Monday, August 3, 2026
E-PAPER
Homeప్రధాన వార్తలుఘనంగా ఉజ్జయిని మహంకాళి బోనాల జాతర

ఘనంగా ఉజ్జయిని మహంకాళి బోనాల జాతర

- Advertisement -

అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించిన సీఎం రేవంత్ రెడ్డి
కుటుంబ సమేతంగా తొలి బంగారు బోనం సమర్పించిన మంత్రి పొన్నం ప్రభాకర్
భారీగా తరలివచ్చిన భక్తజనం.. ముమ్మర ఏర్పాట్లు చేసిన యంత్రాంగం
దర్శించుకున్న పలువురు మంత్రులు, రాజకీయ ప్రముఖులు
జాతరలో ఏర్పాట్లపై జోగినుల ఆవేదన నేటి భవిష్యవాణికి ఏర్పాట్లు పూర్తి

నవతెలంగాణ-సిటీబ్యూరో/బేగంపేట
సికింద్రాబాద్ శ్రీ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి బోనాల జాతర ఆదివారం అత్యంత వైభవంగా జరిగింది. తెలంగాణ రాష్ట్ర నలుమూలల నుంచే కాకుండా పొరుగు రాష్ట్రాల నుంచి కూడా భక్తులు వేలాదిగా తరలివచ్చి అమ్మవారికి బోనాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వం తరపున ముఖ్యమంత్రి ఏ. రేవంత్ రెడ్డి అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆయనతో పాటు మంత్రులు పొన్నం ప్రభాకర్, కొండా సురేఖ, అనుసూయ (సీతక్క) అమ్మవారికి బంగారు బోనం సమర్పించారు. అంతకుముందు స్థానిక ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్‌ ‌యాదవ్‌, దేవాదాయ శాఖ కమిషనర్‌ ‌హన్మంతరావు, ఈవో గుత్తా మనోహర్‌ ‌రెడ్డి ముఖ్యమంత్రికి స్వాగతం పలికారు. ​ఆలయ అధికారులు, అర్చకులు పూర్ణకుంభంతో సీఎంకు ఘనంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా అర్చకులు సీఎం రేవంత్ రెడ్డికి తీర్థప్రసాదాలు అందజేసి వేదాశీర్వచనం పలికారు. ​

తొలి బంగారు బోనం సమర్పించిన మంత్రి పొన్నం
అంతకుముందు ఉదయం 4.05 గంటలకు జిల్లా ఇన్‌‌చార్జి మంత్రి పొన్నం ప్రభాకర్ కుటుంబ సమేతంగా విచ్చేసి అమ్మవారికి తొలి బంగారు బోనంతో పాటు ప్రభుత్వం తరపున పట్టు వస్త్రాలు సమర్పించి పూజలు చేశారు. శ్రీ ఉజ్జయిని మహంకాళి బోనాల ఉత్సవాల సందర్భంగా రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు.

ఆలయానికి ప్రముఖుల తాకిడి
బోనాల జాతర సందర్భంగా ఉజ్జయిని మహంకాళి అమ్మవారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. హర్యానా మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ, ఎంపీ ఈటల రాజేందర్, రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర, టీపీసీసీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ మహేశ్‌ కుమార్ గౌడ్, ప్రభుత్వ సలహాదారు వి.హనుమంతరావు, బీఆర్‌ఎస్‌ ‌వర్కింగ్‌ ‌ప్రెసిడెంట్‌, ఎమ్మెల్యే కేటీఆర్‌, ఎమ్మెల్యేలు దానం నాగేందర్, తలసాని శ్రీనివాస్ యాదవ్, జగదీష్ రెడ్డి, మల్లారెడ్డి, కాలేరు వెంకటేష్, మర్రి రాజశేఖర్ రెడ్డి, శ్రీ గణేష్, నవీన్ యాదవ్, సాంస్కృతిక సారథి చైర్మెన్‌ వెన్నెల, సికింద్రాబాద్‌ ‌కాంగ్రెస్‌ ‌పార్టీ అధ్యక్షులు దీపక్‌ ‌జాన్‌, సనత్‌‌నగర్‌ కాంగ్రెస్‌ ఇన్‌‌చార్జి కోట నీలిమ, సీపీ సజ్జనార్, జిల్లా కలెక్టర్ డాక్టర్ ప్రియాంక ఆల తదితరులు అమ్మవారిని దర్శించుకొని పూజలు నిర్వహించారు. అమెరికా కాన్సుల్‌ ‌జనరల్‌ ‌లారా ఈ.విలియమ్స్‌, హీరోయిన్‌ ‌వైష్ణవి అమ్మవారికి బోనం సమర్పించి.. ప్రత్యేక పూజలు నిర్వహించారు.

అధికారుల నిరంతర పర్యవేక్షణ
భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అధికార యంత్రాంగం సకల ఏర్పాట్లు చేసింది. దేవాలయ చైర్మెన్‌ రామేశ్వర్, దేవాదాయ శాఖ కమిషనర్ హనుమంతరావు, సికింద్రాబాద్ ఆర్డీవో సాయిరాం, ఈవో మనోహర్ రెడ్డితో పాటు జీహెచ్‌ఎంసీ, హెచ్‌ఎమ్‌డబ్ల్యూఎస్‌ఎస్‌బీ, మెడికల్, ఫైర్, విద్యుత్, పోలీస్ శాఖల అధికారులు నిరంతరం క్షేత్రస్థాయిలో పర్యవేక్షించారు. ఆలయ పరిసరాల్లో ఉచిత వైద్య శిబిరాలు, మంచినీటి కేంద్రాలను ఏర్పాటు చేశారు. పారిశుద్ధ్య సిబ్బంది నిరంతరం ఆలయ ప్రాంగణాన్ని పరిశుభ్రంగా ఉంచేలా చర్యలు తీసుకున్నారు. విద్యుత్ అంతరాయం కలగకుండా ప్రత్యేక చర్యలు చేపట్టారు. ఎ లాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఫైర్ ఇంజన్లు, అంబులెన్సులను సిద్ధంగా ఉంచారు.​​

బోనాల్లో అప‌శృతి.. జోగినుల కన్నీటి ఆవేదన!
సికింద్రాబాద్‌ శ్రీ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి బోనాల జాతరలో ఏర్పాట్ల లోపం, రద్దీ నియంత్రణ రాహిత్యంపై జోగినులు, శివసత్తులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. అమ్మవారికి అత్యంత భక్తిశ్రద్ధలతో బోనం సమర్పించేందుకు వచ్చిన తమకు ఆలయ యంత్రాంగం, పోలీసుల నుంచి సరైన సహకారం అందలేదని జోగిని శ్యామలతో పాటు పలువురు జోగినులు కన్నీటిపర్యంత మయ్యారు. తరతరాలుగా సంప్రదాయబద్ధంగా అమ్మవా రికి బోనాలు సమర్పిస్తూ సేవలు అందిస్తున్న తమకు ఆలయం వద్ద కనీస గౌరవం, ప్రాధాన్యత ఇవ్వలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. రద్దీ ఎక్కువగా ఉండటం, తోపులాట జరగడంతో ఎంతో నిష్టతో నెత్తిన ఎత్తుకొచ్చిన బోనాలు కిందపడే పరిస్థితి వచ్చిందని తెలిపారు. అధికారులు కేవలం వీఐపీలకే ప్రాధాన్యత ఇస్తూ, భక్తితో వచ్చిన జోగినులను, భక్తులను తీవ్ర ఇబ్బం దులకు గురిచేశారని, ఇకనైనా ప్రభుత్వం స్పందించి, రాబోయే రోజుల్లో శివసత్తులకు, జోగినులకు సముచిత స్థానం కల్పించి, దర్శనానికి ప్రత్యేక మార్గాలు ఏర్పాటు చేయాలని కోరారు. సాధారణ క్యూలైన్‌‌లో వచ్చే భక్తులు, బోనాలతో వచ్చిన వారు సరైన సౌకర్యాలు లేవని అసహ నం వ్యక్తం చేశారు. అక్కడక్కడ పోలీసులు కొంత అత్యుత్సహం ప్రదర్శించారు. అమ్మవారి బోనాల ఉత్సవాల్లో భాగంగా సోమవారం నిర్వహించనున్న భవిష్యవాణి(రంగం) కార్యక్రమానికి ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు పూర్తిచేసింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -