Monday, August 3, 2026
E-PAPER
Homeఆటలుబుమ్రా లేకుండానే!

బుమ్రా లేకుండానే!

- Advertisement -

ఫిట్‌‌నెస్‌ సాధించని పేస్‌ దళపతి
విశ్రాంతి సూచించిన వైద్య బృందం
4న కొలంబోకు భారత జట్టు పయనం

నవతెలంగాణ-ముంబయి
శ్రీలంక పర్యటనకు ముందే టీమ్‌ ఇండియాకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. గాయాలతో హర్షిత్‌ ‌రానా, వాషింగ్టన్‌ ‌సుందర్‌ ఇప్పటికే దూరం కాగా.. తాజాగా పేస్ దళపతి జశ్‌‌ప్రీత్‌ ‌బుమ్రా సైతం శ్రీలంకతో టెస్టు సిరీస్‌‌కు అందుబాటులో ఉండటం లేదు. బెంగళూరులోని సెంటర్‌ ఫర్‌ ఎక్సలెన్స్‌ (సీఓఈ)లో బీసీసీఐ వైద్య బృందం బుమ్రాకు మరింత విశ్రాంతి అవసరమని సూచించారు. జులై 16న ఇంగ్లాండ్‌‌తో రెండో వన్డేలో జశ్‌‌ప్రీత్‌ ‌బుమ్రా మోకాలి గాయానికి గురైన సంగతి తెలిసిందే. ఇంపాక్ట్‌ ఇంజూరీ కావటంతో మూడో వన్డేకు విశ్రాంతి ఇస్తే సరిపోతుందని తొలుత భావించినా, తాజాగా గాయం తీవ్రతపై వైద్య బృందం ఓ అంచనాకు వచ్చినట్టు తెలుస్తోంది. రెండు మ్యాచ్‌‌ల టెస్టు సిరీస్‌‌కు బుమ్రా దూరం కావటంతో అతడి స్థానంలో మరో పేస్‌ ‌బౌలర్‌‌ను జట్టులోకి తీసుకోవాల్సి వచ్చింది.

​నబికి అవకాశం?
గాయంతో జశ్‌‌ప్రీత్‌ ‌బుమ్రా టెస్టు సిరీస్‌‌కు దూరం కాగా.. అతడి స్థానంలో ఎవరిని ఎంపిక చేస్తారనే ఆసక్తి అభిమానుల్లో నెలకొంది. దేశవాళీ సర్క్యూట్‌‌లో నిలకడగా రాణిస్తున్న జమ్మూ కశ్మీర్‌ ‌పేసర్‌ అకిబ్‌ ‌నబికి అవకాశం దక్కవచ్చనే అంచనాలు బలంగా వినిపిస్తున్నాయి. యువ పేసర్‌ అన్షుల్‌ ‌కాంబోజ్‌ సహా ముకేశ్‌ ‌కుమార్‌, యశ్‌ ‌ఠాకూర్‌, అర్ష్‌‌దీప్‌ ‌సింగ్‌ ‌పేర్లు సెలక్షన్‌ ‌కమిటీ పరిశీలనలో ఉన్నట్టు తెలుస్తోంది.

​4న కొలంబోకు పయనం
రెండు మ్యాచ్‌‌ల టెస్టు సిరీస్‌ ‌కోసం ఈ నెల 4న భారత జట్టు శ్రీలంకకు బయల్దేరనుంది. ఆగస్టు 15న గాలెలో తొలి టెస్టు జరుగనుండగా.. 7 నుంచి కొలంబోలో టీమ్‌ ఇండియా వార్మప్‌ ‌మ్యాచ్‌ ఆడాల్సి వచ్చింది. ప్రాక్టీస్‌ ‌మ్యాచ్‌‌ను తొలుత 4 రోజులకు షెడ్యూల్‌ ‌చేసినా.. తాజాగా ఆ మ్యాచ్‌‌ను మూడు రోజులకు కుదించారు. 4న కొలంబోకు చేరుకోనున్న శుభ్‌‌మన్‌ ‌గిల్‌ ‌సేన అక్కడ 9 వరకు ప్రాక్టీస్‌ ‌మ్యాచ్‌ ఆడనుంది. అక్కడ్నుంచి తొలి టెస్టు వేదిక గాలెకు వెళ్లనుంది. భారత్‌, శ్రీలంక టెస్టు సిరీస్‌ ఐసీసీ ప్రపంచ టెస్టు చాంపియన్‌‌షిప్‌లో భాగం కావటంతో ఇరు జట్లు ఈ సిరీస్‌‌ను ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నాయి. ఐసీసీ ప్రపంచ టెస్టు చాంపియన్‌‌షిప్‌ ‌పాయింట్ల పట్టికలో భారత్‌ ఐదో స్థానంలో ఉండగా, శ్రీలంక ఆరో స్థానంలో కొనసాగుతోంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -