాల మధ్య వేగవంతమైన రవాణా సౌకర్యం అందుబాటులోకి రానుందని పేర్కొంది. ఉత్తర భాగం పనులు 161.5 కిలోమీటర్ల నిర్మాణానికి రూ.9,362 కోట్లతో టెండర్లను ఇప్పటికే ఆహ్వానించామని తెలిపింది. భవిష్యత్తులో ఈ రహదారి చుట్టూ పారిశ్రామిక, లాజిస్టిక్స్, వాణిజ్య కేంద్రాలు ఏర్పడే అవకాశం ఉందని పేర్కొంది. కరీంనగర్, వరంగల్, ఖమ్మం నగరాలకూ ఔటర్ రింగ్ రోడ్లు ప్రతిపాదించినట్టు వివరించింది.
ప్రభుత్వ భవనాల నిర్మాణానికీ ప్రభుత్వం సమాన ప్రాధాన్యం ఇస్తోందని తెలిపింది. రాజేంద్రనగర్‌లో రూ.2,583 కోట్లతో అత్యాధునిక హైకోర్టు భవన నిర్మాణం కొనసాగుతోందని పేర్కొంది. గోషామహల్లో రూ.2,700 కోట్లతో రెండు వేల పడకల ఉస్మానియా జనరల్ ఆస్పత్రి నిర్మాణం జరుగుతోందని వివరించింది.
హైదరాబాద్ రోడ్లకు మహర్దశ
హైదరాబాద్ రోడ్ల మరమ్మత్తులకు కసరత్తులు చేస్తున్నట్టు రోడ్లు, భవనాల శాఖ తెలిపింది. సమగ్ర రహదారి నిర్వహణ పథకం-2 (సీఆర్ఎంపీ-2) కింద పదేండ్లపాటు జీహెచ్ఎంసీ, మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్ (ఎంఎంసీ), సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (సీఎంసీ)లోని ప్రధాన రహదారుల నిర్వహణకు రూ.3,145 కోట్ల అంచనా వ్యయంతో ఇటీవల టెండర్లకు ఆహ్వానించామని పేర్కొంది. ఈ ప్రాజెక్టు పరిధిలో దాదాపు 1,000 కిలోమీటర్ల రహదారులున్నాయని వివరించింది. కొత్త బీటీ రోడ్ల పునర్నిర్మాణంలో ఆధునిక ఫుల్ డెప్త్ రిక్లమేషన్ (ఎఫ్ఎఆర్) టెక్నాలజీని వినియోగించనున్నామని తెలిపింది. జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, కేబీఆర్ పార్కు పరిసర ప్రాంతాల్లో పెరుగుతున్న వాహన రద్దీని తగ్గించేందుకు అండర్‌పాస్‌లు, ఫ్లైఓవర్ల నిర్మాణంతో పాటు ఆరు ప్రధాన జంక్షన్ల అభివృద్ధి పనులను సుమారు రూ. 826 కోట్ల వ్యయంతో చేపట్టనుంది.
ఎక్స్ ప్రెస్వేలు… ఎలివేటెడ్ కారిడార్లు..!
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



