రాహుల్ గాంధీకి కేటీఆర్ లేఖ
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
ఇంజినీరింగ్ విద్యార్థులను, ఇంజినీర్లను క్రిమినల్ వేస్ట్ అన్న ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిపై కాంగ్రెస్ పార్టీ అధిష్టానం చర్యలు తీసుకోవాలని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆదివారం ఆ పార్టీ పార్లమెంట్ పక్ష నాయకులు రాహుల్ గాంధీకి లేఖ రాశారు. సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై స్పందించాల్సిన నైతిక, రాజకీయ బాధ్యత రాహుల్ గాంధీపై ఉందని లేఖలో గుర్తు చేశారు. ప్రజాస్వామ్యం, రాజ్యాంగం, నైతికత, యువతకు దక్కాల్సిన గౌరవం వంటి అంశాలపై మాట్లాడే అర్హత రాహుల్ కోల్పోయారని విమర్శించారు. భారతదేశ ఇంజినీర్లు ప్రపంచ కంపెనీలను నడుపుతూ అంతరిక్షంలోకి రాకెట్లను పంపుతూ దేశాన్ని శాస్ర్త, సాంకేతిక రంగాల్లో అగ్రగామిగా నిలుపుతున్నారని కొనియాడారు. అలాంటి వారిని క్రిమినల్ వేస్ట్ అనడమే కాంగ్రెస్ పార్టీ విధానమా? అంటూ ప్రశ్నించారు. రాహుల్ ఈ అంశంలో మౌనంగా ఉండటమంటే ఆ వ్యాఖ్యలను సమర్థించినట్లేనని కేటీఆర్ అన్నారు. రేవంత్ రెడ్డితో వెంటనే సీఎం పదవికి రాజీనామా చేయించాలని డిమాండ్ చేశారు. యువతతో పెట్టుకుంటే ఏమైందో రాహుల్ గాంధీ నానమ్మ ఇందిరమ్మకు ఎమర్జెన్సీ సమయంలో, తెలంగాణ ఉద్యమ సమయంలో యూపీఏకు తెలుసని ప్రస్తావించారు. యువత తలుచుకుంటే ఏదైనా సాధ్యమేననే విషయం గుర్తుంచుకోవాలన్నారు. తెలంగాణ యువతను మభ్యపెట్టిన రాహుల్ గాంధీకి తన నైతిక బాధ్యతను గుర్తు చేయడానికే ఈ లేఖ రాస్తున్నానని స్పష్టం చేశారు. కాంగ్రెస్ హామీల పేరుతో మోసపోయిన యువత సరైన సమయంలో తగిన సమాధానం చెబుతుందని కేటీఆర్ హెచ్చరించారు.
సీఎం రేవంత్‌రెడ్డిపై చర్యలు తీసుకోండి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



