Thursday, July 30, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంపట్టణంలో సొంతింటి కలకు ప్రభుత్వ భరోసా

పట్టణంలో సొంతింటి కలకు ప్రభుత్వ భరోసా

- Advertisement -

లక్ష ఇండ్ల నిర్మాణానికి శ్రీకారం
సమాచార, పౌరసంబంధాల శాఖ ప్రకటన
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్‌

ముఖ్యమంత్రి రేవంత్‌‌రెడ్డి నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం హైదరాబాద్‌లో లక్ష ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టింది. హైదరాబాద్‌లోని క్యూర్ ప్రాంతంలో తొలి దశగా 18 ప్రాజెక్టుల్లో 16 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో 7,340 అందుబాటు గృహాల నిర్మాణానికి రూ.807.40 కోట్ల పరిపాలన అనుమతి మంజూరు చేసింది. ప్రతి గృహానికి రూ.5 లక్షల సబ్సిడీ అందించనుంది. రాజేంద్రనగర్‌, మహేశ్వరం, శేరిలింగంపల్లి, ఇబ్రహీంపట్నం, మల్కాజిగిరి, నాంపల్లి, ఖైరతాబాద్‌, కార్వాన్‌, బహదూర్‌పురా, అంబర్‌పేట్‌, కూకట్‌పల్లి, మేడ్చల్‌, కుత్బుల్లాపూర్‌, సనత్‌నగర్‌, సికింద్రాబాద్‌ కంటోన్మెంట్‌, మలక్‌పేట్‌ నియోజకవర్గాల్లో ఈ గృహాలు నిర్మించనుంది. ప్రతి ఫ్లాట్‌ను 528 చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మించనుంది. భూమిని ప్రభుత్వం సమకూర్చడం, ఒక్కో గృహానికి రూ.5 లక్షల సబ్సిడీ అందించడం వల్ల లబ్ధిదారుడి వాటా రూ.6 లక్షలకు పరిమితమవుతుంది. ఓఆర్‌ఆర్‌ పరిధిలో సొంత ఇల్లు లేదా స్థలం లేని, వార్షిక కుటుంబ ఆదాయం రూ.6 లక్షల లోపు ఉన్న కుటుంబాలు మాత్రమే దరఖాస్తు చేసుకోవచ్చు. ఒక కుటుంబానికి ఒకే దరఖాస్తు, ఒకే ఫ్లాట్‌ మాత్రమే వర్తిస్తుంది. సంబంధిత అసెంబ్లీ నియోజకవర్గానికి చెందిన వారే అక్కడి ప్రాజెక్టుకు దరఖాస్తు చేయాలి. కేటాయించిన గృహాన్ని పదేండ్లపాటు విక్రయించడానికి లేదా అద్దెకు ఇవ్వడానికి అవకాశం ఉండదు. బ్యాంకు రుణాల కోసం తనఖా పెట్టుకునే వెసులుబాటును కల్పించింది. మీ-సేవ కేంద్రాల ద్వారా రూ.100 దరఖాస్తు రుసుముతో దరఖాస్తు చేసుకోవచ్చు. రూ.10,000 రిఫండబుల్‌ డిపాజిట్‌ చెల్లించాల్సి ఉంటుంది. అర్హతల పరిశీలన, లాటరీ ప్రక్రియ ద్వారా ఫ్లాట్లను కేటాయిస్తారు.
ఎంపిక కాని వారికి డిపాజిట్‌ను పూర్తిగా తిరిగి చెల్లించనుంది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, దివ్యాంగులతో పాటు ప్రభుత్వ ఉద్యోగులు, సాయుధ దళాల సిబ్బంది, పాత్రికేయులు తదితర ప్రత్యేక వర్గాలకు రిజర్వేషన్లు కల్పించనుంది. దరఖాస్తులను ఆగస్టు 10, 2026 సాయంత్రం 5 గంటలకు వరకు మీ-సేవ కేంద్రాల ద్వారా స్వీకరిస్తున్నారు.ఈ పథకానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలంగాణ హౌసింగ్‌ బోర్డు వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉన్నాయి. సందేహాల నివృత్తి కోసం 8031335905, 040-24603572 నంబర్లను సంప్రదించవచ్చని రాష్ట్ర సమాచార, పౌరసంబంధాల శాఖ పీఆర్‌‌వో ఎం. కిరణ్మయి ఒక ప్రకటనలో వివరించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -