Saturday, August 1, 2026
E-PAPER
Homeజాతీయంనేడు భోగాపురం ఎయిర్‌పోర్టు ప్రారంభం

నేడు భోగాపురం ఎయిర్‌పోర్టు ప్రారంభం

- Advertisement -

​జాతికి అంకితం చేయ‌నున్న ప్ర‌ధాని మోడీ
రూ.17,900 కోట్ల విలువైన బహుళ అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన, ప్రారంభోత్సవం

నవతెలంగాణ-న్యూఢిల్లీ బ్యూరో
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విజయనగరం జిల్లా భోగాపురంలో అల్లూరి సీతారా మరాజు అంతర్జాతీయ విమానాశ్రయాన్ని​ నేడు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రారంభించనున్నారు. అంతకుముందు అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం ప్యాసింజర్ టెర్మినల్ భవనాన్ని ప్రధాని ఉదయం 11 గంటలకు పరిశీలిస్తారు. అలాగే భోగాపురంలో రూ.17,900 కోట్ల విలువైన బహుళ అభివృద్ధి కార్యక్రమాలకు ఆయన శంకుస్థాపన, ప్రారంభోత్సవం చేస్తారు. అనంతరం ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభను ఉద్దేశించి ఆయన ప్రసంగిస్తారు. ​ఈ గ్రీన్‌ఫీల్డ్ విమానాశ్రయాన్ని ప్రభుత్వ-ప్రయివేటు భాగస్వామ్యం (పిపిపి) పద్ధతిలో రూ.5,640 కోట్లకు పైగా వ్యయంతో అభివృద్ధి చేశారు. ఏటా 60 లక్షల మంది ప్రయాణికులు రాకపోకలు సాగించేలా నిర్మించారు. ఈ విమానాశ్రయంలో కృత్రిమ మేధ (ఎఐ), బిల్డింగ్ ఇన్ఫర్మేషన్ మోడలింగ్ (బిఐఎం), ఎయిర్‌సైడ్ 4.0 సాంకేతిక పరిజ్ఞానాలు, ఎయిర్‌పోర్ట్ ప్రిడిక్టివ్ ఆపరేషన్స్ సెంటర్ (ఎపిఒసి), బయోమెట్రిక్ ప్యాసింజర్ ప్రాసెసింగ్, ఆటోమేటెడ్ బ్యాగేజి హ్యాండ్లింగ్ వ్యవస్థలు, ఇంటిలిజెంట్ ఆపరేషనల్ మానిటరింగ్ సొల్యూషన్స్ లాంటి అధునాతన సాంకేతిక పరిజ్ఞానాలను ఏర్పాటు చేశారు. అదే విధంగా విశాఖపట్నంలో రూ.460 కోట్లకు పైగా పెట్టుబడితో అభివృద్ధి చేస్తున్న ఎఎస్ఐపి సెమీకండక్టర్ ప్రాజెక్టుకు ప్రధానమంత్రి నరేంద్రమోడీ శంకుస్థాపన చేస్తారు. దీనిని కొరియా రిపబ్లిక్‌కు చెందిన ఎపిఎసిటి భాగస్వామ్యంతో ఎఎస్ఐపి టెక్నాలజీస్ ప్రయివేట్‌ లిమిటెడ్ సంస్థ అభివృద్ధి చేస్తోంది.

ఇది ఆంధ్రప్రదేశ్‌లో తొలి సెమీకండక్టర్ తయారీ కేంద్రం. ఈ ప్లాంట్ ఏటా సుమారు 96 మిలియన్ల సెమీకండక్టర్ చిప్‌లను తయారు చేయడంతో పాటు అధిక నైపుణ్యం కలిగిన ఉద్యోగావకాశాలను కల్పిస్తుంది.కర్నూల్- IV రెన్యువబుల్ ఎనర్జీ జోన్ (ఆర్ఈజెడ్)- ఫేజ్- I (4.5 గిగావాట్లు) ఏకీకరణ కోసం ఏర్పాటు చేసే సరఫరా వ్యవస్థకు ప్రధానమంత్రి శంకుస్థాపన చేస్తారు. దీనిని స్పెషల్ పర్పస్ వెహికల్ (ఎస్‌పివి)తో రూ.5,550 కోట్ల పెట్టుబడితో పవర్ గ్రిడ్ అమలు చేస్తోంది. రూ.3,550 కోట్ల వ్యయంతో నిర్మించే కర్నూలు పవన విద్యుత్ జోన్/సౌర విద్యుత్ జోన్ (ఆంధ్రప్రదేశ్)- పార్ట్ ఏ, పార్ట్ బి ట్రాన్స్‌మిషన్ వ్యవస్థను ప్రధాని ప్రారంభిస్తారు. అలాగే రూ.820 కోట్లకు పైగా వ్యయంతో నిర్మించిన అనంతపురం (2,500 మెగావాట్లు), కర్నూలు (1,000 మెగావాట్లు) సౌర విద్యుత్ జోన్ల ట్రాన్స్‌మిషన్ పథకాన్ని కూడా ప్రారంభిస్తారు. దీనిని పవర్ గ్రిడ్‌తో అమలు చేస్తున్నారు. ​అలాగే రూ.1,880 కోట్ల విలువైన జాతీయ రహదారి ప్రాజెక్టులకు శంకుస్థాపన చేస్తారు. జాతికి అంకితమిస్తారు.

ఎన్‌హెచ్-365బిజిలో రేచర్ల నుంచి గుర్వాయిగూడెం వరకు ఉన్న సెక్షన్‌లో నాలుగు లైన్ల ప్రవేశ నియంత్రిత గ్రీన్‌ఫీల్డ్ జాతీయ రహదారిని, ఎన్‌హెచ్-365బిజిలో గుర్వాయిగూడెం నుంచి దేవరపల్లి వరకు ఉన్న సెక్షన్‌లో నాలుగు లైన్ల ప్రవేశ నియంత్రిత గ్రీన్‌ఫీల్డ్ జాతీయ రహదారిని, ఎన్‌హెచ్-67పై నాలుగు లైన్ల తాడిపత్రి బైపాస్‌నూ జాతికి అంకితమిస్తారు. ఎన్‌హెచ్-565లోని పెంచలకోన-యేర్పేడు విభాగంలో లింగసముద్రం వద్ద హైలెవెల్ వంతెనకు కూడా ప్రధాని మోడీ శంకుస్థాపన చేస్తారు. ఈ ప్రాజెక్టులన్నీ విజయవాడ, ఇతర నగరాల్లో ట్రాఫిక్ రద్దీని తగ్గిస్తాయి. రోడ్డు భద్రతను పెంపొందిస్తాయి. విశాఖపట్నం నుంచి హైదరాబాద్‌ మధ్య ప్రయాణ దూరాన్ని, ప్రయాణ సమయాన్ని తగ్గిస్తాయి. ప్రాంతీయ అనుసంధానాన్ని పెంపొందిస్తాయి. అనంతరం మధ్యాహ్నం 3:30కు ప్రధాని నరేంద్ర మోడీ మైసూరులోని రామకృష్ణ ఆశ్రమంలో స్వామి వివేకానంద కల్చరల్ యూత్ సెంటర్-వివేక స్మారకాన్ని ప్రారంభిస్తారు. అలాగే అక్కడ ఏర్పాటు చేసిన సభను ఉద్దేశించి ప్రసంగిస్తారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -